.
కీర్తి సురేష్… మహానటిలో బాగానే చేసింది… ఆ బ్రాండ్‌తో బాగానే నెట్టుకొస్తోంది… మొదట్లో కాస్త పుష్టిగానే ఉండేది కానీ క్రమేపీ సన్నబడుతూ, పెద్ద హీరోలతో కూడా పనిచేస్తూ తన డిమాండ్‌ను పదిలంగానే కాపాడుకుంటూ వస్తోంది… కానీ..?
ఈ ఉప్పుకప్పురంబు ఓటీటీ సినిమా ఆమె ఎందుకు అంగీకరించిందో ఆమెకే తెలియాలి… సుహాస్ వంటి చిన్న హీరోల పక్కన నటించడానికి అంగీకరించడం కూడా తన వ్యక్తిగత వాణిజ్య కోణంలో కరెక్టు కాదనిపించింది… పోనీ, అదేమైనా బాగా పేరు తెచ్చే పాత్రా అంటే, అదీ లేదు… అసలు ఆ పాత్ర డిజైనే సరిగ్గా లేదు…
Ads
పోనీ, దాన్నయినా సరిగ్గా చేసిందా అంటే, అదీ లేదు… మొదటిసారి బాడీ లాంగ్వేజ్ తో కామెడీ పండించాలని నానారకాలుగా ప్రయత్నించి, తాను కష్టపడి, ప్రేక్షకుల్ని ఇబ్బందిపెట్టింది… పాత్ర అర్థం గాక అలా తిప్పలు పడిందా..? లేక అర్థమయ్యీ అతి చేసిందా..? ఆమెకే తెలియాలి… ఒక స్థాయి వరకే జీరో సైజు వోకే, ఈమె మరీ పలుచబడి, ఎండుకుపోతోంది…
ఈ సినిమాకు ఆమే ప్లస్, హైలైట్ అనుకున్నారు కాబట్టి ఇదంతా చెప్పాల్సి వచ్చింది… సుహాస్ బాగానే చేశాడు… ఆ పాత్రకు అవసరమైనంత..! నిజానికి తీసుకున్న కథ సింపుల్, స్ట్రెయిట్… కాస్త ఎమోషన్లు గట్రా కుదిరితే బాగానే ఉండేదేమో… కానీ కామెడీతో కథ చెప్పాలని ప్రయత్నించి భంగపడ్డాడు దర్శకుడు ఫాఫం…
వారసత్వంగా తండ్రి నుంచి వచ్చిన పెద్దరికం… అటు స్మశానంలో స్థలాల కొరత… నలుగురికి మాత్రమే చాన్స్ ఉంది అన్నప్పుడు ఆమె ఏం తిప్పలు పడింది, చివరకు ఎలా పరిష్కరించింది అనేది కథ స్థూలంగా..! అసలు ఆ ప్రచార చిత్రంలోనే స్మశానానికి హౌజ్ ఫుల్ అనే బోర్డు కనిపించి, చిరాకు పెట్టింది… పైగా లాటరీ సిస్టం… హేమిటేమిటోగా ఉంది కథ ప్రజెంటేషన్…
అవునూ, ఈ ఉప్పుకప్పురంబు అనే టైటిల్ ఎందుకు పెట్టినట్టు..? ఏమోలే, సినిమాలకు టైటిళ్ల ఔచిత్యాలు అనే పెద్ద సబ్జెక్టు ఎందుకులే గానీ… బాబూ మోహన్ కూడా ఈ పాత్ర అంగీకరించకుండా ఉండాల్సింది… స్టోరీ లైన్ కాస్త భిన్నమైంది ఎంచుకున్నప్పుడు, దాని ట్రీట్‌మెంట్ కూడా కాస్త రక్తికట్టేలా ఉంటే సినిమా బాగుండేది…
ఇంతకుమించి చెప్పడానికి ఏమీలేదు… కీర్తి సురేష్ గురించి చెప్పడానికి ఈ కాస్త సమీక్ష, లేకపోతే ఇదీ అవసరం లేదు… సినిమాకు సంబంధించి పైన ఫోటో చూశారు కదా… ప్రేక్షకులు కూడా చాలాసార్లు అలాగే తలలు పట్టుకుంటారన్నమాట, సింబాలిక్‌గా…!
ఉప్పుకప్పురంబు నొక్క పోలికనుండు… చూడచూడ రుచుల జాడవేరు… అవును, కీర్తి సురేష్ తన పాత్రల ఎంపికలోనే ఏది ఉప్పో, ఏది కప్పురమో తెలుసుకుంటే తన కెరీర్‌కే మంచిది, లేకపోతే ఇలాంటి పాత్రలకు సరిపోయే నటన చూపలేక తిప్పలు, మహానటి తాలూకు ‘కీర్తి’కి మచ్చలు…!!
Share this Article