ప్రజల్లో టీఆర్ఎస్ పట్ల బాగా వ్యతిరేకత పెరుగుతోంది… బయటికి అంగీకరించకపోయినా సరే, ఆ పార్టీ నాయకులే ఆంతరంగికంగా అంగీకరిస్తున్నారు… కేసీయార్ కూడా దిద్దుబాటలో పడ్డాడు… ఏయే అంశాల్లో తప్పులు జరుగుతున్నాయో స్వీయవిమర్శ చేసుకుంటూ, కొన్ని అడుగులు సరైన వైపు వేయడం స్టార్టయింది… కాకపోతే ఈరోజుకూ ఆయన ఫీల్డ్‌లో ఏం జరుగుతున్నదో సరిగ్గా తెలుసుకోవడం లేదు… దాంతో తను తీసుకునే కొత్త నిర్ణయాలూ పెద్ద ఫాయిదా ఇచ్చేట్టుగా లేదు… ఉదాహరణకు ధరణి… ఒక్క సబ్ రిజిస్ట్రార్‌ను అడిగినా ధరణి గురించి ఖుల్లంఖుల్లా చెబుతాడు… సరే, ఎలాగూ దిద్దుబాటలో ఉన్నాడు కాబట్టి ఓ సీరియస్ అంశంపైనా ఆయన దృష్టి పెట్టాల్సి ఉంది… లేకపోతే తన పార్టీకి ఇంకా నష్టం తప్పదు… సిస్టం కూడా నష్టపోతుంది… అదేమిటీ అంటే..? పోలీస్ వ్యవస్థను రాజకీయ చట్రం నుంచి తప్పించడం..!
జస్ట్, ఒక చిన్న ఉదాహరణ ఇది… నిజానికి మెయిన్ పేజీలో కాస్త హైలైట్ చేయాల్సిన వార్తే ఇది… ఒక వ్యక్తిని 40 రోజులపాటు ఠాణాలోనే పెట్టేశారు… కోర్టు లేదు, విచారణ లేదు… నిజానికి తన మీద ఏ కేసూ లేదు… ఎవరో కార్పొరేటర్ని వేధిస్తున్నాడని ఎమ్మెల్యే సాబ్ చెప్పిండు… తీసుకుపోయి ఠాణాలో పడేశారు, అంతే… ఫాఫం, ఆ వ్యక్తి గురించి ఇన్నిరోజులు సీరియస్‌గా లాయర్ల రూట్లో పట్టించుకున్న మిత్రులో, బంధువులో లేరూ అంటేనే అర్థం చేసుకోవాలి… పోనీ, ఇక్కడ ఎమ్మెల్యే చేసిందీ తప్పుకాదు… ‘వాడెవడో మా కార్పొరేటర్ని వేధిస్తున్నడయ్యా, కాస్త చూడు’ అని చెప్పాడు అంతే… ఇక ఇదీ దురవస్థ… పోలీస్ కమిషనర్ ఈమధ్య అయిదారుగురు సీఐలను సస్పెండ్ చేశాడు… సింపుల్‌గా ఓ డీసీపీని విచారణ జరపమంటాడు… ఆమె వెళ్లి అసలు విషయం కనుక్కుని రాసేస్తుంది… సీపీ సస్పెండ్ చేస్తాడు… మొత్తానికి వరంగల్ పోలీస్ సర్కిల్లో ఓ హల్చల్… సీపీని అభినందించాలని అనిపిస్తోంది…
Ads
ఇక ఈ వరంగల్ 40 రోజుల నిర్బంధం కేసుకొద్దాం… ఎమ్మెల్యే చెప్పిందే శాసనం… తమ నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే కమిషనర్, ఐజీ, డీజీ… అన్నీ… ఇక్కడే కాదు, రాష్ట్రమంతా ఇదే స్థితి… గతంలోనూ తమకు తెలిసిన పోలీసు అధికారుల బదిలీలకో, నియామకాలకో ఎమ్మెల్యేలు, మంత్రులు రికమెండ్ చేసేవాళ్లు… కొత్తేమీ కాదు, కానీ మరీ కేసీయార్ ప్రభుత్వం వచ్చాక… ఎమ్మెల్యేలు అధికారికంగా తమకు ఫలానా పోలీస్ అధికారి కావాలంటూ రిటెన్‌గా అడుగుతున్నారు… కమిషనర్లు, ఆపై అధికారులు దాన్ని ఆనర్ చేస్తున్నారు… దీనివల్ల ఏం జరుగుతోంది..? అనివార్యంగా ఎమ్మెల్యేల ప్రైవేటు బలగాల తరహాలో మారిపోతోంది పరిస్థితి… వాళ్లు చెప్పినవాళ్లపై కేసులు పెట్టడం, వాళ్లు ఏది చెబితే అది చేయడం… ఎమ్మెల్యే ఎటువెళ్లినా పెద్ద కాన్వాయ్ గట్రా, అట్టహాసం… ఇది జనంలో వ్యతిరేకతకు ఖచ్చితంగా ఓ కారణం… మితిమీరిన రాచరికం టైపు రాజకీయం జనానికి నచ్చదు… కొందరు ఏళ్ల తరబడీ పాతుకుపోయారు, పనితీరు ఆధారిత పోస్టింగులు అనేది కనిపించక అస్తవ్యస్తంగా ఉంది… ఇందులో పోలీసు ఉన్నతాధికారుల తప్పేమీ లేదు… ప్రభుత్వ పాలసీని బట్టి నడుచుకోవాల్సిన అనివార్యత… సో, ఒకసారి కేసీయార్ దీన్ని సీరియస్‌గా రివ్యూ చేసుకుంటాడా..? థర్డ్ పార్టీతో నిజమైన ఫీల్డ్ రిపోర్ట్ తెప్పించుకుంటాడా..? నష్టనివారణ చర్యలకు పూనుకుంటాడా..? ఆయన ఇష్టం…!!
Share this Article