నమస్తే తెలంగాణ, తెలంగాణటుడేలు తన సొంత పత్రికలు కాబట్టి… తనకు అవమానం కాబట్టి… కేసీయార్ ఈ వార్తను ప్రముఖంగా పబ్లిష్ చేశాడు… అవసరమే… మిగతా పత్రికలు మాత్రం ఎందుకోగానీ పెద్దగా పట్టించుకోలేదు… కానీ దీనికి నిజంగానే వార్తా ప్రాధాన్యం ఉంది… ఖచ్చితంగానే రాయదగిన వార్త…
విషయం ఏమిటంటే..? పంద్రాగస్టు వేడుకలకు సంబంధించి మెదక్ జిల్లా యంత్రాంగం ఓ ఆహ్వానపత్రికను ముద్రించింది… అందులో ముఖ్య అతిథిగా కేకేశవరావు పాల్గొంటాడని పేర్కొన్నారు… తను ఎవరు..? జస్ట్, ఓ ప్రభుత్వ సలహాదారు మాత్రమే… (జగన్ పాలనలో వందల మంది సలహాదార్లు… కేసీయార్ పాలనలో కూడా బోలెడు మంది… ఈ సలహాదారులు అనే పదవులే పునరావాసాలు… ఎక్కడా వేరే పోస్టుల్లో అడ్జస్ట్ కాకపోతే ఇలా ఈ పోస్టుల్లో నియమించి మమ అనిపించేస్తుంటారు…)
అఫ్‌కోర్స్, కేకేశవరావుకు కేబినెట్ మినిస్టర్ హోదా ఇచ్చి ఉండవచ్చుగాక… కానీ రియల్ కేబినెట్ మంత్రులకు ఉండే ప్రోటోకాల్ ఉంటుందా..? మరీ వాళ్లను మించి..? ఇదీ ఓ ప్రశ్న… సరే, ఆయన కాంగ్రెస్ పార్టీకి ఏం ఉపయోగపడతాడో, ఎందుకు తెచ్చి ఇలా నెత్తిన పెట్టుకున్నారో తెలియదు గానీ… కొండా సురేఖ, దామోదర రాజనర్సింహలను విశిష్ట అతిథులుగా కేకేశవరావు పేరుకు దిగువన ముద్రించారు… ప్రోటోకాల్‌లో ఆయనకన్నా వీళ్లెలా తక్కువ..?
Ads
సరే, దిగువన గౌరవ అతిథులుగా మెదక్, జహీరాబాద్ ఎంపీల పేర్లున్నాయి, గుడ్… తరువాత నలుగురు ఎమ్మెల్సీల పేర్లున్నాయి… వోకే, పర్లేదు… తరువాత, ఏదో ప్రోటోకాల్ ప్రకారం తప్పదు కాబట్టి అన్నట్టుగా ఎమ్మెల్యేల పేర్లు రాసుకొచ్చారు… అందులోనే ఎక్కడో దిగువన కేసీయార్ పేరు ఉంది… ఆయన తరువాత మెదక్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ల పేర్లున్నాయి… (ఒక పేరు గ్యాప్‌తో)… అబ్సర్డ్… నిజంగా దీనికి కలెక్టర్ బాధ్యత వహించాలి…
నిజానికి తెలంగాణ ఉద్యమకర్తగా, పదేళ్ల ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు… అన్నింటికీ మించి ప్రస్తుతం తను ప్రతిపక్ష నాయకుడు ఈ రాష్ట్రానికి…! ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి కేబినెట్ ప్రోటోకాల్ ఉంటుందనే సోయి లేదా మెదక్ యంత్రాంగానికి..?! ఇది ఖచ్చితంగా కేసీయార్‌ను అవమానించడమే… కేసీయార్ గాకపోయినా ఆ ప్రధాన ప్రతిపక్ష నేత హోదాను కూడా అగౌరవపరిచినట్టే కదా…
ఇది బయటికి వచ్చిన తరువాత నెటిజనం నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి… దాంతో నాలుక కర్చుకున్న యంత్రాంగం దిద్దుబాటుకు పూనుకుంది… మరొకటి ప్రిపేర్ చేసింది… అందులో కేసీయార్ పేరును గౌరవ అతిథుల స్థాయి నుంచి విశిష్ట అతిథుల జాబితాలోకి చేర్చింది… ఐనా సరే, కేకేశవరావు పేరే అన్ని పేర్లకన్నా ప్రముఖంగా, పైస్థాయిలో ఉంది…
కేసీయార్ తన పాలనకాలంలో తప్పులు చేసి ఉంటే… విచారణలు జరిపించండి, పర్లేదు… కేసీయార్‌ను రాజకీయంగా ఎదుర్కునే క్రమంలో విమర్శలు చేయండి, పర్లేదు… కేసీయార్ బలాన్ని తగ్గించే దిశలో పొలిటికల్ స్ట్రాటజీలు అమలు చేసుకొండి, పర్లేదు… కానీ తనను ఇలా అవమానించడం మాత్రం సరికాదు… బాధ్యులపై ఏదో ఓ చర్య అవసరం… అవునూ, కేసీయార్ తన గౌరవానికి భంగం కలిగిందని, సభాహక్కుల ఉల్లంఘన వంటిదేదో ఫిర్యాదు చేస్తే ఎలా ఉంటుందంటారు..?!
Share this Article