నిజానికి కొన్ని వార్తలు అమిత ప్రాధాన్యాన్ని కలిగి ఉంటయ్… కానీ అవెక్కడో మూలకు కనీకనిపించకుండా అచ్చవుతుంటయ్… కొన్ని పత్రికల్లో అసలు కనిపించనే కనిపించవు… టీవీలకు సహజంగానే ఇవి అక్కర్లేదు… వాటి లోకం వేరు… విషయం ఏమిటంటే..? ఇది కరీంనగర్ వార్త… ఏ హుజూరాబాద్ ఉపఎన్నిక కోసం కేసీయార్ తలబద్దలు కొట్టుకుంటూ కొత్త పథకాలు ఆలోచిస్తున్నాడో, అదుగో ఆ హుజూరాబాద్ నియోజకవర్గం ఉన్న కరీంనగర్ ఉమ్మడి జిల్లా వార్త… ప్రపంచానికే నేను మార్గదర్శకుడిని, ప్రపంచంలోని ఏ లీడరూ ఈ పథకం ఆలోచించలేదు, ప్రపంచదేశాలన్నీ దీన్ని ఆదర్శంగా తీసుకోవాలి, ప్రపంచగతిని మార్చే పథకం ఇది అన్న స్థాయిలో కేసీయార్ ప్రచారం చేసుకుంటున్నాడు కదా దళితబంధు పథకం గురించి… ఆ పథకానికి సంబంధించిన వార్త… సాక్షిలో ఎక్కడో చిన్నగా వచ్చింది… ముందుగా ఈ వార్త చదవండి…
అందరికీ తెలుసు.., కేసీయార్ ఆలోచనలు, పథకాల రాజకీయ లబ్ధి కోసమే అని… దళితబంధు కూడా జస్ట్, ఓ పైలట్ ప్రాజెక్టు… అదీ ఉపఎన్నిక జరగాల్సిన హుజూరాబాద్‌లోనే స్టార్ట్ చేస్తారు… అందరూ అర్హులే… చివరకు సర్కారు ఉద్యోగులు కూడా అర్హులేనట… అలా డబ్బులిచ్చేస్తారు, ఎక్కడైనా ఖర్చు పెట్టుకో, ఎలాగైనా ఖర్చు పెట్టుకో… నిజమే, ఇలాంటి ప్రభుత్వ పథకం బహుశా ప్రపంచంలోనే ఉండి ఉండదు… మరి మా సంగతి ఏమిటని బీసీలు నిలదీస్తుండేసరికి ఇప్పుడు అందరికీ ‘బంధు’ స్కీం పెట్టేస్తాం అంటున్నాడు కేసీయార్… మరి వాటికీ పైలట్ ప్రాజెక్టులు వెంటనే స్టార్ట్ చేయొచ్చుగా… పోనీ, అదే హుజూరాబాద్‌లో స్టార్ట్ చేయొచ్చుగా…
Ads
ఒక ప్రభుత్వ పథకం కింద ఆర్థికసాయం చేయడాన్ని ఎవరూ వ్యతిరేకించరు, అవసరమూ లేదు… సంక్షేమ ప్రభుత్వం బాధ్యత కూడా..! దానికి కులంకన్నా పేదరికమే ప్రాతిపదిక అయితే అది ‘సంతృప్త స్థాయి’… అంటే సాచురేషన్… నిజంగా ప్రభుత్వ సాయం అవసరమైన పేద కుటుంబాలకు మేలు చేకూర్చడం, అదీ శాశ్వత ప్రాతిపదికన అండగా ఉండాలి ఆ ఆర్థికసాయం… ఉదాహరణకు, ఇదే కేసీయార్ చెప్పిన దళితులకు మూడెకరాల భూమి అనే పథకం మీద కాన్సంట్రేట్ చేసి ఉంటే, ఇప్పటికే కొన్ని వేల కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకునేవి, ఏటా ఉపాధి పొందేవి… ట్రాక్టర్లు, హార్వెస్టర్లు మాత్రమే కాదు, పల్లెల్లో కుటుంబాలకు నిరంతరం ఉపాధిని, ఆదాయాన్ని కల్పించే పథకాలయితే అందరూ చప్పట్లు కొట్టాలి… కానీ చివరకు సర్కారు ఉద్యోగులకు కూడా డబ్బులిస్తాం అనే ప్రకటన మొత్తం పథకం స్పూర్తినే దెబ్బతీసేసింది…
ఇక ఈ వార్త విషయానికి వస్తే… జమ్మికుంట మండలం, కోరపల్లి గ్రామానికి చెందిన ఎడ్ల రవీందర్ కలెక్టర్‌కు ఓ లేఖ రాశాడు… అయ్యా, నా ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది… నాకు ఈ పథకం డబ్బులు వద్దు అంటూ ఆత్మనిజాయితీతో ఆ డబ్బును కూడా వాపస్ ఇచ్చేశాడు… కలెక్టర్ కర్ణన్ ఆయన్ని అభినందించాడు… కేసీయార్’జీ ఇప్పుడు చెప్పు కాస్త… ఈ పథకానికి ఎవరు అర్హులు..? కేసీయార్ ఎప్పుడూ ఇంతే… నేను పుట్టిన ఊళ్లో పుట్టినవ్, పది లక్షలు ఇస్తా తీసుకో అన్నాడు, చింతమడకలో ప్రతి ఇంటికీ లక్షలకులక్షలు నిర్బంధంగా ఇచ్చాడు, రాజు గారు అంతే మరి… అయ్యా, నేను ఇంతకుముందే తిన్నాను, కడుపు నిండుగానే ఉంది, ఆకలి లేదు అంటున్నా సరే… నేను పెట్టినప్పుడు తినాల్సిందే అంటూ నోట్లో బిర్యానీ కుక్కేస్తాడు… లబ్ధిదారుడు మింగలేడు, కక్కలేడు… వాసాలమర్రికి పోయినా అంతేనట మరి… రైతుబంధు కూడా అంతే కదా… ఎవరి పేరిట భూమి ఉంటే వాళ్లకు డబ్బులు… వాళ్లు కౌలుకు ఇచ్చుకున్నా సరే, సేద్యం చేయకపోతున్నా సరే, అసలు ఆ భూమి సేద్యయోగ్యంగా లేకున్నా సరే…! అయ్యా.., ఆకలితో ఉన్నవాడికి, నిజంగా కడుపు నింపాల్సిన వ్యక్తికి కడుపు నిండా తిండిపెట్టు, అందరూ మెచ్చుకుంటారు… ఆల్‌రెడీ ఆర్థికంగా బాగానే ఉన్నవాళ్లకు కూడా ఎందుకు..? ఎడ్ల రవీందర్ లేఖ చెబుతున్నది ఇదే… కలెక్టర్ కర్ణన్‌జీ, తమరి అభినందన ప్రభుత్వ స్పూర్తికి అనుగుణంగా ఉందో లేదో ఓసారి చూసుకొండి సార్.., అసలే అది కేసీయార్ మార్క్ పథకం, పైగా ఉపఎన్నిక జరగాల్సిన జిల్లా…!!
Share this Article