.
అందరూ పాపం, ఏ పాపమూ ఎరగరు… ఆ అడ్డమైన రోత పాట గురించి నిన్నటి నుంచీ చెప్పుకుంటున్నాం కదా… అదే కేడీ, ది డెవిల్ సినిమాలో మంగ్లీ పాడిన హిందీ ఐటమ్ సాంగ్ లిరిక్స్ గురించి… ఆమధ్య ఎవడో వేదిక మీద గుంజీ గుంజీ అని ఓ దిక్కుమాలిన పాట పాడాడు కదా… ఇది అంతకుమించి…
మొదట కంగనా ‘ఏమిట్రా ఈ వెగటు’ అని ప్రశ్నించడంతో మొదలైంది… పాన్ ఇండియా సినిమా కదా, దేశవ్యాప్తంగా నెటిజనం బండబూతులు తిట్టారు… ఎవరిని..? అందరినీ… నిర్మాతను, దర్శకుడిని, రాసినవాడిని, కంపోజర్‌ను, సింగర్‌ను…
Ads
ఈ స్థాయి వ్యతిరేకతతో తలలు వాచిపోయాయి అందరివీ… దెబ్బకు యూట్యూబ్ నుంచి పాట తీసేశారు… అబ్బే, కన్నడ పాట కదా, మూడేళ్ల క్రితం తీశారు, ఏదేదో నాకు హిందీలో చెప్పారు, మోసం చేశారు, ఎందుకంటే హిందీ వెర్షన్‌లో లిరిక్స్ పూర్తిగా మార్చేశారు, నాకేం తెలుసు అంటోంది ఆ ఐటమ్ డాన్సిణి నోరా ఫతేహి… ఎహె, ఈ ఒక్క పాటతో మమ్మల్ని జడ్జ్ చేయకండి, తిట్టకండి అని నిర్మాత రక్షిత (దర్శకుడి భార్య) మొత్తుకుంటోంది…

ఆ లిరిక్ రైటర్‌గా క్రెడిట్స్ వేయించుకున్న ఆయన కూడా నాకే పాపమూ తెలియదు, రాసిందే నేను కాదు అని తప్పించుకుంటున్నాడు… దర్శకుడు ఎక్కడ మొహం దాచుకున్నాడో గానీ, తన స్పందన కనిపించలేదు… ఇక మంగ్లీ ఏమంటున్నదంటే… పొరపాటు, ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమాపణ, ఇలా మరెప్పుడూ జరగదు ఇక…
ఇది పొరపాటు కాదు, తప్పు..! తెలియక చేస్తే పొరపాటు, తెలిసీ, పాట అర్థాలు తెలిసీ పాడటం అంటే తప్పు… పైగా ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే అనే మాటేమిటి అసలు..? మనోభావాలు దెబ్బతింటాయనే వివేచన విజ్ఞత పాడేముందు లేవా..? ఆ లిరిక్స్ అర్థం తెలియకుండానే పాడినట్టు ప్రేక్షకుడు అనుకోవాలా..? పైగా ఈ సెలబ్రిటీలకు ఓ జాడ్యం…

పైగా మూవీ మేకర్స్‌కెు, సంగీత దర్శకుడు అర్జున్ జన్యాకు థాంక్స్ అట… ఎందుకు ఈ అడ్డమైన పాటను జనంలోకి వదిలినందుకా..? తప్పు చేయడం, ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే సారీ అని దులిపేసుకోవడం… అందరూ లెంపలేసుకుంటున్నారు క్షమాపణపర్వంలో… కానీ అసలు దోషి ఎవరు..? అందరూ..! ఆ దరిద్రమైన టేస్టున్న దర్శకుడు ప్రధాన దోషి…
ఇవన్నీ చదువుతూ ఉంటే… ఓ కుర్ర సింగర్ వీడియో కనిపించింది… పేరు స్వరాగ్ కీర్తన్ అట… ఈటీవీ పాడుతా తీయగా ఒక సీజన్ విన్నర్ అని గుర్తు… పాటను సమర్థించడం లేదు, కానీ సింగర్‌ను ట్రోల్ చేయడం తప్పు అట… ఆమె పాట కావాలని పరభాషల వాళ్లు కూడా అడుగుతున్నారంటే మనం అర్థం చేసుకోవాలట గొప్పతనాన్ని… ఇదుగో ఇలాంటి మూఢ భక్తులవల్లే, ఇలాంటి భజనలవల్లే అలాంటి పాటలు ప్రేక్షకులపై దాడి చేస్తున్నాయి… అదీ అసలు కారణం..!!
అవును గానీ… ఈ పాట మీద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నోటీసులు జారీ చేసిందట… ఈ ద్వంద్వార్థాలు, వెగటు లిరిక్స్ మీద… ఇందులో మానవహక్కుల హననం ఏముందో మనకు అర్థం కాదు గానీ… అసలు పాటలో ద్వంద్వార్థాలు ఏమున్నాయని…? అంతా స్ట్రెయిట్ బూతులే కదా..!!
మరో మాట… కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిమ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) ని కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిందట… ఏదీ యూట్యూబ్ లో పాట తీసేయడమేనా..,? లిరిక్స్ మార్చి, ఏదో తూతూమంత్రంగా కొత్త పాట ఏదో రాసి, పాడించి, యూట్యూబ్‌లో పెట్టేస్తారట… ఇది యాక్షనా..? ఇన్‌యాక్షనా..?
Share this Article