కీడాకోలా… ఈ సినిమా చూస్తుంటే బ్రహ్మానందం మీద జాలి కలుగుతుంది… ఎలాంటి కమెడియన్ ఎలా అయిపోయాడు అని… నిజంగా బ్రహ్మ మంచి నటుడు… (మొన్నటి రంగమార్తాండ ఉదాహరణ…) కానీ కామెడీకి పరిమితం చేసింది ఇండస్ట్రీ ఇన్నేళ్లుగా… ఇదే బాగుంది అని దానికే ఫిక్సయిపోయాడు… తను లేనిదే తెలుగు సినిమా లేదు అనేంత సీన్ ఉండేది ఒకప్పుడు… వందల సినిమాలు, అగ్రతారలకు దీటుగా సంపాదన… కానీ..?
మొనాటనీ… ఇది ఎవరినైనా చంపేస్తుంది… బ్రహ్మీ కూడా నచ్చడం మానేశాడు… ఒకే తరహా పాత్రలు… మెల్లిమెల్లిగా అవకాశాలకు దూరమయ్యాడు… నిర్మాతలు వెన్నెల కిషోర్ వంటి కమెడియన్ల వైపు మొగ్గారు… బ్రహ్మిని పిలిచినవాళ్లు లేరు… ఈ నేపథ్యంలో అడపాదడపా ఒకటీరెండు వేషాలు దక్కినా వాటి ఇంపాక్ట్ నిల్… ఏదో సినిమాలో ఉన్నాడంటే ఉన్నాడు… ఇప్పుడు వచ్చిన కీడాకోలా సినిమాలో తను ఫుల్ లెంత్ పాత్రే…
కానీ ఓ వీల్ చెయిర్‌కు పరిమితమైన పాత్ర… కథ (ఉండి ఉంటే)కు కీలకమే… అక్కడక్కడా తన డైలాగ్‌లకు నవ్వలేక నవ్వుతాం… ఆ పాత్రలో ఏ చిన్న నటుడిని పెట్టినా సరిపోతుంది… బ్రహ్మానందమే అక్కర్లేదు… బహుశా ఈ సినిమా అన్నీ తనే అయిన తరుణ్ భాస్కర్ బ్రహ్మి మీద అభిమానంతో తీసుకుని ఉంటాడు… ఇక సినిమాలోకి వస్తే…
Ads
తరుణ్ భాస్కర్ గతంలో తీసిన పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది అనే సినిమాలు తనలోని డిఫరెంట్ దర్శకుడిని, టేస్ట్‌ను పట్టిస్తాయి… లాజికల్‌గా ఉన్నయ్… వాటితో కీడా కోలాను పోల్చకూడదు… దేనికదే… ఇది కూడా తరుణ్ భాస్కర్ బలమైన కామెడీ బేస్డే… దానికి కొంత క్రైమ్ కలిపాడు… కానీ ప్రధానంగా కామెడీయే ఆధారం… పైగా ఇది జాతిరత్నాలు టైప్ సినిమా… వరుసగా కామెడీ సీన్లు, కామెడీ డైలాగ్స్ గట్రా వస్తుంటయ్, నవ్విస్తుంటయ్, తీరా థియేటర్ వదిలాక మనం ఏం చూశామో మనకే గుర్తుండదు… కథాకాకరకాయ అంటూ పెద్దగా ఏమీ ఉండదు…
లాజిక్ ఉంటే తెలుగు సినిమా ఎందుకు అవుతుంది..? అందులోనూ కామెడీ అనిపించుకోదు కదా, తరుణ్ భాస్కర్‌కు కూడా అదే తెలిసొచ్చింది చాలా గ్యాప్ తరువాత… ఏమిటో ఓ బొమ్మ చెడగొడితే కోటి రూపాయలు ఇవ్వాలా..? కోలా సీసాలో బొద్దింక (కీడా కోలా సినిమా పేరు ఇదే…)కు 5 కోట్ల పరిహారం ఇవ్వాలా..? దానికీ బేరాలా..? హేమిటో… ఛస్, అవన్నీ ఆలోచిస్తే సినిమా చూడలేం… అక్కడక్కడా నవ్వించే సీన్లు, డైలాగుల కోసం వెళ్తే సరి… అంతే…
తరుణ్ భాస్కర్ మంచి దర్శకుడే కాదు, మంచి నటుడు కూడా… ఈ సినిమాలో ఇదీ ఓ ప్లస్ పాయింటే… పేరుకు చిన్న బడ్జెట్ సినిమాయే అయినా ఆ లోపం నిర్మాణ విలువల మీద పడనివ్వలేదు… చివరగా ఒక్కమాట… తెలుగు సినిమా అంటే తప్పకుండా ఉండే అవలక్షణాలు ఏమీ లేని ఫెయిర్, నీట్ సినిమా ఇది… ఎక్కడా అశ్లీలం లేదు, అసభ్యత లేదు… పంచ్ డైలాగుల్లోనూ బూతుల్లేవు… అన్నింటికీ మించి సూపర్ హీరోయిక్ పాత్రల్లేవ్, బీభత్సమైన నెత్తుటి ప్రవాహాలు, నరికివేతలు, ఊచకోతల్లేవ్… హీరోయిన్ల దేభ్యం మొహాల్లేవ్… ఇమేజ్ బిల్డప్పుల్లేవ్… చెత్తా స్టెప్పుల డాన్సుల్లేవ్… నవ్వుకుంటూ ఆ రెండు గంటలు టైమ్ పాస్ చేయొచ్చు… ఏ వెగటు వాసనల భయం లేకుండా… అది చాలు కదా…
Share this Article