మాట పెదవి దాటితే మటాష్ అని కొత్త సామెత… సినిమా ఇండస్ట్రీకి ఇది మరీ వర్తిస్తుంది… ఆడ తారలకైతే మరీ మరీనూ… వాళ్లు ఏం మాట్లాడినా మగహం ఒప్పుకోదు… వీళ్ల సిట్యుయేషన్ సున్నితంగా ఉంటుంది… ఏదైనా ఒక్క మాట మనసు విప్పి మీడియా ముందు వెల్లడిస్తే చాలు, దానికి బోలెడు పెడర్థాలు తీస్తారు… మీడియా నానా కథలూ అల్లుతుంది… వెరసి బస్టాండులో నిలబెడతారు, బాధితులైనా సరే..!
సరే, వ్యూయర్ షిప్ కోసం యూట్యూబర్లు, మీడియా సైట్స్ ఏవేవో రాస్తాయి అనుకుందాం… కానీ ఇండస్ట్రీలో ముఖ్యులు ఏది పడితే అది మాట్లాడకూడదు… ప్రత్యేకించి నావకు కెప్టెన్‌గా వ్యవహరించాల్సిన దర్శకుడు ఎంతగా నోటిని కట్టేసుకుంటే అంత గౌరవం, అంత మంచిది కూడా… కానీ అజయ్ దేవగణ్‌తో మైదాన్ అనే సినిమా తీస్తున్న అమిత్ శర్మకు ఈ సోయి లేనట్టుంది…
ఏప్రిల్ 9న ఈ సినిమా రిలీజ్ కానుంది… 1952 నుంచి 1962 నడుమ ఫుట్ బాల్ కోచ్‌గా వ్యవహరించిన సయ్యద్ అబ్దుల్ రహీం అలియాస్ రహీం భాయ్ బయోపిక్ ఇది… నిర్మాతలు నలుగురైదుగురున్నా బోనీకపూర్ ముఖ్యమైనవాడు… మొన్న సినిమా ప్రమోషన్ మీడియా మీట్‌లో దర్శకుడు మాట్లాడుతూ… ‘ఈ సినిమాలో రహీం భార్య రునా పాత్రకు మొదట కీర్తి సురేష్‌ను అనుకున్నాం, కానీ ఆమె బరువు బాగా తగ్గిపోయింది… నేను స్క్రిప్టు రాసుకున్నప్పుడే కాస్త బొద్దుగా ఉన్నవాళ్లయితే బాగా సూటవుతారు అనుకున్నాను… కానీ కీర్తిసురేష్ స్లిమ్ కావడంతో ఆమె బదులు ప్రియమణిని తీసుకున్నాం’ అని చెప్పుకొచ్చాడు…
Ads
ఉత్త నాన్సెన్స్… మొదట ఆమెను తీసుకున్నప్పుడు ఈ సోయి లేదా..? హీరో, దర్శకుడు, నిర్మాత అన్నీ ఆలోచించుకున్నాకే కదా ఆమెతో టచ్‌లోకి వెళ్లారు… మరి కథ రాసుకున్నప్పుడే బొద్దు ఆకారం ఊహించుకున్నప్పుడు మరి కీర్తిసురేష్ కావాలని ఎందుకు ప్రయత్నించారు..? అందుకే అనేది సినిమాకు కెప్టెన్ వంటి దర్శకుడికి మొదట కావల్సింది నోటిపై అదుపు అని..!
అసలు జరిగింది ఏమిటి..? కీర్తిసురేష్‌ను బోనీకపూర్ అడిగాడు… బాలీవుడ్ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న ఆమెకు ఇది మంచి అవకాశం అనుకుంది మొదట్లో… పేరున్న నిర్మాత, పేరున్న హీరో, బాలీవుడ్‌లోకి మంచి ఎంట్రీ అవుతుందనీ అనుకుంది… తీరా ఆమెకు ఎవరైనా హితవు చెప్పారో, నిర్మాతకే ఎవరైనా చెప్పారో గానీ ఆమె ఈ ప్రాజెక్టు నుంచి బయటికి వస్తున్నట్టుగా నిర్మాతకు చెప్పింది… ఎందుకంటే… వయస్సు సమస్య…
హీరోకూ ఆమెకూ నడుమ చాలా ఏజ్ గ్యాప్ కనిపించనుంది… ఆ పాత్రలకూ అలా సూట్ కాదు… (పైగా కీర్తిసురేష్‌కు దీని బదులు ఏదైనా కమర్షియల్ ప్రాజెక్టు ద్వారా ఎంట్రీ ఇస్తే బాగుంటుందని తన స్నేహితులు చెప్పారట…) నిజమే, మహానటి సినిమా వచ్చేవరకు నాలుగైదేళ్లు తమిళ సినిమాల్లో చేస్తున్నా ఆమెకు పెద్ద హైప్ రాలేదు… తీరా మహానటితో బాగా పాపులరయ్యాక ఆ ఇమేజీ నుంచి బయటపడి ఓ కమర్షియల్ హీరోయిన్‌గా మారడానికి చాన్నాళ్లు పట్టింది… సన్నబడింది… సర్కారు వారి పాట సినిమాకొచ్చేసరికి ఆమె రూపురేఖలు మారిపోయాయి…
ఇక మైదాన్ విషయానికి వస్తే ఆమే ఆ పాత్ర వద్దనుకుని బోనీకపూర్‌కు చెప్పింది… ఆయన సరేనన్నాడు… ఇది జరిగి చాన్నాళ్లయింది… తరువాత ఆమె ప్లేసులో ప్రియమణిని తీసుకున్నారు… ఆమె జవాన్, ఆర్టికల్ 370 సినిమాల్లో చేసింది, హిందీలో అవకాశాలు వస్తున్నాయి, యాక్టివ్‌గా ఉంటోంది చాన్నాళ్ల తరువాత… ఐతే బొద్దుగా లేదని కీర్తిసురేష్‌ను వద్దన్నాం, ప్రియమణిని తీసుకున్నాం అనేది అబ్సర్డ్ స్టేట్‌మెంట్…
కీర్తిసురేష్ 30 ఏళ్లు… ప్రియమణి 40 ఏళ్లు… ఇద్దరూ దాదాపు సేమ్ ఫిజిక్… నిజానికి ప్రియమణి కాస్త హైట్ కాబట్టి తనే సన్నగా కనిపిస్తుంది… కాకపోతే కీర్తికన్నా ముదురు మొహం… ఆ పాత్రకు సూటవుతుంది… అదీ అసలు కారణం… కానీ సన్నబడింది, అందుకే తీసేశాం అని పిచ్చికూతలకు దిగాడు దర్శకుడు… (కీర్తి ఈ పాత్రను వద్దనుకుని బేబీజాన్ సినిమాకు సైన్ చేసింది… తమిళ తెరికి ఇది హిందీ రీమేక్… వరుణ్ ధావన్ హీరో…)
మరీ సుహాస్ వంటి అప్‌కమింగ్ హీరోలతో సినిమాలకు సైన్ చేస్తోంది, తప్పు చేస్తోంది, దెబ్బతింటుంది వంటి విమర్శల సంగతి వేరు… కానీ మైదాన్ సినిమాకు సంబంధించి కీర్తిసురేష్‌ను మెచ్చుకోవాల్సింది ఏమిటంటే… సినిమాతో ఒప్పందం, బయటికి వచ్చేయడం, దర్శకుడి వ్యాఖ్యలు గట్రా ఆమె ఏమీ పట్టించుకోలేదు… నవ్వి వదిలేసింది తప్ప ఒక్క మాట కూడా బయట ఏమీ మాట్లాడలేదు… ఆమె మహానటి కదా, తెలుసు… మాట పెదవి దాటితే అదిక తన అదుపులో ఉండదని, మరీ వక్రబాష్యాలు ఎక్కువైన రోజుల్లో… నానారకాలుగా ఈకలు పీకి పెంట చేస్తారు… అందుకే అనుకుంది… ఊరుకున్నంత ఉత్తమం లేదని..!!
Share this Article