యాగాలు, హోమాలు కేసీయార్‌కు కొత్తేమీ కాదు… తను చేసినన్ని పూజలు సమకాలీన నాయకుల్లో ఎవరూ చేసి ఉండలేదు, అంత సంకల్పం, ఆచరణ కూడా ఉన్నవాళ్లు లేరు… అంత భక్తివిశ్వాసాలు ఉన్నవాడు కాబట్టే అయుత చండీయాగం చేశాడు… తన యాగాల్లో ప్రధాన సంకల్పం శత్రువుపై విజయం..! మరి ఇప్పుడు చేస్తున్న పూజలేమిటి..? ‘‘పూజాసామగ్రిని గోదావరిలో కలపడానికే కేసీయార్ కాళేశ్వరం పోయాడు, అంతేతప్ప ఇప్పుడు అక్కడ ఆయన చూసే పనీ, చేసే పనీ ఏమీలేదు, కేటీయార్‌ను సీఎంను చేయడానికే ఈ హోమాలు’’ అని బండి సంజయ్ విమర్శలు చేయడంతో… ఒకటీరెండు టీవీలు, పత్రికలు ఏవేవో రహస్య తాంత్రిక పూజలు, హోమాలు అని రాసేయడంతో… నిజంగానే కేసీయార్ కాళేశ్వరం ఎందుకు పోయాడు అనే కోణం చర్చకు వస్తోంది… కేసీయార్ ఏదో చేయకూడని పని చేస్తున్నట్టుగా బండి సంజయ్ మాటలు ధ్వనిస్తున్నాయి కానీ తను చెప్పిన ప్రత్యేక పూజలు అనే పాయింట్ మాత్రం కరెక్టు… అయితే ఆ పూజలు రహస్యమేమీ కాదు… అవి రెగ్యులర్ హోమాలు, యాగాలు టైపు కావు… ఇటీవల కేసీయార్ నిర్వహించిన పూజలకు ఆయనకు తెలిసిన చాలామంది బ్రాహ్మణులు కూడా వెళ్లారు, సంభావనలు కూడా తెచ్చుకున్నారు… అవి రహస్యమో, క్షుద్రమో కావు… అవునూ, సంజయ్ బ్రో… పూజలు చేస్తే ముఖ్యమంత్రులు అవుతారా..?
ఏ హోమం అయినా, ఏ యాగం అయినా… వాటి పరిసమాప్తి పూజావాటికలోనే కదా…! మరి ఇలా నదీప్రవాహంలో నిమజ్జనం చేసొచ్చే పూజలు ఏముంటయ్..? అసలు కేసీయార్ చేయిస్తున్న పూజలు ఏమిటి..? అవి బగాలాముఖిని ప్రసన్నం చేసుకునే పూజలు… దశమహావిద్యలు అంటారు… సాధారణ పూజలకు భిన్నంగా ఉంటయ్ పూజలు… కానీ క్షుద్రపూజలు కావు..! పూజాపద్ధతులు వేరు… అంతే… తాంత్రిక పద్ధతి… గౌహతిలోని ఫేమస్ కామాఖ్య గుడికి దగ్గరలోనే ఓ బగాలాముఖి గుడి ఉంది… హిమాచల్‌ప్రదేశ్‌లోని కోట్ల, బాంఖండి… పంజాబ్, హోషియార్పూర్ జిల్లా, బడోవన్… మధ్యప్రదేశ్‌లోని నల్ఖేడా, దతియాలోని పీతాంబరపీఠం (బగాలాముఖిని పీతాంబరీ దేవి అని కూడా అంటారు), నిఖిల్ధామ్లోని దస్ మహావిద్య గుడి… కాంచీపురం జిల్లాలోనివెల్లకొట్టయి బగాలాపీఠం… తిరునల్వేలి జిల్లా, పాపాంకులంలోని శ్రీసూర్యమంగళం… సింధనూరు జిల్లా, సోమలపూర… కోలార్ జిల్లా, మూలబగిల్… ఖాట్మండు సమీపంలోని నేవార్… ఇలా చాలా గుళ్లున్నయ్ ఆ దేవికి…
Ads
బగాలాముఖి పూజల్లో ఒకటీరెండు పద్దతులుంటయ్… ఒకటి వామాచార పద్ధతిలో చేయాలి… అది శారదాపీఠం స్వామికో, చినజియ్యర్కో చేతకావు… అయుత యాగం చేయించిన పీఠానికి అసలే చేతకాదు… అందుకని కేసీయార్ ఎవరితో ఈ పూజలు చేయించాడో తెలియదు… (బహుశా కర్నాటక నుంచి వచ్చిన పంతులు కావచ్చు…) కానీ పూజల చివరలో సంబంధిత పూజ అవశేషాల్ని (యాగ ద్రవ్యాలు) నదీప్రవాహంలో కలపాలి… వెళ్లాడు, గోదావరిలో కలిపాడు, వచ్చాడు… అంతే… అందుకే కేసీయార్ కాళేశ్వరం ఎందుకొచ్చాడో అక్కడి అధికారులకు గానీ, ఇరిగేషన్ ముఖ్యులకు గానీ అంతుపట్టలేదు… మూడో టీఎంసీ పనుల పరిశీలన గట్రా కారణం కానే కాదు… దానికి ఆయన అక్కడికి దాకా వెళ్లాల్సిన పనేలేదు… అవునూ, ఇప్పడు కేసీయార్‌కు శత్రువు ఎవరు..? కాంగ్రెస్ కాదు, ఇతర పార్టీలు కాదు… ఉత్తములు, సంజయులు తనకు అస్సలు ఆనరు… ప్రస్తుతం బీజేపీ పార్టీ… మోడీ, అమిత్ షా..? ఎవరి మీద విజయం కోసం, ఎవరి తలలు వంచడానికి ఈ పూజలు..? కేటీయార్‌కు సీఎం పీఠం ధారబోయటానికి ఈ పూజలు పునస్కారాలు అవసరం లేదు… కేటీయార్ అసలు దేవుడినే నమ్మడు… ఢిల్లీ వెళ్లి రాజీపడ్డాడు అన్నారు, మరి ఈ పూజల పరమార్థం ఏమిటి..?! ఈ మార్మికపూజల ఆంతర్యం తెలిస్తే, మోడీ ఉలిక్కిపడి వారణాసిలో ఏం పూజలు చేయిస్తాడో ఏమిటో మరి…!!
Share this Article