Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దుప్పటి ఉన్నంతే కాళ్లు చాపాలి… కాదంటే అప్పులు, అవస్థలు, ఇలా…

September 5, 2025 by M S R

.

Yanamadala Murali Krishna …….. ఆడంబరాల మోజుతో అప్పుల ఊబి: అంతిమంగా మిగిలేది విషాదం!

​ఇప్పటి సమాజంలో సామాజిక సంబంధాలు, వేడుకల స్వరూపం పూర్తిగా మారిపోతోంది. ఒకప్పుడు కుటుంబసభ్యులు, బంధుమిత్రుల మధ్య ఆప్యాయతలను పంచుకునే సందర్భాలుగా ఉన్న పెళ్లిళ్లు, పుట్టినరోజులు, సమర్త (పుష్పాలంకరణ) వంటి వేడుకలు, దిన కార్యాలు ఇప్పుడు తమ ఆర్థిక స్థాయిని, సామాజిక హోదాను ప్రదర్శించుకునే వేదికలుగా మారుతున్నాయి. చుట్టూ ఉన్నవాళ్లతో పోల్చుకుంటూ, శక్తికి మించి అప్పులు చేసి మరీ వేడుకలు నిర్వహించడం ఒక ప్రమాదకరమైన ధోరణిగా మారింది.

Ads

​వేడుక కాదు, ఇదొక వ్యాపార రంగం:

​ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు వేడుకల నిర్వహణే ఒక పెద్ద వ్యాపార రంగంగా అవతరించింది. డెస్టినేషన్ వెడ్డింగ్‌లు, థీమ్ బేస్డ్ బర్త్‌డే పార్టీలు, లక్షలు విలువచేసే పుష్పాలంకరణలతో ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలు సామాన్యులను సైతం ఆకర్షిస్తున్నాయి. ఈ పోటీ ప్రపంచంలో, తమ వేడుక అందరికంటే గొప్పగా ఉండాలనే తాపత్రయంతో మధ్యతరగతి ప్రజలు సైతం తమ శక్తికి మించి ఖర్చు చేస్తున్నారు.

కొన్ని గంటల పాటు నిలిచే ఈ ఆడంబరం కోసం, సంవత్సరాల తరబడి కష్టపడి కూడబెట్టిన సొమ్ముతో పాటు, అధిక వడ్డీలకు అప్పులు చేసి మరీ లక్షలు వెచ్చిస్తున్నారు. సంతోషకరంగా జరగాల్సిన సందర్భం, భవిష్యత్తులో తీర్చలేని వేదనలకు, కన్నీళ్లకు పునాది వేయకూడదన్న స్పృహను కోల్పోతున్నారు.

​తాత్కాలిక గౌరవం... శాశ్వత వేదన

ఇక్కడ గుర్తించాల్సింది, పార్టీని ఎంజాయ్ చేసిన బంధుమిత్రులు ఎవరూ అప్పుల కష్టంలో భాగం తీసుకోరు.
ఇట్టి రాబోయే కష్టాలను ఊహించి, కుటుంబంలోని పెద్దలు అప్పులు చేయరాదని ముందే హెచ్చరించాలి.
​ఈ తాత్కాలిక ప్రదర్శన మోజులో పడి, ఆర్థికంగా చితికిపోయి, సంపాదించినదంతా వడ్డీలకే చెల్లించాల్సిన దుస్థితికి చేరుకుంటున్నారు. అప్పుల భారం పెరిగిపోయి, అది తీవ్రమైన మానసిక ఒత్తిడికి దారితీసి, కుటుంబ ప్రశాంతతను పూర్తిగా దూరం చేస్తుంది.

ఈ మానసిక వేదన క్రమంగా ఆరోగ్యాన్ని క్షీణింపజేసి, చిన్న వయసులోనే రక్తపోటు (బీపీ), మధుమేహం (షుగర్) వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడేలా చేస్తుంది. కోవిడ్ తరువాత ఒత్తిడులకు వయసుతో నిమిత్తం లేకుండా గుండెపోట్లు వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. తీసుకున్న అప్పులు తీర్చలేక, రుణదాతలతో మాటలు పడుతూ, సంఘంలో గౌరవాన్ని కోల్పోతున్నారు.

lavish

నిన్నటి ఈ  వార్త చూస్తే…, కాకినాడ ప్రాంతంలో స్థోమతకు మించి ఫంక్షన్ చేసి, అప్పులు చేసి, చివరకు ఆ అప్పుల బాధ తాళలేక ఒక యువకుడు ఆత్మహత్య చేసుకోవడం, ఆ విషాదాన్ని తట్టుకోలేక కొద్ది రోజులకే అతని భార్య, బిడ్డ కూడా తనువు చాలించడం వంటి హృదయవిదారక సంఘటనలు, ఈ అప్పుల ఊబి ఎంతటి పెను అనర్థాలకు దారితీస్తుందో కళ్లకు కడుతున్నాయి. క్షణికమైన కీర్తి కోసం, శాశ్వతమైన జీవితాన్ని, కుటుంబాన్ని పణంగా పెట్టడం ఎంతమాత్రం సమంజసం కాదు.

​వివేకమే మనకు రక్ష

​’మనకున్న దుప్పటిలోనే కాళ్లు ముడుచుకోవడం’ అనే సామెతను ఎన్నటికీ విస్మరించకూడదు. ఆర్థిక స్తోమతకు మించి ఖర్చు చేయడం అవమానం కాదు, అది అవివేకం. ఎవరి స్థోమత మేరకు వారు తక్కువ మంది బంధువులతోనో, తక్కువగా ఖర్చుతో ఇంట్లోనే వంటలు చేసుకొని వేడుక చేసుకోవాలి. ఇంకా ఆర్థికంగా ఇబ్బంది అయితే కేవలం టీ, స్నాక్స్ వంటి ఆఫీసుల్లో చేసుకొనే తరహా వేడుకల్లా చేసుకొని సంతోషంగా గడపాలి.

ఆడంబరాల కన్నా ఆర్థిక క్రమశిక్షణ, మానసిక ప్రశాంతతే మనకు, మన కుటుంబానికి నిజమైన సంతోషం అని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. సంతోషాన్ని అప్పులతో కొనుక్కోలేమని, ఉన్నంతలో సంతృప్తిగా జీవించడమే అసలైన సంపద అని గ్రహించడం నేటి తక్షణ అవసరం. డాక్టర్ యనమదల మురళీకృష్ణ, ఎండీ, కాకినాడ

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • దేవనపల్లి కవిత..! గులాబీ యాదవ శిబిరంలో అసలైన ముసలం..!
  • సారీ జేజమ్మా… వెరీ సారీ క్రిష్… ఘాటి ఏమాత్రం గట్టి సినిమా కాదు..!!
  • దుప్పటి ఉన్నంతే కాళ్లు చాపాలి… కాదంటే అప్పులు, అవస్థలు, ఇలా…
  • మంచి పథకం..! రేవంత్ రెడ్డి కూడా అమలు చేస్తే మంచి పేరు..!!
  • కాల్ మి పాండ్, జేమ్స్ పాండ్… ఇప్పుడు చేసేవాళ్లూ లేరు, తీసేవాళ్లూ లేరు…
  • ఎండపొడ చెప్పే జీవితసత్యం కూడా ఇదే… వృద్దాప్యాన్నీ ‘డీ’కొట్టాలి …
  • 50 ఏళ్ల క్రితం… ఆస్ట్రేలియాకు వెళ్లి ‘‘పులియబెట్టే విద్య’’ చదివింది…
  • ఒకే ఒక సినిమా… ఫుల్ స్టాప్… నేనూ నా సంగీతం… అదే నా ప్రపంచం…
  • అగరుపొగలా, అత్తరులా… ఊహూఁ… ఆ శోభన తాంబూలంలోనే ఏదో వెలితి…
  • తమ్ముడు పెళ్లి – మామ భరతం..! ఈ కథాకమామిషు ఏమిటనగా..!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions