నిజమే అయితే… ఇక కేసీయార్ ఏకంగా కేంద్ర హోం మంత్రి, బీజేపీ వ్యవహారాల కీలక సూత్రధారి అమిత్ షాను ఉచ్చులోకి లాగబోతున్నాడు అనే తాజా వార్తలే గనుక నిజమైతే… ‘ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసు’లో సిట్‌ను నేరుగా ఢిల్లీ చిన పాదుషా పైకే ప్రయోగించడమే నిజమైతే… పోరాటం మరింతగా రక్తికడుతుంది… (ఇక్కడ రక్తికట్టడం అనే పదం వాడటానికి కారణం… ఇవేవీ చివరకు ‘వర్కవుట్’ అయ్యే కేసులేమీ కావు అని… ఒకరినొకరు ఇరికించడం కోసం, పొలిటికల్‌గా బదనాం చేయడం కోసం వేస్తున్న రాజకీయ ఎత్తుగడలే కాబట్టి…!)
‘‘హమ్మా, నువ్వు మా కవితకు 160 సెక్షన్ నోటీసులు పంపిస్తావా..? ఆయ్ఁ మా చంద్రబాబు భాషలో చెప్పాలంటే నీకు సీబీఐ ఉంటే, నాకు సిట్ ఉంది… నువ్వు 160 సెక్షన్ అంటే నేనూ 160 సెక్షన్ అంటాను… నువ్వు 41 సెక్షన్ వరకూ వెళ్తావా, నేనూ ఆ రూటులోనే వెళ్తాను… సీబీఐ హైదరాబాద్ వస్తే, సిట్ పోలీసులు ఢిల్లీ రాలేరా ఏం..? కమాన్, చూసుకుందాం, నీ పెతాపమో, నా పెతాపమో… ’’
అలాగని కేసీయార్ నిజంగానే షాను ఉచ్చులోకి లాగడానికి సాహసించడు అని మాత్రం అనుకోవడానికి వీల్లేదు… ఆ వీడియోల ప్లాన్ మంచు విష్ణు సినిమా జిన్నాలాగా అట్టర్ ఫ్లాపయ్యేసరికి ఉడికిపోతున్నాడు… మరోవైపు కవితకు కేంద్రం ఉచ్చు బిగిస్తోంది… సో, బీఎల్ సంతోష్‌ను ఇరికించినట్టే అమిత్ షాను కూడా ఇరికిస్తే సరి… ‘‘చూద్దాం, మా కవితలాగే అమిత్ షా కూడా ఎఫ్ఐఆర్‌లో నా పేరు లేదు, ఢిల్లీలోని నా నివాసంలో ఫలానా తేదీల్లో అందుబాటులో ఉంటాను అని సమాధానం ఇస్తాడా చూద్దాం…’’
Ads
‘‘యుద్ధం అంటే యుద్ధమే… కురుక్షేత్రం అంటే కాఠిన్యమే తప్ప కరుణరసమేమీ ఉండదుగా… అమిత్ షా కాకపోతే ప్రధాని మోడీకే నోటీసులు పంపిస్తే సరి… ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానిపై కేసు పెట్టడం అంటే మామూలు విషయమా..? దేశమంతా రచ్చ రచ్చ అయిపోతుందిగా… మా బీఆర్ఎస్‌కు ఇంకేం లాంచింగ్ క్యాంపెయిన్ కావాలి..? ప్రపంచంలోనే తొలి సంఘటన అయిపోతుంది… నిజంగానే మోడీ ఏం చేయగలడు..?
సర్జికల్ స్ట్రయిక్స్ చేయిస్తాడాా..? అజిత్ ధోవల్ ఇక్కడికే వచ్చి పీఠమేసుకుని కూర్చుని, కంటోన్మెంట్ జవాన్లను మా సిట్ మీదకు పంపిస్తాడా…? మహా అయితే ఇంకేదో కేసు పెట్టి జైళ్లో వేస్తారు అంతేకదా… నన్ను టచ్ చేసే దమ్ముందా వాళ్లకు..? మా దగ్గరున్న వీడియోల్లో 20 సార్లు అమిత్ షా పేరుంది కాబట్టి, కేసులో పెట్టేస్తాం… కడుక్కోవడం నీ తీట… ప్రధానికీ అదే చట్టం వర్తిస్తుంది… మేం ముందే చెప్పాం, నువ్వు గోకినా గోకకపోయినా మేమయితే గోకుతూనే ఉంటామని చెప్పాం… మీకే అర్థం కాలేదు… చేసుకుంటావా..? ఆర్టికల్ 360 పెట్టి కూలదోస్తావా..? ఏదీ ప్రయత్నించు…
రాష్ట్రపతి పాలన పెడతావా..? హైదరాబాద్‌ను యూటీ చేస్తావా..? ఏదీ, చేసి చూడు… కాదు ప్రయత్నించి చూడు, అగ్గిమంట తప్పదు…’’ ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజీలో వచ్చిన స్టోరీ ఉత్తుత్తి ఊహాగానమా..? నిజమేనా..? ఏమో తెలియదు కానీ అలాంటి వార్తలతో సమాజంలో ఇలాంటి చర్చే జరుగుతూ ఉంటుంది… సో, రాబోవు దృశ్యాలను ఇక వేచి చూడాల్సిందే… బట్, అమిత్ షా మీదికే సిట్‌ను నిజంగానే ప్రయోగిస్తే అది తెలంగాణ వర్తమాన రాజకీయాల్లో ఓ బాంబు పేలినట్టే..! మోడీషా వీర తోపులు అనే భ్రమాత్మక ముసుగులు చీలికలు పేలికలు అయిపోయినట్టే…!!
Share this Article