.
కాళేశ్వరం ప్రాజెక్టు… ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణంలో అంతే భారీగా అక్రమాలు, నేరపూరిత నిర్లక్ష్యం, లెక్కలేనితనం, అవకతవకలు, ప్రజాధన వ్యయం పట్ల అంతులేని తేలికభావం ఉన్నాయి…
రాజకీయంగా విమర్శలు వేరు… బీఆర్ఎస్ మినహా తెలంగాణలోని ప్రతి పార్టీ ఎండగట్టింది… ప్రత్యేకించి కాంగ్రెస్, బీజేపీ… ముసుగు తొలగింది… అధికారికంగా కేసీయార్ పాలనపై పడిన తొలి మరక… ఇంకా ఫోన్ ట్యాపింగ్, గొర్ల స్కాం, విద్యుత్తు ఒప్పందాలు వంటి చాలా ఉన్నాయి.., కానీ తను అత్యంత ప్రతిష్టాత్మకంగా కోట్ల ఖర్చుతో ప్రచారం చేయించుకున్న ప్రచారంలోని డొల్లతనం తేటతెల్లమైంది ఇప్పుడు…
Ads
తెలంగాణ సాధించిన నాయకుడిగా తెచ్చుకున్న ఖ్యాతి మసకబారిపోయి, ఇప్పుడిక ఈ మరకలు వెంటాడుతాయి తనను… కాళేశ్వరంపై వేసిన కమిషన్ తన నివేదికను ఇచ్చింది… ఎందరో బాధ్యులను గుర్తించింది…
అల్లాటప్పాగా కాదు, వందల మందిని… చివరకు ఈ లోపాలకు, నిర్లక్ష్యాలకు కర్త, కర్మ, క్రియగా చెప్పబడుతున్న కేసీయార్‌ను కూడా విచారించింది… (ఆంధ్రజ్యోతి, ఈనాడు ఆ నివేదికలోని కొన్ని పాయింట్లను జనానికి చెప్పాయి…)
అప్పటి సాగునీటి మంత్రి హరీష్‌రావుతోపాటు… అక్రమాలపర్వంలో కిమ్మనకుండా ఉండిపోయిన అప్పటి మంత్రి ఈటల రాజేందర్‌ను కూడా నివేదికలో ప్రస్తావించినట్టు మీడియా వార్తలు… ఐతే నివేదిక అవినీతి, ఇతర అక్రమాల జోలికి పోలేదు… అదేదో తేలుద్దాం, సీబీఐకి అప్పగించాలని బీజేపీ డిమాండ్… కత్తి తన చేతిలోకి రావాలని…
ఏమో, కేబినెట్‌లో ఈ నివేదిక మీద చర్చించాక, అవసరమైతే దీనికోసమే ఓ అసెంబ్లీ సెషన్ నిర్వహిస్తే… తరువాత క్రిమినల్ కేసు నమోదు చేస్తారా..? ఏసీబీకి లేదా సిట్ వేసి దానికి అప్పగిస్తారా దర్యాప్తును…? తెలియదు..! వెరసి కేసీయార్ అరెస్టు దాకా పోతుందా వ్యవహారం..? కాలం చెప్పాలి…! బీఆర్ఎస్ ఎలాగూ కోర్టులో కొట్లాడుతుంది…
నివేదికలో ప్రధానంగా… 1) ఈ బరాజుల నిర్మాణానికి ముందుగా కేబినెట్ ఆమోదం లేదు… 2) తుమ్మిడిహెట్టి దగ్గర నీటిలభ్యత లేదనేది సాకు మాత్రమే… 3) బరాజుల నిర్మాణానికి ముందు తప్పకుండా చేయాల్సిన జియో టెక్నికల్, జియో ఫిజికల్ శాస్త్రీయ పరీక్షల్ని అప్పటి ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు… బ్లండర్ మిస్టేక్…
4) హరీశ్ రావు మౌఖిక ఆదేశాలు నిర్మాణ ప్రమాణాల్ని ప్రభావితం చేశాయి.,. 5) సీఎంవో కార్యదర్శి స్మిత సబర్వాల్ పాత్ర కూడా ఉంది, సాగునీటి శాఖ కార్యదర్శి ఎస్‌కే జోషి కూడా బాధ్యుడే… (స్మిత ఇప్పుడు 6 నెలల సెలవులో వెళ్లిందట..) 6) షీట్ ఫైల్స్ బదులు సీకెంట్ ఫైల్స్ వాడారు, వాటి అమరిక కూడా లోపభూయిష్టమే, అందుకే బరాజ్ కుంగిపోయి పగుళ్లు.,.
7) బరాజులు నీటిమళ్లింపుకు ఉపయోగపడాలి, కానీ నిర్లక్ష్యంగా నిల్వ చేశారు… 8) గేట్ల ఆపరేషన్ షెడ్యూల్, స్టాండర్డ్ కోడ్ కూడా పాటించలేదు… 9) బరాజులు పూర్తి కాకముందే కంప్లీషన్ సర్టిఫికెట్లు ఇచ్చేశారు… 10) పాలనాపరమైన నిర్ణయాలతోపాటు అడ్డదిడ్డం నిర్మాణాలకు ఇంజినీర్లు, ఉన్నతాధికారులు కూడా బాధ్యులే…
ఇంకా ఏమేం లోపాలను నివేదిక ప్రస్తావించిందో ప్రభుత్వమే అసెంబ్లీకి వివరిస్తుందేమో… ఇప్పటికే ఏయే ఇంజినీర్లు, అధికారులు బాధ్యులో ఓ రిపోర్ట్ తయారైనట్టు సమాచారం… ఒకరిద్దరు వందల కోట్ల ఆస్తులు బయటపడి జైలులో ఉన్నారు… ఏమో… ఈ ‘బాహుబలి’ ప్రాజెక్టు ఎవరి బాహువుల వల్ల బలి అయ్యిందో తేల్చే క్రమం… బాహు‘బలి’ ప్రాజెక్టుకు ఎవరెవరు బలికావాలో కాలమే తేల్చనుంది… కథ ఇప్పుడే కదా మొదలైంది..!!
Share this Article