వడ్లను రైళ్లలో, వెయ్యి లారీల్లో తీసుకుపోయి ఇండియా గేట్ ముందు పారబోయాలి… నిన్నటి కేసీయార్ ఫామ్ హౌజులో అర్జెంటుగా సాగిన మంత్రుల భేటీలో ఈ నిర్ణయం మీద చర్చ జరిగిందట… ఢిల్లీని నెలల తరబడీ ముట్టడించి, చివరకు మోడీతో క్షమాపణలు చెప్పించుకున్న రైతులకు కూడా ఇలాంటి నిరసన ఆలోచన రాలేదు… అదీ మరి కేసీయార్ అంటే..? ఓ బృందంగా వెళ్లి అర్జెంటుగా మోడీని కలిసి, ఏయ్, యాసంగి వడ్లు కొంటవా కొనవా అని నిలదీయాలనేది మరో ఆలోచన… మంత్రుల్ని కూడా కలిసి ప్రొటెస్ట్ చెప్పాలని ఇంకో ఆలోచన…
ఇది అధికారిక కేబినెట్ భేటీ కాదు కాబట్టి అందులో పీకే పాల్గొన్నాడా..? స్పీకర్ పాల్గొనవచ్చా..? ఎమ్మెల్సీ కవిత పాల్గొంటే తప్పులేదా..? వంటి ప్రశ్నలు వేస్ట్… సీఎస్ కూడా వెళ్లాడు… కాబట్టి ఆ భేటీలో యాసంగి ధాన్యం ప్లస్ ఉద్యోగాల భర్తీ వంటి కొన్ని కీలక ఇష్యూస్ ప్రస్తావనకు వచ్చే ఉండవచ్చు… తరువాత మంత్రులకు పీకే ప్రస్తుతం ప్రజల్లో టీఆర్ఎస్ పట్ల ఉన్న అభిప్రాయాలను, తమ సర్వే వివరాలను చెప్పి ఉండవచ్చు… యాసంగి వడ్ల మీద ఢిల్లీలో ఫైట్ ఎట్సెట్రా సంగతులన్నీ పైకి చెప్పేవి…
ఢిల్లీలో గత్తర లేపి వస్తానని ఆమధ్య వెళ్లిన కేసీయార్ ఏం చేసి వచ్చాడు..? వీళ్లు పొలోమని వెళ్లగానే మోడీ, ఇతర మంత్రులు రారమ్మంటారా..? అసలు అపాయింట్‌మెంట్స్ అడిగారా..? అదే మోడీ అదే కేసీయార్ వెళ్లి ప్రశ్నించగానే కొన్ని ఎదురు ప్రశ్నలు వేస్తే జవాబులున్నాయా..? పోయిన యాసంగి ధాన్యం మొత్తం ఇచ్చారా..? ఫోర్టిఫైడ్ రైస్ ఎంత ఇచ్చారు..? కస్టమ్ మిల్లింగ్‌కు ఇచ్చిన రైస్ మళ్లీ రావడం లేదెందుకు..? మిల్లర్లపై ఏం చర్యలు తీసుకున్నారు..? ఇప్పటికైనా రా రైస్ ఎంతైనా కొంటాం అంటున్నాం కదా, ఒక్క పంటనే కొంటున్నామని బదనాం ఎందుకు చేస్తున్నారు..? పంజాబ్ రా రైస్ ఇవ్వడం లేదా..?….. సరే, ఇవన్నీ కాసేపు పక్కకు పెడదాం… యాసంగి వడ్ల గురించి చర్చించడానికి పీకే ఎందుకు అంటారా..? సరే..!
Ads
మరి ఏం చర్చించి ఉంటారు..? రేపు ఉదయమే టీఆర్ఎస్ విస్తృత భేటీలో ఏం మాట్లాడతారు..? కేటీయార్ అమెరికా వెళ్లిన వేళ ఇంత అర్జెంటుగా కీలక భేటీలు ఏమిటి..? ఓ సగటు మనిషిగా ఆ సంభావ్యతలు ఏమిటో ఊహిద్దాం… నిజం కాకపోవచ్చు… ముందస్తు… మోడీయే ముందస్తుకు వెళ్లేట్టున్నాడు కాబట్టి, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఎంపీ ఎన్నికలతో వస్తే కష్టం కాబట్టి, ఇంకా ముందస్తుకు వెళ్లిపోదామా..? ప్రజల్లో వ్యతిరేకత ఇంకా పెరగకుండా ఇప్పుడే ఎన్నికలు పెట్టేసి, మళ్లీ అధికారం చుట్టేసి, అయిదేళ్లు బేఫికర్‌గా ఉందామా..? కేటీయార్‌కు పగ్గాలు ఇచ్చేద్దామా..?
కేసీయార్ వేరు, కేటీయార్ వేరు… కేసీయార్ ముఖ్యమంత్రిత్వం ఇచ్చేస్తాడు సరే, కానీ కేటీయార్ నిభాయించగలడా..? పైగా ఇప్పుడున్న ఆరోగ్య, ఆయు ప్రమాణాల్లో కేసీయార్ వయస్సు పెద్దదేమీ కాదు, రిటైర్ కావల్సినంత అవసరమూ లేదు… ఈ దేశానికి ప్రధానిగా ఉన్న మోడీకన్నా వయస్సులో కేసీయార్ చిన్నవాడే… ఆలోచనలు, అడుగుల్లో ఇంకా చురుకుగానే ఉన్నాడు… పైగా ఎవరిని ఎలా కత్తిరించాలో, ఎవరిని కోవర్టును చేసుకోవాలో, ఎవరిని బుజ్జగించి అలుముకోవాలో బాగా తెలిసినవాడు… కాకపోతే ముఖ్యమంత్రిగా, పార్టీ అధినేతగా కేటీయార్‌కు ప్రజల యాక్సెప్టెన్సీ ఎలా ఉంటుందో మాత్రం వేచిచూడాల్సిందే…
పీకే ఏం చెప్పాడో, ఏం తేల్చాడో తెలియదు గానీ… తెలంగాణలో ఈరోజుకూ కేసీయార్ బలంగానే ఉన్నాడు రాజకీయంగా… బీజేపీ, కాంగ్రెస్ నాయకత్వ సమస్యలతో ఉన్నయ్… గత ముందస్తులాగే ఇప్పుడూ ముందస్తుతో వెళ్లాలనీ, బీజేపీని ఢీకొట్టాలనీ కేసీయార్ చేసే ఆలోచన రాజకీయంగా, కేసీయార్ కోణంలో కరెక్టు… కొట్లాడక తప్పదు కూడా… తెలంగాణ మీద బీజేపీ నజర్ ఉంది కాబట్టి… అది ప్రెజర్ పెంచుతోంది కాబట్టి… కేసీయార్ ప్లేసులో ఎవరున్నా ఫైట్ చేయకుండా లొంగిపోరు కదా…!!
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా…. ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలు ఒకేసారి రాకుండా జాగ్రత్తపడ్డాడు, జనం యాక్సెప్ట్ చేశారు, పట్టం గట్టారు… ఈసారీ అదే వ్యూహం… జనరల్ ఎన్నికలతోపాట అసెంబ్లీ ఎన్నికలు జరగకూడదు… కానీ ఎలా..? సో, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల దగ్గర నుంచి రైతు సమితులు, జెడ్పీ ఛైర్మన్ల దాకా పాల్గొనే విస్తృత భేటీ అంటే దానికి పొలిటికల్ ఇంపార్టెన్స్ ఉంది, పొలిటికల్ యాంగిలే ఉంటుంది… ఏదో కీలక నిర్ణయం దిశగా సన్నద్ధం చేయడమే అయి ఉంటుంది…!!
Share this Article