వందల కోట్లు ఖర్చు పెడుతున్నాం అంటారు… లబ్దిప్రతిష్టులు మస్తు వర్క్ చేస్తున్నారు అంటారు… ఘనకీర్తి కలిగిన పెద్ద తలకాయలకు మస్తు క్రియేటివిటీ ఉంది అంటారు… తీరా చూస్తే ఏదో తెలంగాణ జానపద గీతం ట్యూన్‌ను కాపీ కొట్టడం, ఢమఢమ కొత్త వాయిద్యాలతో ఒరిజినల్ ట్యూన్ మధురిమను భ్రష్టుపట్టించడం… ఎందుకీ భావదరిద్రం అంటారా..? తెలంగాణ లైఫ్ ఉన్న ఫోక్ వాళ్లకు అంతుపట్టదు, కాపీ కొట్టేయడమే సులువు అనుకోవడం… ప్రస్తుతం తెలంగాణ గీతానికి ఆదరణ ఉంది కాబట్టి… తెలంగాణ వాయిద్యాలు, పాటగాళ్లు, పాటలు, బాణీలు కావాలి కాబట్టి… సుద్దాల వంటి కాపీ మాస్టర్ల సహకారం ఫుల్లు ఉంటుంది కాబట్టి… (పాత బాణీ కాకపోయినా సరే, తెలంగాణతనం ఉన్న పాట అంటే ఏమిటో ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా’ అనే పాట నిరూపించింది తెలుసు కదా…)
ఆమధ్య దాని కుడిభుజం మీద కడువా, దాని గుత్తెపు రైకలు మెరియా… అది రమ్మంటే రాదే సెలియా… దాని పేరే సారంగ దరియా… అనే పాట వివాదం తెలుసు కదా… ఆ ట్యూన్, మొదటి పంక్తులు యథాతథంగా ఎత్తేసిన సుద్దాల, దాన్ని సమర్థించుకోవడానికి, కప్పిపుచ్చుకోవడానికి, సర్దుబాటు చేయడానికి నానా తిప్పలూ పడ్డాడు… ఆ వివాదం జోలికి మళ్లీ ఇప్పుడెందుకులే గానీ… పాటల్ని, ట్యూన్లను ఎత్తేయడంలో తమన్ పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంటుంది… మంచి ట్యూన్లకు పేరొంది, గతంలో మంచి పేరు సంపాదించిన కీరవాణి కూడా చివరకు ఆ బాటే పట్టాడా..? వందల కోట్లు ఖర్చు చేస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాకు కూడా చివరకు ఈ ‘ట్యూన్ చోరీ’ మరక తప్పలేదా..?
Ads
ఓ కొత్త పాట రిలీజ్ చేశారు కదా… కుమ్రం భీముడో అని మొదలవుతుంది… ఆ పాటలో కంటెంటు జోలికి పోవడం లేదు గానీ… ఆ పాట ట్యూన్ వినగానే చటుక్కున స్పురించేది ఎన్నేళ్లుగా తెలంగాణజనం పాడుకునే మదనా సుందరీ అనే ట్యూన్… సుద్దాల చెప్పాడా..? కీరవాణి సొంత చోరీయా..? ఇంకెవరైనా సలహా ఇచ్చారా తెలియదు గానీ… వీళ్లకు వేరే క్రియేటివ్ ట్యూన్లు చేతకావడం లేదా..? స్వరాల ఖజానా వట్టిపోయిందా..? ఆ మదనా సుందరీ పాట ఇలా సాగుతుంది…
మదనా సుందరి మదనా సుందరి,
నా మామ కొడుకొచ్చె మంచం చెయవొయి వడ్లొళ్ల చారి,
మనసు ఆడి లగ్గం చెేసుకుంటుండయొ నన్నేరికోరి,
మల్లచ్చే ఐతారం మనువు కుదిరింది మాకు,
మనసెంతో బంగారం నవ్వెంతో సింగారం,
సాగె ఉసిన చెక్క సక్కడిది పెట్టవొయి వడ్లొడ్ల చారి
పెద్ద బాడిసెతోటి ముద్దుగ చెక్కవొయి బలమంత నూరి
మిరుసురాయె మీద, మెరుపయుదం వచ్చేదాక
నువ్వు నూరవొయి వులి బాడిస, నావొడు మెచ్చేదాక
ఈ పాటలో కాళ్లందేట్టుగా మంచం ఎత్తు ఎట్లుండాలో, డిజైన్ ఏముండాలో, హంసలు-చిలుకలు ఎట్ల చెక్కాలో చెబుతుంది ఆమె… మంచం కోళ్లు చప్పుడు చేయొద్దు, కూర్చుంటే కనీసం కిర్రుమనొద్దు అని కూడా ముద్దుగా జాగ్రత్తలు చెబుతుంది… నీ కష్టం ఉంచుకోను, కట్నం దాచుకోను అని కూడా ఆశపెడుతుంది… భలే సరదాగా పాడుకుంటారు జానపదులు ఎన్నేళ్లుగానో… బావ మీద ప్రేమనంతా రంగరించి పాడుతుంది మురిపెంగా…
అప్పట్లో రంగులకల కోసం గద్దర్ కూడా ఇదే ట్యూన్ తో ఒక పాట పాడిండు… అదీ జనంలోకి బాగా పోయింది… సరే, దాన్నలా వదిలేస్తే… సాధారణంగా రాజమౌళి సినిమాల టీజర్లు, ప్రోమోల్లో హీరోలు గట్రా హైలైట్ అవుతుంటారు కదా… ఈ పాట వీడియోలో ఓ గాయకుడు మాత్రమే పాడుతూ కనిపించాడు… ఓ స్టార్ హీరో స్థాయిలో ప్రొజెక్ట్ చేశారు… కీరవాణి, రాజమౌళి సినిమాలో ఈ విచిత్రం ఏమిటి బాబోయ్ అని ఆరాతీస్తే అతను కీరవాణి కొడుకని తెలిసింది… పేరు కాలభైరవ అట… గొంతు బాగుంది, పాడిన తీరు బాగుంది… కానీ ఆ ట్యూన్ కాపీ ఏమిటి..? ఇలా సొంత కొడుకును అంత హైలైట్ చేస్తూ వీడియోలు ఏమిటి..? హేమిటో… ఆర్ఆర్ఆర్ సూచనలన్నీ ‘‘ఏదో భిన్నమైన దిశలో’’ కనిపిస్తున్నయ్…!! అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ సైన్యంలో జవానుగా పనిచేసి, ఇండియన్లను చితకబాదడం అనేదే ఈరోజుకూ జీర్ణం కావడం లేదు, ఇంకా ఈ పాటల షాక్ అదనం అన్నమాట…!!
Share this Article