దక్షిణాది రాష్ట్రాలు కలిసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పోరాడాలని కేసీయార్, స్టాలిన్ గట్టిగా నిర్ణయం తీసుకున్నారట… బలమైన బీజేపీ వ్యతిరేక కూటమి నిర్మాణానికి కృషి చేయాలని కూడా బలంగా అనుకున్నారట… ఈయన వరిధాన్యంపై కేంద్రం వివక్ష గురించి చెప్పాడట… ప్రభుత్వ ఆస్తుల అమ్మకంపై ఆయన బాధపడ్డాడట…. కెసిఆర్, స్టాలిన్ భేటీపై రకరకాల వార్తలు… వారి నడుమ ఏం అంశాలు చర్చకు వచ్చి ఉంటాయో ఎవరి ఊహకు తగినట్టు వాళ్లు రాసేసుకున్నారు… అంతకుమించి గత్యంతరం కూడా లేదు… వాళ్లలో ఎవరూ ఫలానా అంశాలు మాట్లాడుకున్నామని బయటికి చెప్పలేదు… ఏం రాసుకున్నా సరే, ఖండించరు… నిజానికి వాళ్ల భేటీకి అసలు ప్రాధాన్యమే లేదు… చెప్పడానికి కూడా ఏమీలేదు… అదొక మర్యాదపూర్వకమైన భేటీ…
ఈయన వైకుంఠ ఏకాదశి వార్షిక ఉత్సవాల్లో పాల్గొనడానికి శ్రీరంగం గుడికి తీర్థయాత్రగా కుటుంబంతోసహా వెళ్లాడు… ఒక సీఎం మరో రాష్ట్రానికి వెళ్లినప్పుడు వీలయితే అక్కడి సీఎం కలవడం సహజం… ముఖ్యమంత్రులు కలిసినప్పుడు వర్తమాన రాజకీయాలు మాట్లాడుకోవడమూ సహజం… రాజకీయ పరిణామాల గురించి కాకపోతే రాజకీయాల్లో పడిపోతున్న నైతిక విలువలు, పెరగాల్సిన ప్రమాణాలు, సామాజిక మార్పులు, వ్యక్తిగత సమస్యలు, కోహ్లీ-రోహిత్ కొట్లాటలు, చైసామ్ విడాకులు, ఉదయనిధి కొత్త సినిమా అవకాశాలు గట్రా మాట్లాడుకుంటారా..? నెవ్వర్…! అవసరమైతే కలిసి పనిచేద్దాం బ్రదర్ అని మర్యాదపూర్వకంగానే విష్ చేసుకుని ఉంటారు… తెలంగాణ, తమిళనాడు నడుమ తేల్చుకోవాల్సిన ప్రభుత్వ పంచాయితీలు గానీ, పర్సనల్ గానీ ఏమీ ఉన్నట్టు లేవు… ఇక మీడియాతో కూడా మాట్లాడటానికి ఏముందని..?!
Ads
చూడటానికి కేసీయార్ వయస్సు పైనబడ్డట్టు, స్టాలిన్ కాస్త యంగ్ అన్నట్టు కనిపిస్తారు గానీ… కేసీయార్‌కన్నా స్టాలినే వయస్సుల్లో ఒక ఏడాది పెద్ద…! స్టాలిన్, కేసీయార్ భేటీ జరిగినప్పుడు డీఎంకేకు సంబంధించిన ఏ ఒక్క ముఖ్యనేత వెళ్లలేదు… అక్కడ కనిపించలేదు… రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి తంగం తేనరసు మాత్రమే ఉన్నాడు… కనీసం స్టాలిన్, కరుణానిధి కుటుంబసభ్యులు కూడా ఎవరూ లేరు… జస్ట్, స్టాలిన్ కొడుకు ఉదయనిధి మాత్రం ‘అతిథి సేవలో’ అన్నట్టుగా కలివిడిగా వ్యవహరించాడు… థర్డ్ ఫ్రంట్ రహస్య మంతనాలు అనే విశ్లేషణల దాకా కొన్ని మీడియా సంస్థలు వెళ్లిపోయాయి గానీ, తార్కికంగా ఆలోచిస్తే ప్రస్తుతానికి అంత సీన్ లేదు… అసలు దక్షిణాది ఐక్య పోరాటం అనే సీన్ కూడా లేదు… ఓసారి పరికిస్తే…
యూపీఏలోని మమత, శరద్ పవార్ ఏవేవో మాట్లాడుతున్నా సరే, స్టాలిన్ ఒక్క వ్యతిరేక వ్యాఖ్య చేయలేదు ఇప్పటికీ… ఇంకెక్కడి యూపీయే, బీజేపీ వ్యతిరేక పోరాటానికి, అధికారం చేజిక్కించుకోవడానికి కాంగ్రెస్ కూటమి ఇక పనిచేయదు అని శరద్, మమత అంటున్నారు… కానీ స్టాలిన్ ఇప్పటికీ కాంగ్రెస్‌కు అనుకూలంగానే ఉన్నాడు… అస్వస్థతతో ఉన్న కరుణానిధిని పరామర్శించడానికి వెళ్లిన మోడీ అప్పట్లో డీఎంకేను చేరదీయాలని అనుకున్నా సరే, స్టాలిన్ పడనివ్వలేదు… గతంలో కేసీయార్‌ను కలిసినప్పుడు కూడా స్టాలిన్ ‘థర్డ్ ఫ్రంట్’ పట్ల విముఖత కనబరిచాడు… కాంగ్రెస్‌కు మంచి సంఖ్యలో సీట్లు కేటాయించాడు గత ఎన్నికల్లో… కాంగ్రెస్ సున్నాయే కావచ్చు, కానీ వాడుకోగలిగితే ‘‘ఒకటి పక్కన సున్నా’’ అనేది స్టాలిన్ భావన… కాంగ్రెస్‌ను వదిలేస్తే చిన్న పార్టీలతో కలిసి వోట్లు చీల్చే ప్రమాదముందని, కలుపుకుపోతే బలమైన కూటమిగా ఉంటామనేది తన ఈక్వేషన్… జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ ముఖ్యులతో సత్సంబంధాలున్నయ్… ఈ స్థితిలో కేసీయార్ ప్రతిపాదిత థర్డ్ ఫ్రంట్ మీద ఆయనకు ఆసక్తి ఎందుకు ఉంటుంది..? అసలు కేసీయార్ మార్క్ థర్డ్ ఫ్రంట్‌కు, తన నాయకత్వ ఆశలకు మమత, శరద్ పవార్, అఖిలేష్ వంటి నేతలే అడ్డుపడతారు, తేలికగా తీసుకుంటారు… ఇక స్టాలిన్ జతచేరి సాధించేదేముంది..? తనకు ఒనగూరేది ఏముంది..?
దక్షిణాదిలో ఒక్కో రాష్ట్రం ఒక్కో టైపు సమీకరణం… కాంగ్రెస్ కోణంలోనే ఓసారి చూద్దాం… తెలంగాణలో ఇప్పటికీ టీఆర్ఎస్‌కు బలమైన ప్రత్యర్థి కాంగ్రెసే… ప్రతి నియోజకవర్గంలోనూ కేడర్ ఉంది, కేసీయార్ ఎంత తొక్కినా సరే, ఉనికిని కాపాడుకుంటున్నది, అవసరమైతే తిరిగి లేవగల పార్టీ కాంగ్రెసే… ఎటొచ్చీ దానికి పార్టీ అంతర్గత కుమ్ములాటలే సమస్య… ఏపీలో జగన్‌కు బీజేపీతో భయం లేదు, అది ఇప్పట్లో ఏమీ లేవదు, కాంగ్రెస్ అంటే జగన్‌కు పడదు, యాంటీ-బీజేపీ నేతలంతా వెళ్లి బతిమిలాడినా సరే జగన్ వెళ్లి సోనియా పక్కన నిలబడే సవాలే లేదు… జగన్ తత్వం దానికి అంగీకరించదు… (జగన్ తన జీవితంలో ఎవరిని క్షమించినా సరే సోనియాను మాత్రం క్షమించడేమో)… జగన్ రాజకీయ వైరాలు వేరు, అవసరాలు వేరు…
తమిళనాడు విషయానికి వస్తే డీఎంకే ప్రస్తుతానికి కాంగ్రెస్‌ను వీడదు… ఈ కప్పల తక్కెడ, అట్టముక్కల సినిమా సెట్టింగ్ వంటి థర్డ్ ఫ్రంట్‌ను నమ్మదు… దాని ఈక్వేషన్స్, అడుగులు, అవసరాలు, ఆలోచనలు వేరు… ((గత ఎన్నికల్లో 173 సీట్లలో డీఎంకే స్వయంగా పోటీచేస్తే, మిగతా 61 స్థానాలను 12 మిత్రపక్షాలకు ఇచ్చింది…)) కర్నాటకలో జేడీఎస్ తన అవసరార్థం రోజుకోరకం దోస్తీని ప్రదర్శించగలదు, ఏమాత్రం నమ్మదగిన, స్థిరవైఖరి ఉండదు దానికి… కేరళలో సీపీఎంకు కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి… జాతీయ స్థాయిలో ఏ రాజకీయ ధోరణి ప్రదర్శించాలో దానికే క్లారిటీ లేదు… ఒక్కో రాష్ట్రంలో ఒక్కోరకం ఈక్వేషన్… ఇవన్నీ తెలిసినవాడు కాబట్టే కేసీయార్ కూడా ఎప్పుడో ఓసారి ఇంటిమీదికెక్కి… ‘థర్డ్ ఫ్రంట్ పెట్టేస్తున్నాన్, దేశమంతా గాయిగత్తర లేపుతాన్, అగ్గిమంట పెడతాన్’ అంటాడు, తరువాత ఏమీ ఉండదు… యాంటీ-బీజేపీ పక్షాల్లో ఒక్క మజ్లిస్ తప్ప కేసీయార్‌తో దోస్తీ చేసే రాజకీయ పక్షం ఏదీ లేదు ఇప్పుడు… సో, ఉమ్మడి పోరాటాలు, దక్షిణాది ఐక్యతా స్పూర్తి, కాంగ్రెసేతర కాషాయ వ్యతిరేక కూటమి నిర్మాణం వంటి రాతలన్నీ జస్ట్, ఊహాగానాలే…!!
నో, నో, తెలంగాణలో బీజేపీని నిలువరించడానికి కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాలని కేసీయార్ ఆలోచిస్తున్నాడు, దానికి స్టాలిన్ మధ్యవర్తిత్వం వహిస్తున్నాడు, పాత పంచాయితీలు మరిచిపోయేలా చేస్తున్నాడు అంటారా..? మీ ఇష్టం… కాదు, కాదు, గతంలో జగన్‌తో కలిసి ఆలోచించిన గోదావరి-పెన్నా మేఘా ప్రాజెక్టు వర్కవుట్ కాలేదు కాబట్టి, ఇప్పుడు గోదావరి-కావేరి ‘‘మరో మేఘా కాళేశ్వరం’’ ప్లాన్ చేయడానికి స్టాలిన్‌ను కలిశాడు అంటారా..? మీ ఇష్టం..!! అబ్బా, అవేమీ కావు, జస్ట్, యాదాద్రి ప్రారంభానికి పిలవడానికి వెళ్లాడు, పరమ నాస్తికుడైనా సరే స్టాలిన్ సరేనన్నాడు అంటారా..? మీ ఇష్టం..!!
Share this Article