.
అసలు దైవభక్తికీ, మత విశ్వాసాలకూ… ఆహారపు అలవాట్లకూ సంబంధం ఏముంది..? కానీ మన రాజకీయాలు, వర్తమాన సోషల్ మీడియా అజ్ఞానం ప్రతిదీ వివాదంగా మారుస్తుంటాయి కదా… ఇదీ అంతే… హఠాత్తుగా ఎవడో స్టార్ట్ చేస్తాడు ఓ చర్చ… రాముడు మాంసాహారా..? శాకాహారా..? అసలు ఈ ప్రశ్నే పెద్ద అబ్సర్డ్…
రాముడు క్షత్రియ రాజు… మాంసం తింటాడు, తిన్నాడు, తప్పేముంది..? దాంతో తన దైవిక లక్షణాలు ఏమైనా మసకబారతాయా..? కానీ శాకాహారే అని వాదించేవాళ్లు కొందరు… సరే, తాజా ఉదాహరణ ఏమిటంటే..? కేరళ కొత్త గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన ఓం ప్రకాష్ మాథుర్ తీసుకున్న ఒక నిర్ణయం…
Ads
ఇది రాజకీయ దుమారానికి దారితీసింది… ఆయన రాగానే లోకభవన్ కిచెన్‌లో పూర్తిగా శాకాహారం అంటే వెజిటేరియన్ వంటకాలు మాత్రమే వండాలని తొలిరోజే ఆదేశాలు జారీ చేయబడ్డాయి… ఇంకేముంది..? దొరికాడులే అనుకున్న అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష సీపీఐ(ఎం) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి…
‘‘ఈ నిర్ణయం సంఘ్ పరివార్ అజెండాను అమలు చేయడంలో భాగమే’’ అని కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ ఆరోపణ… కేరళలో తీరప్రాంతం కారణంగా సమృద్ధిగా లభించే చేపలు, మాంసాహారాన్ని నిషేధించేలా గవర్నర్ వ్యక్తిగత రుచులను రుద్దడం రాజ్యాంగ విరుద్ధం అంటున్నాడు… వ్యక్తిగత స్వేచ్ఛను హరించే ఈ ప్రయత్నాన్ని అంగీకరించబోం అన్నాడు… కేరళ హోంమంత్రి రమేష్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు…

శాకాహార, మాంసాహార ఎంపిక ప్రజాస్వామిక హక్కు అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్ పేర్కొన్నాడు… ఆహారాన్ని కూడా మతపరమైన ఆయుధంగా మార్చాలని చూస్తున్నారని ఆయన విమర్శించాడు… కేరళ సంప్రదాయ జీవన శైలిని దెబ్బతీసే కుట్ర జరుగుతోందన్నాడు…
ఇక్కడ ఎన్నిరకాల ప్రేలాపనలు, నిర్ణయాలో చూద్దాం… 1) గవర్నర్ శుద్ధ శాకాహారి అయితే తను తినకుండా ఉంటే చాలు… మొత్తం కిచెన్‌లోనే శాకాహారం ఓన్లీ అని రూల్ పెట్టేయాల్సిన పనిలేదు… లోకభవన్ కూడా ఏదో వివరణ జారీ చేస్తూ… కిచెన్‌లో మాంసాహారం వండొద్దు అన్నామే గానీ సిబ్బంది మాంసాహారం తెప్పించుకుని తినొచ్చు అని పేర్కొంది…
మాంసాహారం వండే పాత్రలు, వాడే స్పూన్లు, ప్లేట్లపై అభ్యంతరాలుంటే… అవి కొత్తవి కొని గవర్నర్ కోసం వాడితే సరి… బయటి నుంచి తెచ్చుకుని తినొచ్చట, కిచెన్‌లో వండొద్దట… పిచ్చి నిర్ణయం… అలాగే సీపీఎం, కాంగ్రెస్ విమర్శలు మరీ అడ్డగోలు యవ్వారం…
అసలు సంఘ్ పరివార్‌కూ మాంసాహారానికీ ఏం లింక్..? గవర్నర్ మాంసాహారం వద్దంటే అది సంఘ్ పరివార్ ఎజెండా ఎలా అవుతుంది..? అందుకే ఇదోరకం ప్రేలాపన… ఇది రాజ్యాంగ విరుద్ధం అని వ్యాఖ్యానించేదాకా వెళ్లిపోయాడు వేణుగోపాల్…
సీపీఎం ధోరణి తెలిసిందే కదా… ఆహార ఎంపిక ప్రజాస్వామిక హక్కు అనే వ్యాఖ్య వరకూ కాస్త వోకే… కానీ ఈ నిర్ణయం మతపరమైన ఆయుధం అట… డొల్ల విమర్శ… అంతేకాదు, గవర్నర్ ఏకంగా కేరళ సంప్రదాయ జీవనశైలిని దెబ్బతీసే కుట్ర అట… గవర్నర్ ఏమైనా కేరళ ప్రజలకు మాంసాహారం మానేయాలని పిలుపు ఇచ్చాడా..? లేదు కదా… మరెందుకీ పిచ్చి వ్యాఖ్యానాలు..? దీన్నే ‘అతి’ అంటారు…
బీఫ్- గోమాంసం నడుమ తేడా కూడా తెలియకుండా వివాదాన్ని ఎంత రాజేశారో చూశాం కదా… ఈ దేశానికి ప్రధాన, ప్రథమ శత్రువులు రాజకీయ నాయకులే… పనికొచ్చే అంశాలు గాకుండా పనికిమాలిన అంశాలన్నీ వివాదంగా మారుస్తారు… అన్ని పార్టీల్లోనూ ఇంతే… మినహాయింపుల్లేవు… ఈ గవర్నర్ కూడా ఓ రాజకీయ నాయకుడే కదా…!!
Share this Article