జస్టిస్ ఎన్.వి.రమణ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యాక, తన నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు వచ్చిన ఓ ఇంట్రస్టింగు కేసు ఓ జర్నలిస్టుది… కాస్త వివరాల్లోకి వెళ్లాలి, ఎందుకంటే… బహుముఖంగా చాలా ఇష్యూస్ ముడిపడి ఉన్న కేసు ఇది… అందుకే అందరి ఆసక్తీ దీనిపై కేంద్రీకృతమైంది… సీజే ధర్మాసనమే విచారిస్తోంది… ఆ జర్నలిస్టు పేరు సిద్దిక్ కప్పన్… కేరళలోని మల్లపురం తనది… ఢిల్లీలో పనిచేస్తున్నాడు… ఆమధ్య యూపీలోని హత్రాస్ అత్యాచారం కేసు బాగా సంచలనం సృష్టించింది తెలుసు కదా, దాని కవరేజీకి వెళ్తున్న కప్పన్‌ను యూపీ పోలీసులు అరెస్టు చేశారు… అదేమిటి..? వార్త కవర్ చేయడానికి వెళ్లడం నేరమా..? ఎలా అరెస్టు చేస్తారు..? అన్యాయం కాదా, చట్టవ్యతిరేకం కాదా..? పాత్రికేయ స్వేచ్ఛకు భంగకరం కాదా..? ఇవే కదా మీ ప్రశ్నలు… కానీ యూపీ పోలీసులు చెప్పే కథనం వేరు…
‘‘ఈ కప్పన్ ప్రస్తుతం జర్నలిస్టు కాదు, తను గతంలో పనిచేసిన తేజస్ అనే న్యూస్‌పేపర్ 2018లోనే మూతపడింది… ఆ ఐడీ కార్డునే ఇంకా వాడుతున్నాడు… వివాదాస్పద పీఎఫ్ఐ సంస్థ యాక్టివిస్టు తను… ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు ఢిల్లీలో ఆఫీసు కార్యదర్శి… హత్రాస్ సంఘటన జరగగానే కులాల మధ్య విద్వేషాల్ని మరింత రగల్చడం కోసం ఆ సంస్థ యాక్టివిస్టులతో కలిసి హత్రాస్ బయల్దేరాడు… అందుకే అరెస్టు చేశాం…’’ ఇదీ యూపీ పోలీసుల కథనం… మామూలు కేసు కాదు, మొత్తం నలుగురిపై ఉపా కేసు పెట్టేశారు… జస్టిస్ బాబ్డే సీజేగా ఉన్నప్పుడు కూడా సుప్రీంలో తన నిర్బంధం మీద విచారణ జరిగింది… ఉపా మాత్రమే కాదు, తరువాత ఈడీ కూడా ఎంటరై ఒక మనీలాండరింగ్ కేసు పెట్టింది… కేరళ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ దీని మీద పోరాడుతోంది… కప్పన్ జర్నలిస్టే, మా సభ్యుడు అంటుంది యూనియన్… సో వాట్, తను ఏ పని మీద యూపీకి వస్తున్నాడనేదే మాకు ముఖ్యం, జాతి విద్వేష ప్రయత్నాలు ఎవరు చేసినా ఊరుకునేది లేదు అనేది యూపీ వాదన…
Ads
తనను జర్నలిస్టు సంఘాలు ఎలా చూడాలి..? పీఎఫ్ఐ ఆఫీస్ బేరర్‌గా చూడాలా..? యూనియన్ సభ్యుడిగా చూడాలా..? అసలు జర్నలిస్టు అంటే ఎవరు..? ఎవరిని జర్నలిస్టుగా గుర్తించాలి..? ఓ ఫ్రీలాన్సర్‌గా ఉంటే జర్నలిస్టు అనిపించుకోడా..? అసలు చట్టవ్యతిరేక కార్యక్రమాలకు జర్నలిస్టు అనే కవర్ ఎంతవరకు కరెక్టు..? వీటికి చట్టం క్లియర్‌గానే ఉంది… నీ వృత్తి ఏమిటనేది చట్టానికి అనవసరం..? నువ్వు నేరం చేశావా.?. చేస్తే దాని స్వభావం, తీవ్రత ఏమిటి..? ఇవి మాత్రమే చట్టానికి అవసరం… పైగా జర్నలిస్టులకు ప్రత్యేక హక్కులేమీ ఉండవు… భావప్రకటన స్వేచ్ఛ పరిధిలోకి వచ్చే ఓ చిన్న అంశమే మీడియా స్వేచ్ఛ… అంతే… పైగా ఉపా చట్టం పరమ నొటోరియస్… అప్పటి టాడా, పోటా చట్టాలకు మించి కఠినతరం…
ఇక ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే..? మథుర జైలులో ఉన్న కప్పన్‌కు కరోనా సోకింది… హాస్పిటల్‌కు తీసుకెళ్లారు… అక్కడ తనను మంచానికి సంకెళ్లతో పశువులా కట్టేశారని, తనను తిరిగి జైలుకు పంపించి కాపాడండీ అని కప్పన్ భార్య రైహంత్ ఫిర్యాదు చేసింది… ‘‘టాయిలెట్‌కు కూడా పోనివ్వరు, ఓ ప్లాస్టిక్ డబ్బాలో పోయిస్తారు, సరైన తిండి లేదు, ఇలాగే కొనసాగితే ఆ కరోనా నా భర్తను మింగేస్తుంది, నా భర్తను కాపాడండి’’ అనేది ఆమె అప్పీల్… నిజంగానే ఆ పరిస్థితి అమానవీయం… తను చట్టరీత్యా అండర్ ట్రయల్… తన ఆరోగ్యం సర్కారు బాధ్యతే… పైగా చట్టాల పరిధిలో ఎలాగూ విచారిస్తున్నారు, మరి అలాంటప్పుడు ఈ అనాగరిక ధోరణి దేనికి..?
యూడీఎఫ్‌కు చెందిన దాదాపు 11 మంది ఎంపీలు ఈ విషయంలో సీజే జోక్యం కోరుతూ లేఖ రాశారు… కేరళ సీఎం విజయన్ యూపీ సీఎం యోగికి లేఖ రాశాడు… మరో పిటిషన్ కోర్టులో పడింది… ఈ స్థితిలో సుప్రీం ధర్మాసనం దాన్ని విచారించింది… మంచానికి ఇలా సంకెళ్లతో కట్టేయడం ఏమిటి అని ధర్మాసనం ప్రశ్న… కప్పన్ ఏమీ అక్రమ నిర్బంధంలో లేడు, కోర్టు ఆదేశాల మేరకే నిర్బంధించారు అని యూపీ తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అంటాడు… కానీ ధర్మాసనం మాత్రం ‘బుధవారం నుంచి విచారణ జరుపుదాం, ఈలోపు తన ఆరోగ్య స్థితిపై అర్జెంటుగా రిపోర్టులు తెప్పించండి, ఆ కాపీలు ఆయన కుటుంబీకులకు, లాయర్లకు కూడా ఇవ్వాలి’ అని ఆదేశించింది… అసలు ఈ కేసుకు విచారణార్హత లేదనే ఆయన వాదనను సుప్రీం తోసిపుచ్చింది… విచారణకు స్వీకరించింది… జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఆ జర్నలిస్టు నిర్బంధ దుస్థితిపై ఎలా స్పందిస్తుందనేది ఇందుకే ఆసక్తికరంగా మారింది…!!
Share this Article