ఈటలను తన నియోజకవర్గంలోనే ఓడించి కక్ష తీర్చుకోవాలని కేసీయార్ భేదోపాయంలో వెళ్తున్నాడా..? లేక ఎదుటి పక్షంలోనూ తన వాళ్లు కొందరు ఉండాలనే భావనతో గట్టిగా ప్రయత్నిస్తున్నాడా..? ఏమో, అవసరం రావచ్చు కదా… ఈసారి కూడా గెలిచి, హ్యాట్రిక్ కొట్టడానికి ప్రతి నియోజకవర్గంలోనూ ఓ ప్రత్యేక వ్యూహాన్ని రచిస్తున్నాడా…?
రకరకాల ప్రశ్నలు ఎందుకొస్తున్నాయ్..? కరీంనగర్ జిల్లాలోని రెండు నియోజకవర్గాలు… కెప్టెన్ లక్ష్మికాంతరావు ప్రభావం, పట్టు బలంగా ఉన్న స్థానాలు… ఆయన బీఆర్ఎస్, కేసీయార్‌కు సంబంధించి ఎంత ముఖ్యుడూ అంటే… ఆయన మాటను కేసీయార్ జవదాటడని ప్రతీతి… కేసీయార్ అత్యంత గౌరవాన్ని ఇచ్చే అతికొద్దిమంది లిస్టులో కెప్టెన్ కూడా ఉంటాడు…
Ads
ఆయన కుమారుడు వొడితెల సతీష్… ఎమ్మెల్యే… ఆయనకు కూడా మంచి పేరే ఉంది ప్రజల్లో… కెప్టెన్ అన్న రాజేశ్వరరావు మనమడు ప్రణవ్… ప్రణవ్ బాబు అంటుంటారు… హఠాత్తుగా ఢిల్లీలో తేలి, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం కరీంనగర్ రాజకీయాల్లో సంచలనం… ఇప్పటికీ కెప్టెన్‌ది ఉమ్మడి కుటుంబం… ఒకేమాట, ఒకేబాటగా ఉంటుంటారు… మరి అలాంటప్పుడు కెప్టెన్ మనమడు కాంగ్రెస్‌లో చేరడం ఏమిటి..? కేసీయార్‌కు తెలిసే జరిగిన పరిణామమా ఇది..?
రేప్పొద్దున హుజూరాబాద్‌లో ప్రణవ్ కాంగ్రెస్ అభ్యర్థి అవుతాడా..? ఇదీ ప్రశ్న… మొన్నమొన్నటిదాకా ఎన్ఎస్‌యుఐ నేత బల్మూరి వెంకట్ పేరు వినిపించేది… రేవంత్‌రెడ్డి ఫాలోయర్… ఇప్పుడు ప్రణవ్ గనుక అభ్యర్థి అవుతే రేవంత్ రెడ్డి బలాన్ని ఎంతోకొంత తగ్గించినట్టు అవుతుంది… అలాగే కాంగ్రెస్, బీజేపీ వోట్లు బలంగా చీలిపోయి బీఆర్ఎస్ గట్టెక్కడానికా ఈ వ్యూహం..? ఒకవేళ కాంగ్రెసే గెలిచినా సరే, అవసరాన్ని బట్టి కేసీయార్‌కు కొన్ని చాన్సెస్ ఉంటాయనేదేనా ఈ వ్యూహం సారాంశం..? ఇలా ప్రతి స్థానానికీ తనదైన వ్యూహం అమలు చేయబోతున్నాడు కేసీయార్…
నిజానికి కాంగ్రెస్ ఊపు బాగా పెరిగిందనేది నిజం… అయితే దాన్ని దెబ్బతీయడానికి కేసీయార్ వ్యూహాలు విడిగా అక్కర్లేదు… వాళ్లలోవాళ్లే చిచ్చు పెట్టుకోగలరు… దాన్ని రాబోయే రోజుల్లో ఎలా వాడుకోవాలనేదే కేసీయార్ చాణక్యం… కాంగ్రెస్‌లో కేసీయార్ మార్క్ కోవర్టులున్నారనే ప్రచారం ఈరోజుది కాదు… వాళ్లు రేవంత్‌రెడ్డి నాయకత్వానికీ విరోధులు… అదుగో, కాంగ్రెస్ ఎన్నికల ఆశల్ని వాళ్లు ఎలా దెబ్బకొడతారు, కేసీయార్‌కు ఎలా ఉపయోగపడతారు అనేదే ప్రస్తుతం చర్చనీయాంశం…
విచిత్రంగా బీఆర్ఎస్ నేతలు… త్వరలో మా మానిఫెస్టో అబ్బురపడే రీతిలో వస్తుందీ అంటున్నారు… హరీశ్ రావు సైతం అదే మాట… ఇన్నేళ్ల తమ పాలనను చూసి మళ్లీ మాకే పట్టం కడతారు ప్రజలు అనకుండా… కాంగ్రెస్ సిక్స్ గ్యారంటీలకు ప్రతిగా ఇంకా ఏవో కొత్త హామీలు గుప్పిస్తారట… పింఛన్లు పెంచుతారట… అంటే కాంగ్రెస్ సిక్స్ గ్యారంటీల ప్రభావాన్ని బీఆర్ఎస్ గుర్తిస్తున్నదన్నమాట… అవి జనంలోకి బాగానే వెళ్లాయని పరోక్షంగా అంగీకరిస్తున్నదన్నమాట… అందుకే కొత్త వరాల ఆరాటం… ఇంకోవైపు కాంగ్రెస్ కొత్త హామీలకూ రెడీ అవుతోందట… కల్యాణలక్ష్మి కింద లక్ష రూపాయలకుతోడు తులం బంగారం ఇస్తారట… (అధికారం అయితే దక్కనీ, అమలు సంగతి తరువాత చూద్దాం…)
బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్‌గా ఈటల సాధించింది శూన్యం… పైగా నాయకులు బీజేపీని వీడి కాంగ్రెస్ వైపు వెళ్లడానికి రెడీ అయిపోతున్నారు… ఏమో, జేపీ నడ్డా హైదరాబాద్ వచ్చి ఏవో రాజీలు, బుజ్జగింపులు చేస్తున్నా సరే పెద్ద ఫలితం కనిపిస్తున్నట్టు లేదు… బీజేపీ హైకమాండ్ తీసుకునే నిర్ణయాలు తెలంగాణలో బీజేపీ గ్రాఫ్‌ను పడేస్తున్నయ్… ఈ స్థితిలో ఈటల ప్రాముఖ్యం పడిపోయింది… మరోవైపు వివేకా వెంకటస్వామి కూడా పార్టీలో కొనసాగడంపై డోలాయమానంలో ఉండటం కరీంనగర్ ఉమ్మడి జిల్లా రాజకీయాల్ని చర్చనీయాంశం చేస్తోంది…
జనగామలో ముత్తిరెడ్డి మీద ప్రేమ లేక కాదు… తనకు బాగా సన్నిహితుడైన పల్లాను అక్కడ అకామిడేట్ చేయడం కేసీయార్ లక్ష్యం… అందుకే ముత్తిరెడ్డి పేరు తొలి జాబితాలో ఎగిరిపోయింది… కడియంను అకామిడేట్ చేయడం కోసం రాజయ్య పేరు ఎగిరిపోయింది… రాజయ్య మీద వ్యతిరేకతతో కాదు… జనానికి దూరమయ్యారు అనే కారణంతో టికెట్లు నిరాకరిస్తే సగం మందికి పైగా సిట్టింగులకు టికెట్లు రావు… సో, ప్రతి సీటుకూ కేసీయార్‌కు ఓ స్ట్రాటజీ… సామదానభేదదండోపాయాలు అన్నీ… ఫలిస్తుందా లేదా వేరే సంగతి… కానీ కేసీయార్ మార్క్ రాజకీయ చాణక్యం మాత్రం విశేషమే…
Share this Article