తెలుగు రాజకీయాల్లో కేసీయార్, జగన్ అంటే జాన్జిగ్రీ దోస్తులు… ఇద్దరూ కలిసినప్పుడు ఆప్యాయంగా అలుముకుంటరు… ఇద్దరూ కలిసి వేల కోట్ల భారీ నీటి ప్రాజెక్టులు కట్టాలని ప్లాన్లు గీస్తరు… ఒకరికొకరు సాయం చేసుకుంటరు… చివరకు జగన్ శ్రీశైలం నీళ్లను తరలించేందుకు పోతిరెడ్డిపాడు పొక్క వెడల్పు చేయాలనీ, సీమ లిఫ్టు కట్టాలనీ యుద్ధప్రాతిపదికన టిప్పర్లు, జేసీబీల్ని పరుగులు తీయిస్తున్నా సరే కేసీయార్ చాలారోజులపాటు చూస్తూ కూర్చున్నడు… పోయిన ఎన్నికల్లో కేసీయార్ జగన్ గెలుపు కోసం మస్తు సాయం కూడా చేసిండు… అదీ జగన్, కేసీయార్ దోస్తీ అంటే..! ఇదే కదా బయటికి కనిపించేది..!! మరి అంతటి ‘తన ప్రియమిత్రుడు జగన్’ పాలనపై కేసీయార్ పరోక్షంగా ఎందుకలా చురకలు వేశాడు..? ఇదీ ఇప్పుడు ఏపీ, తెలంగాణ సమాజాల్లో కాస్త ఇంట్రస్టింగుగా సాగుతున్న చర్చ… అఫ్కోర్స్, కేసీయార్ చాలాసార్లు ఏదేదో మాట్లాడతాడు, కానీ ఒక పొరుగు రాష్ట్రం సీఎం పాలనపై పరోక్షంగా వ్యాఖ్యలు చేయడం విశేషమే…
టీఆర్ఎస్ 20 ఏళ్ల ప్లీనరీ సమావేశాలు జరిగాయి… కేసీయార్ మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు… ఐనా తను అధ్యక్షుడు కాకపోతేనే వార్త, అయితే అందులో వార్తేముంది..? టీఆర్ఎస్ ఓనర్షిప్ ఎవరిది అని అప్పట్లో ఈటల తెగబాధపడ్డాడు, చివరకు తనే పార్టీ నుంచి బయటికి వెళ్లగొట్టబడ్డాడు తప్ప ఆ ఓనర్షిప్ విషయంలో తెలంగాణ సమాజానికి మస్తు క్లారిటీ ఉంది… టీఆర్ఎస్ అంటే అది కేసీయార్ సొంత పార్టీ… సాధారణంగా ఏదైనా రాజకీయ పార్టీ ప్లీనరీ అంటే గత కాలంలో తాము అనుసరించిన రాజకీయ ధోరణులు, తప్పొప్పుల సమీక్ష, రాబోయే కాలంలో తీసుకోవాల్సిన పొలిటికల్ లైన్ ఎట్సెట్రా చర్చలు, తీర్మానాలు గట్రా ఉంటయ్… ఇక్కడ అవేవీ కనిపించిన దాఖలాల్లేవు… మీడియా కూడా అక్కడ పెట్టిన ఫుడ్లో వెరయిటీల మీద ఘుమఘుమలాడే వార్తలు రాసుకుంది తప్ప దానికీ ఇంకేమీ పట్టలేదు… పట్టినా, అక్కడ పట్టించుకునేవాళ్లు ఎవరూ ఉండరు…
Ads
తన ప్రసంగంలో తన పార్టీ గురించో, తన పాలన గురించో కేసీయార్ గొప్పలు చెప్పుకోవడంలో తప్పులేదు… అసాధారణం కూడా కాదు… అందులో భాగంగానే తమ పథకాలు చూసి దేశమే అబ్బురపడుతోందనీ, రాయచూర్, నాందేడ్ తదితర ఇతర రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, ప్రజలు కూడా తమను తెలంగాణలో కలపాలని కోరుకుంటున్నారనీ అన్నాడు… ‘‘తెలంగాణలో దళితబంధు పథకం పెట్టాక ఏపీలో ప్రజలు కూడా ఏపీలో పార్టీ పెట్టాలంటూ అడుగుతున్నారు… అసలు ఎక్కడి తెలంగాణ..? ఎక్కడి ఏపీ..? అసలు ఇప్పుడు రెండు రాష్ట్రాలకూ పొంతనే లేదు… ఏపీలో తలసరి ఆదాయం 1.7 లక్షల కోట్లు, తెలంగాణ తలసరి ఆదాయం 2.3 లక్షల కోట్లు (తలసరి ఆదాయం అంటేనే సగటు మనిషి ఆదాయం లెక్కవేయాలి కదా, మరి ఇన్ని వేలు, లక్షల కోట్ల లెక్కేమిటో మరి..?)… మాకు పాలనే రాదన్నారు ఒకప్పుడు… ఇప్పుడు వ్యవసాయ ఉత్పత్తిలో కూడా నెంబర్ వన్… ఇంత పంటను కేంద్రమే కొనలేకపోతోంది… అప్పట్లో చీకటిపాలవుతారూ అన్నారు మనల్ని, కానీ ఇప్పుడు తెలంగాణలో 24 గంటల కరెంటు, ఏపీలో కరెంటు కోతలు…’’ ఇలా సాగిపోయింది కేసీయార్ ప్రసంగం… మేం గొప్పగా పాలిస్తున్నామహో అని చాటింపు వేసుకోవడం తప్పేమీ కాదు, కానీ ఇక్కడ ఇవన్నీ పరోక్షంగా ఏపీ పాలన… అంటే, జగన్ పాలనపై విసుర్లే… ఫాఫం, ఆయనేమో లక్షల కోట్ల కొత్త అప్పులు తెచ్చి మరీ జనానికి పదీపదిహేను చేతులతో పంచిపెడుతూ ఉన్నాడు… కానీ జనం మాత్రం ‘‘సార్, సార్, ప్లీజ్, ఏపీలో పార్టీ పెట్టండి సార్, గెలిపించుకుంటాం సార్’’ అని కేసీయార్ను అడుగుతున్నారట… ఏమిటీ కంట్రాస్ట్ జగన్ సార్..? కేసీయార్తో సంబంధాల్లో ఏమైనా కొత్త గడబిడ ఉందా..?! అన్నట్టూ… మహారాష్ట్ర, కర్నాటక, ఏపీలోని ప్రాంతాలే కాదు, తమిళనాడు, కేరళ, ఒడిశా, చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ప్రజలు తమల్ని కూడా తెలంగాణలో కలిపేయాలంటూ కొత్తగా ఉద్యమాలు చేస్తే… తెలంగాణ భౌగోళికంగా కూడా బాగా విస్తరించే అవకాశాలున్నయ్..!!!
Share this Article