Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రైల్వే రిజర్వేషన్లు రకరకాలు… జబర్‌-దస్తీ సీట్ల దందా ఓరకం…

April 4, 2025 by M S R

.

శంక‌ర్‌రావు శెంకేసి (79898 76088) ……  మన దేశంలో ప్రతి రోజూ 13 వేల ప్యాసింజర్‌ రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ రైళ్లలో 84,863 ప్యాసింజర్‌ కోచ్‌లుంటాయి. ఈ రైళ్లలో రోజూ ప్రయాణించే వారి సంఖ్య ఎంతో తెలుసా…? అక్షరాలా 2 కోట్ల 40 లక్షలు.

రోజు వారీ రైల్వే ఆదాయం రూ.600 కోట్లు. ఇందులో గూడ్సు రైళ్ల నుంచి వచ్చే రాబడి కూడా కలిసి ఉంటుంది. ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే వ్యవస్థల్లో భారతీయ రైల్వేలది నాలుగో స్థానం. దేశ ఆర్థికవృద్ధిలో రైల్వే ద్వారా వస్తున్న ఆదాయానిది క్రియాశీల పాత్ర.

Ads

చరిత్ర ఘనంగానే కళ్లకు కడుతున్నా.. ప్రయాణికులకు అందించే సేవలు, నిర్వహణ ప్రమాణాలకు సంబంధించి మాత్రం మన రైల్వే మిగతా దేశాలతో పోల్చుకుంటే సుదూరంగా ఉంటుంది. లోతుల్లోకి వెళ్లి ఆ లోటుపాట్లను చర్చించుకోవడం చర్విత చరణమే అవుతుంది. సరే, అదలా పక్కన పెడదాం.

రైల్వే నిర్వహణకు సంబంధించి మన దేశంలో ‘రైల్వే చట్టం 1989’ అనేది ఒకటి అమల్లో ఉంది. ఈ చట్టంలో ప్రయాణికులు, గూడ్సు రవాణా, రైల్వే స్టేషన్ల నిర్వహణ, ట్రాక్‌లు, గేట్లు, ఆర్వోబీలు, ఆర్‌యూబీలు, టికెట్లు, జరిమానాలు… ఇలా అనేక అంశాలకు సంబంధించి అనేక నియమాలు, నిబంధనలు వున్నాయి.

రైలులో స్లీపర్‌ క్లాస్‌ నుంచి ఫస్ట్‌ క్లాస్‌ వరకు టికెట్లకు రిజర్వేషన్‌ ఉంటుందనే తెలిసిన విషయమే. మన కేటాయించిన సీట్‌లో మరెవరైనా కూర్చుంటే వారిని ఖాళీ చేయించడానికి ఈ చట్టం సెక్షన్‌ 155లో ప్రత్యేకమైన నిబంధనలను నిర్దేశించింది.

టీటీఈకి, ఆర్‌పిఎఫ్‌ సిబ్బందికి తెలుపడం ద్వారా, రైల్‌ మద్దత అనే యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయడం ద్వారా, 139కి కాల్‌ చేయడం ద్వారా వారిని అక్కడి నుంచి పంపించవేయవచ్చని, వారికి రూ.500 జరిమానా, 3 నెలల జైలుశిక్ష విధించవచ్చని చెబుతోంది. కానీ మన రైళ్లలో ఈ నిబంధన అంత సులువుగా అమలు కాదు.

ప్రత్యేకించి ఉత్తర- దక్షిణ భారతాల మధ్య తిరిగే రైళ్లలో స్లీపర్‌ క్లాసులో ఈ ఆక్రమణలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. టీటీఈ కాదు కదా, ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది కూడా స్లీపర్‌ క్లాసులోకి వెళ్లి వారిని ఖాళీ చేయించలేరు. ఎందుకంటే బోగీలోకి అడుగుపెట్టే ఛాన్సే ఉండదు కాబట్టి. అయితే బతిమలాడటం ద్వారానో, లేదంటే ఏదో మూలకు అడ్జస్ట్‌ కావడం ద్వారానో టికెట్‌ రిజర్వు చేసుకున్న వారు తమ ప్రయాణం కొనసాగిస్తూ ఉంటారు. ఇది రిజర్వుడ్‌ క్లాస్‌ల సంగతి.

అయితే ఈ తరహా రూల్‌ జనరల్‌ కంపార్ట్‌మెంట్‌కు కూడా ఉందని చాలా మందికి తెలియదు. మన దేశంలోని రైళ్లలో జనరల్‌ కంపార్ట్‌మెంట్‌లలో ప్రయాణించడమంటే… మహాభారతంలోని పద్మవ్యూహంలో చిక్కుకోవడం లాంటిదే. స్టేషన్‌లో ఆగేందుకు రైలు నెమ్మది అవుతుండగానే కొందరు ప్రయాణికులు దానితో సరిసమానంగా పరుగెత్తుకుంటూ జనరల్‌ బోగీలోకి దూసుకెళ్తారు.

ఇంకొందరు రైలు ఆగుతున్న క్రమంలో హడావిడి పడుతూ కిటికీలోంచి ఖర్చీఫ్‌నో, చున్నీనో, బ్యాగునో, టవల్‌నో ఖాళీగా వున్న సీట్లలోకి విసిరివేస్తుంటారు. ఇక ఆ సీటు తమదే అని రిజర్వు చేసుకున్నట్టుగా విజయగర్వంతో ఫీలైపోతారు.

ఈ పోరాటంలో మహిళలు, వృద్ధులు, వికలాంగులు, మొహమాటస్తులు వెనుకబడిపోతుంటారు. జనరల్‌ బోగీల్లో సీట్లన్నీ అన్‌రిజర్వుడ్‌. బస్సులో వున్నట్టుగా మహిళలకు, వికలాంగులకు, వృద్ధులకు సీట్లు కేటాయించబడి ఉండవు. అందుకే ఈ ఆరాట పోరాటం.

మన రైళ్లలో జనరల్‌ కోచ్‌లలో సగటున 100 సీట్లే ఉంటాయి. ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీల్లో (ఐసీఎఫ్‌) తయారయ్యే బోగీల్లో 90, హైబ్రీడ్‌ డిజైన్‌ కోచ్‌ (ఎస్‌జీఎస్‌)లలో 100, లింక్‌ హాఫ్‌మన్‌ బుష్‌ (ఎల్‌హెచ్‌బి) కోచ్‌లలో 99 సీట్లు మాత్రమే ఉంటాయి.

కానీ, ప్రతీ రైల్వేస్టేషన్‌లో ఎక్కే దిగే ప్రయాణికులు వందల్లో ఉంటారు. కాబట్టి ఈ సీట్లు ఏ మూలకూ సరిపోవు. దీంతో కొందరు ప్రయాణికులు ఖర్చీఫ్‌ రిజర్వేషన్‌కు అలవాటుపడిపోయారు. రాను రానూ ఈ ఖర్చీఫ్‌ రిజర్వేషన్‌ చట్టబద్దమూ, న్యాయబద్దమూ అనే స్థాయికి ఎదిగిపోయింది.

నిజానికి ‘రైల్వే చట్టం 1989’ ప్రకారం గానీ, రైల్వే మ్యాన్యువల్‌ ప్రకారం గానీ జనరల్‌ బోగీల్లోకి ప్రయాణికులు క్యూ పద్ధతిలో ప్రవేశించాలి. మొదట ఎవరు లోపలికి వెళ్తారో వారికే సీటు దక్కుతుంది. ‘ఫస్ట్‌ కమ్‌.. ఫస్ట్‌ సర్వ్‌’ అనే పద్ధతి అన్నమాట.

సీటులో ఖర్చీఫ్‌ వున్నంత మాత్రాన, అది వేసిన వ్యక్తికి సీటు రిజర్వు అయినట్టు కాదని, ఆ ఖర్చీఫ్‌ను సీటు నుంచి తీసివేసి, మొదటి వచ్చిన ప్రయాణికులు అందులో కూర్చోవచ్చని నిబంధనలు చెబుతున్నాయని రైల్వే చట్టాల నిపుణులు, అధికారులు అంటున్నారు. అలా తీసివేసి కూర్చోవడం చట్టబద్ధమేనని వారు సెలవిస్తున్నారు.

ఇది ఎప్పటి నుంచో వున్నా… ఆచరణలోకి వచ్చే సరికి దానిని పట్టించుకున్న వారే లేరు. వేసిన ఖర్చీఫ్‌ను తీసివేసి ఎవరైనా కూర్చుంటే బోగీలో చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది. ‘చెప్పినవులే రూలు..’ అంటూ వాగ్వాదాలు, ఘర్షణలకు దిగడం సహజంగా మారింది. అప్పటికే రైలు కదులుతుంది..

టీటీఈ ఎక్కడో ఉంటాడు.. ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది అందుబాటులో ఉండరు.. దీంతో ‘ఎందుకొచ్చిన గొడవ.. ’ అనుకుంటూ మొదట వచ్చిన వారు సీటు ఫైట్‌ను విరమించుకుంటున్నారు. కొన్ని ప్రధాన నగరాల్లోని రైల్వే స్టేషన్లలో ఈ ఖర్చీఫ్‌ రిజర్వేషన్‌ ఓ దందాగా కూడా మారిందట. కొందరు వ్యక్తులు రేక్‌ నుంచి రైలు కదులుతున్న సమయంలోనే జనరల్‌ బోగీల్లోని సీట్లపైకి టవల్స్‌ విసిరేసి, ఆ సీట్లను సాధారణ ప్రయాణికులకు అమ్ముకుంటున్నారని చెబుతున్నారు.

ఇది దూరప్రాంతాలకు వెళ్లే రైళ్ల విషయంలో ఎక్కువగా జరుగుతోందట. ఆర్‌పిఎఫ్‌ పోలీసులు స్పెషల్‌ డ్రైవ్‌ ద్వారా ఖర్చీఫ్‌ రిజర్వేషన్‌కు పాల్పడుతున్న వారిని అరెస్టు కూడా చేశారు. అయితే దందాను పూర్తిగా అరికట్టలేక పోయారు.

జనరల్‌ బోగీల్లో ఈ అవస్థలు ఏమిటని ఎవరైనా ఆక్రోశిస్తే.. ప్రయాణికుల్లో క్రమశిక్షణ లోపిస్తోందని, సివిక్‌ సెన్సు లేదని రైల్వే పెద్దలు వ్యాఖ్యానాలు చేస్తుంటారు. కానీ, వారి హితోక్తులు ఎవరూ వినే పరిస్థితి లేదు. రద్దీకి సరిపడా రైళ్లను, జనరల్‌బోగీలను పెంచకుండా రూల్సు మాట్లాడితే వాదనకు నిలబడవు. చట్టాల్లో నిబంధనలు ఎప్పుడూ ఆదర్శంగానే ఉంటాయి.

కానీ, అనువైన పరిస్థితులు లేనప్పుడు, వాటిని ఎగ్జిక్యూట్‌ చేసే యంత్రాంగం కనబడనప్పుడు అవి ఎన్నటికీ, ఎప్పటికీ అమలు కావు. నిలబడి ప్రయాణం చేయగలిగే సత్తువ వున్న వారు, యువకులు… ఈ ఖర్చీఫ్‌ రిజర్వేషన్‌కు పాల్పడకుండా మహిళలు, వృద్ధులు, పిల్లలకు కూర్చొనే ఛాన్సు ఇస్తే రైల్వేయాక్టు- 1989 గురించి ఆలోచించే పని ఉండదు… పైగా రైల్వే వారు కోరుకున్న‌ట్టుగా వారి ప్ర‌మేయం లేకుండానే ప్ర‌యాణం సుఖ‌వంతం అవుతుంది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions