మోడీ మీద టీఆర్ఎస్ వాళ్లు సభాహక్కుల నోటీసు ఇచ్చారట, ఏమైతుంది సార్..?
కేసీయార్ పై బీజేపోళ్లు అసెంబ్లీలో అలాంటి నోటీసే ఇస్తారట, ఏమవుతుంది సార్..?
టీఆర్ఎస్ పెద్దల చుట్టూ ఈడీ వలలు పన్నుతోందట, నిజమేనా సార్..?
…. నిన్నటి నుంచీ ఒకటే చర్చలు… బట్, ఎవరికీ ఏమీ కాదు.,. ఎవరికీ ఫికర్ అక్కర్లేదు… తెరపై కనిపించేదే సత్యం కాదు, రాజకీయాల ప్రణాళికలు అంటేనే ఓ స్పష్టాస్పష్ట భ్రమ… అది సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగు, పోస్టుల హైప్ కాదు… ‘‘మోడీ దుర్మార్గుడు, బీజేపీ బేకార్ పార్టీ, తెలంగాణ వ్యతిరేకి మోడీ, మళ్లీ మళ్లీ విషం కక్కుతూనే ఉన్నాడు చూశారా’’ అని నమస్తే తెలంగాణ పేజీలో కొద్దీ కథనాలు పరిచేయవచ్చుగాక… ఊరూరా టీఆర్ఎస్ జెండాలు విప్పి బజార్లలోకి రావచ్చుగాక… ఐననూ ఏమీ జరగదు…
ఎందుకంటే…? మోడీ వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త కాదు, ఈ తల్లీబిడ్డ కామెంట్లు గతంలో కూడా చేశాడు… పైగా తను విభజన తీరును వ్యతిరేకిస్తున్నాడు తప్ప విభజనను కాదు, తను పార్లమెంటును కించపరచడం లేదు, ఒక బిల్లు పాస్ చేసిన తీరు సరికాదు అంటున్నాడు… పైగా ప్రధాని… ఇప్పుడు బజారుల్లోకి వచ్చినవాళ్లు టీఆర్ఎస్ నాన్-అహోబిలం మఠం తప్ప తెలంగాణ ఉమ్మడి సమాజం ఏమీ కాదు… అప్పట్లో తెలంగాణను బలంగా వ్యతిరేకించిన సెక్షన్ కూడా ఇప్పుడు అమరులు, త్యాగాలు అని మాట్లాడుతోంది… సో, సగటు తెలంగాణవాది దృష్టిలో ఇదొక పార్టీల గొడవ… సెంటిమెంట్ రగల్చడానికి ‘మళ్లీ రెండు రాష్ట్రాలు కలిపే కుట్ర’ అనే వక్రబాష్యాన్ని తెలంగాణ సమాజం పెద్దగా పట్టించుకోవడం లేదు…
Ads
ఇటు టీఆర్ఎస్‌కు, అటు బీజేపీకి కూడా ప్రస్తుతం కావల్సిన క్యాంపు టీవీ9… ఆ చానెల్ సైటులో నిన్న ఏదో వార్త కనిపించింది… ఈడీ ఏ క్షణంలోనైనా విరుచుకుపడొచ్చు, జాగ్రత్త సుమా అని పార్టీలోని ధనికముఖ్యులను కేసీయార్ అలర్ట్ చేస్తున్నాడనేది సారాంశం… అసలు ఈడీ కేసులతో ఏమీ కాదనే విషయం కేసీయార్‌కు తెలియదా..? పైగా మోడీతో వైరం అనేది ఇక్కడ వీథుల్లో మాత్రమే, అక్కడ ఢిల్లీలో ఏముందని..? ఫాఫం, మోడీకి కేసీయార్ మీద కోపం ఎందుకుంటుంది..?
ఏదో అంటూనే ఉంటారు… బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ నుంచి చిన్న కార్యకర్త దాకా చెబుతూనే ఉంటారు… కేసీయార్‌కు జైలు తప్పదు, రేపోమాపో విచారణ, అన్నీ తవ్వుతున్నాం, తవ్వేశాం, అంతా రెడీ, అదుగో చంచల్‌గూడ అన్నట్టుగా పత్రికల్లో ఝలక్కులు ఇస్తుంటారు… ఊదు కాలదు, పీరు లేవదు… అలాంటిది కేసీయార్ చుట్టూ ఉండే ధనిక నేతల మీద ఈడీని ఉసిగొల్పితే అయ్యేదేమిటి..? ఐనా ఉసిగొల్పే మూడ్ మోడీకి ఉంటే కదా…!! ఆయనకు మమత వంటి హార్డ్ కోర్ మోడీ వ్యతిరేక కేరక్టర్‌నే ఏమీ చేయలేకపోయాడు… (అప్పట్లో చంద్రబాబు కూడా ఇలాగే అదుగో సీబీఐ, ఇదుగో ఈడీ, జనమే నన్ను కాపాడాలిరోయ్, ఐనా ఊరుకోను, దేశమంతా ఏకం చేస్తా, మోడీ అంతు చూస్తా అని మొత్తుకున్నాడు… ఫలితం చూసిందే కదా…)
మోడీ మీద, బీజేపీ మీద యుద్ధభేరీ మోగించినట్టేనా..? మోడీ వ్యాఖ్యలతో టీఆర్ఎస్‌కు ఓ బ్రహ్మాండమైన అస్త్రం దొరికినట్టేనా..? అలాంటి భయాలూ అక్కర్లేదు… ఎవరి లెక్కల ప్రకారం, సారీ, తెర వెనుక లెక్కల ప్రకారం వారు నటిస్తుంటారు… హక్కుల ఉల్లంఘన తీర్మానంపై చర్చించాలనేది టీఆర్ఎస్ పట్టుదల కావచ్చు, నమస్తే భాషలో తీర్మానం మీద చర్చ జరిగేవరకూ పార్లమెంటు నడవదు, మస్తు పట్టుదల ఉన్న టీఆర్ఎస్ ఎంపీలు యుద్ద ఉద్వేగంతో వ్యవహరిస్తారు అనుకుందాం సరే, కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వాళ్లు కూడా అదే సభాహక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చారు కదా… ఇప్పుడున్న రాజ్యాంగం పనికిరాదు అనేది రాజ్యాంగాన్నే కించపరిచినట్టు కదా అనే వాదన కూడా బలమైందే కదా… మరి అదీ చర్చకు రావాల్సిందేనని అంగీకరిస్తున్నట్టేనా..?
Share this Article