.
Kesari Chapter 2’ – చరిత్ర మీద సినిమా మొదలుపెట్టి, చరిత్రనే మర్చిపోయారు
అక్షయకుమార్ వరుసగా దేశభక్తి ఫ్లేవర్ సినిమాలు తీస్తుంటాడు… కొన్ని ఫట్, కొన్ని పర్లేదు… సరైన స్క్రిప్టు రచన జరగకపోవడమే కారణం కావచ్చు బహుశా… ప్రత్యేకించి చరిత్రలో రికార్డయిన అంశాల మీద సినిమా తీసేప్పుడు నిర్లక్ష్యమే, తేలికభావనో ఉండకూడదు… అది ప్రస్తుతం వచ్చిన కేసరి చాప్టర్2 సినిమా చూస్తే కలిగే భావన…
Ads
సినిమా కథ కోసం కొంత క్రియేటివ్ ఫ్రీడమ్ అవసరమే… అందరూ అంగీకరిస్తారు… కానీ దానికీ పరిమితి ఉంది… అసలు నిజాల్ని దాాటేసి, ఏవేవో కథలు చెప్పొద్దు… ఆర్ఆర్ఆర్ సినిమా గురించి పలుసార్లు చెప్పుకున్నాం కదా… ఇద్దరు చరిత్ర పురుషుల కథల్ని ఎంతగా వక్రీకరించి, నిజాల్ని ఎలా భ్రష్టుపట్టించారో… కల్పన మాత్రమే అని ఎంతగా గొంతు చింపుకున్నా సరే…
Kesari Chapter 2 సినిమాను చూడటం మొదలుపెట్టిన కాసేపటికే కాస్త అసహనం ఆవరిస్తుంది… సంగీతమే తీసుకుంటే – జల్లియాన్వాలాబాగ్ సంఘటన తర్వాత వచ్చే ఒక సాధారణమైన దుఃఖగీతం, అక్షయ్ కుమార్ ఎంట్రీకి వినిపించే చప్పుళ్లు, ఒక యువ పోరాట యోధుడి మరణానికీ వినిపించే వీడ్కోలు సంగీతం – ఇవన్నీ నాసిరకం టీవీ సీరియల్‌ల్లాగా అనిపిస్తాయి…
ఇక జల్లియాన్వాలాబాగ్ సంగతి చూస్తే – ఇది భారత చరిత్రలో ఒక విషాదకరమైన ఘటన. 1919లో ప్రజలు శాంతియుతంగా ఓచోట సమావేశంలో ఉన్నప్పుడు…, జనరల్ డయ్యర్ తన సైన్యంతో వాళ్లపై కాల్పులు జరిపించాడు… వెయ్యికి పైగా మంది అక్కడే చనిపోయారు… ఈ ఘటన తర్వాత బ్రిటిష్ వారు నిజం బయటకి రాకుండా చూశారు, కానీ ప్రజా ఒత్తిడితో ‘Hunter Commission’ అనే విచారణ తంతు జరిగింది… ఆ కమిషన్ డయ్యర్ చర్యలను తప్పు అన్నా, ప్రభుత్వమే ఆయనపై ఎలాంటి శిక్ష తీసుకోలేదు…
ఇప్పుడు సినిమా ఏం చెప్తుంది?
అక్కడే కథ తారుమారైంది. నిజంగా జరిగిందేమిటంటే – శంకరన్ నాయర్ అనే మలయాళీ న్యాయవాది, బ్రిటిష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేశాడు. తర్వాత ఓ పుస్తకం రాశాడు – అందులో ఆయన మైకేల్ ఓ’డ్వైర్ అనే అధికారిని జల్లియాన్వాలాబాగ్ బాధ్యతగా చెప్పారు. దాంతో ఓ’డ్వైర్ పరువునష్టం కేసు వేశాడు – అది ఇంగ్లండ్‌లో జరిగింది. నాయర్ అతని తరపున వేరే న్యాయవాది ద్వారా కేసు ఎదుర్కొన్నారు…
కానీ ఈ సినిమా ఏం చెప్తుందంటే – నాయర్, ఓ యువ న్యాయవాదితో కలిసి భారతదేశంలోనే డయ్యర్ మీదే కేసు వేసాడని చూపిస్తుంది. కోర్టులోనే డయ్యర్ విచారణకు హాజరైతే, నాయర్ తన వాదనలు వినిపిస్తాడట. ఇది పూర్తిగా కల్పితం. నిజానికి అలాంటి కోర్టు కేసు ఎప్పుడూ జరగలేదు…
ఒకవేళ సినిమా చరిత్ర ఆధారంగా చేసినట్లు కాకుండా, కేవలం ఓ ఊహాగాన కథ అని చెప్పి ఉంటే వేరే విషయం… కానీ “ఇది నిజానికి జరిగినది” అన్నట్టుగా ప్రచారం చేయడం తప్పే… ఏదో ఓ కల్పిత గాథ చెబితే చెప్పొచ్చు, కానీ దాన్ని నిజంగా జరిగిన చరిత్ర అనే లుక్ ఇవ్వడమే పెద్ద తప్పు… కేసరి చాప్టర్2 చేసింది అదే….
హిందీలో సినిమా సోసోగా ఆడింది… 150 కోట్లు ఖర్చు చేశారట… 35 రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్లు 140 కోట్లు దాటలేదు, అదీ గ్రాస్… దీన్ని తెలుగులోకి తీసుకొచ్చారు… ప్చ్, చరిత్రకు లింకై ఉన్న కోర్టు రూం వాదనలు గట్రా ప్రజెంట్ ప్రేక్షకులకు పెద్దగా నచ్చడం లేదు మరి… పైగా చరిత్ర వక్రీకరణ అదనం..!! ( మింట్‌లో వచ్చిన రివ్యూలోని కొన్ని ఇన్‌పుట్స్ ఆధారంగా… )
Share this Article