.
Subramanyam Dogiparthi ….. ఖైదీ నంబర్ 786… గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట . ఈ పాటకు థియేటర్లలో కుర్రాళ్ళు వీరంగం వేసారు . బహుశా ముసలోళ్ళు కూడా సీట్లల్లో ఊగి ఉంటారు . అంత సెన్సేషన్ క్రియేట్ చేసింది .
ఇలాంటి డాన్సులు చిరంజీవికి వెన్నతో పెట్టిందే . ఈ పాట రీమిక్స్ / రీప్లే చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ , రెజీనాల మీద సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాలో కూడా పెట్టారు . అది కూడా పేలింది .
ఈ సినిమాలో పేలిన మరో పాట సిల్క్ స్మిత మీద . అటు అమలాపురం ఇటు పెద్దాపురం మధ్య గోదావరి . భువనచంద్ర ఇరగతీసాడు ఈ పాటని . అ అంటే అమలాపురం అంటూ వేటూరి వారు వ్రాసిన ఆ పాట సాహిత్యం కన్నా భువనచంద్ర పాట సాహిత్యమే బాగుందేమో ! సాహిత్యం ఎంత గొప్పగా ఉందో దానికి పదింతల ఊపుతో పాడారు జానకమ్మ . వంద రెట్ల ఊపుతో ఊపేసింది స్మిత .
Ads

1986 లో తమిళంలో వచ్చిన Amman Kovil Kizhakale సినిమాకు రీమేక్ 1988 జూన్లో తెలుగులో వచ్చిన ఈ ఖైదీ No.786 . పేరుకు రీమేకే కాని చిరంజీవి స్టార్డంకు అనుకూలంగా చాలా మార్పులు చేసారు . తమిళ సినిమాని మక్కీకి మక్కీ తీసి ఉంటే ఢాం అయ్యేది .
తమిళంలో విజయకాంత్ , రాధ ప్రధాన పాత్రల్లో నటించారు . క్లైమాక్స్ మొసళ్ళ ఫైటింగ్ తమిళంలో లేదు . ఇలా ఫైట్ సీన్లు , పాటలు , డాన్సులు చిరంజీవి స్టార్డంకు అనుకూలంగా తీసారు . కాబట్టే సూపర్ హిట్టయి 24 కేంద్రాలలో వంద రోజుల పోస్టర్ పడింది .
మన తెలుగు సినిమా వచ్చాక కన్నడంలో Nammoora Hammera అనే టైటిలుతో 1990 లో వచ్చింది . అంబరీష్ , సుమన్ రంగనాధన్ లీడ్ రోల్సులో నటించారు . కన్నడ క్లైమాక్స్ మన తెలుగు సినిమాకు మక్కీకి మక్కీ . తెలుగు సినిమాను డైరెక్ట్ చేసిన విజయ బాపినీడే కన్నడ సినిమాను కూడా డైరెక్ట్ చేసారు .

ఈ సినిమా చూడని వారు మా వయసు వాళ్ళు కూడా ఎవరూ ఉండరేమో ! టివిలో చాలా తరచూ వస్తూ ఉంటుంది . కధ ఏంటంటే : ఓ ఊళ్ళో ఓ హార్మొనీ విద్వాంసుడు పెంపుడు కొడుక్కి , ఆ ఊరి మోతుబరి కూతురికి లడాయి పడుతూ ఉంటుంది . హీరో గారు హీరోయినుకి బుధ్ధి చెపుతూ ఉంటాడు .
కక్ష పెంచుకున్న హీరోయిన్ హీరో మీద తప్పుడు ఆరోపణ చేస్తుంది . ఊరి పంచాయతీ కొరడా దెబ్బలు కొట్టమని తీర్పు ఇస్తుంది . కొరడా దెబ్బలు తిన్న హీరో హీరోయిన్ మెళ్ళో తాళి కట్టేస్తాడు .
తాళిని తీసేయబోతుంది హీరోయిన్ . నాయనమ్మ ఆ తాళి కట్టింది తన మేన బావే అని , అతని తండ్రిని తన తండ్రే చంపాడని , తాను పనిమనిషికి అక్రమంగా పుట్టిన బిడ్డ అనీ తలంటి పోస్తుంది .
పశ్చాత్తాపంతో భర్త ఇంటికి చేరి పెద్దవాళ్ళ సహకారంతో ఇంట్లోకి చేరుతుంది . చేయని హత్య కేసులో హీరోని ఇరికిస్తారు విలన్ మహాశయుడు , పోలీస్ సబ్ ఇనస్పెక్టర్ . జైలు నుంచి తప్పించుకుని విలన్ సబ్ ఇనస్పెక్టర్ని చట్టానికి అప్పచెప్పడంతో సుఖాంతం అవుతుంది .

చిరంజీవికి మరో మినీ ఖైదీ సినిమా . భానుప్రియకు పెద్ద హిట్ . చాలా బాగా నటించింది . పోలీస్ విలన్లుగా మోహన్ బాబు , ప్రసాద్ బాబు బాగా నటించారు . మోహన్ బాబు తినేసాడు . కోట శ్రీనివాసరావు , మాణిక్ ఇరానీ , సత్యనారాయణ , నూతన్ ప్రసాద్ , నిర్మలమ్మ , పద్మనాభం , పి జె శర్మ , అల్లు రామలింగయ్య , వంకాయల , తదితరులు నటించారు .
ప్రత్యేకంగా చెప్పుకోవలసింది సిల్క్ స్మిత పాత్ర , నటన . సత్యనారాయణని అల్లరి పెడుతూ చిలిపి కళ్ళతో బాగా నటించింది . అటు అమలాపురం పాటలో బ్రహ్మాండంగా డాన్సించింది .
రాజ్ కోటి సంగీత దర్శకత్వంలో పాటలన్నీ బాగుంటాయి . చలిగాలి కొట్టిందమ్మా , రైటో అటో ఇటో డ్యూయెట్లు చిరంజీవి , భానుప్రియల మీద విజయ బాపినీడు అందంగా చిత్రీకరించారు . గుండమ్మా బండి దిగి రావమ్మా అంటూ సాగే టీజింగ్ పాట చిరంజీవి , భానుప్రియల మీద సరదాగా ఉంటుంది .

బాలసుబ్రమణ్యం , జానకమ్మ బాగా పాడారు . డాన్సుల్ని బ్రహ్మాండంగా కంపోజ్ చేసిన తారను అభినందించవలసిందే . పదునైన సంభాషణలను జి సత్యమూర్తి వ్రాసారు . చిరంజీవికి తగ్గట్లుగా ఫైట్లని స్టంట్ మాస్టర్ రాజు కంపోజ్ చేసారు . రచనా సహకారాన్ని యం వి వి యస్ బాబూరావు అందించారు .
1988 జూన్లోనే చనిపోయిన ప్రముఖ హిందీ నటుడు రాజ్ కపూరుకి ఈ సినిమాను అంకితం చేసారు . ఆయన తీసిన సినిమాలలో నాకు గొప్పగా నచ్చిన సినిమా మేరా నామ్ జోకర్ . జీవిత వేదాంత సారం అంతా ఉంటుంది ఆ సినిమాలో .
మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మించిన ఈ సినిమా యూట్యూబులో ఉంది . Its an action , musical , feel good , commercial , Chiranjeevi mark entertainer . చూడనివాళ్ళు తప్పక చూడవచ్చు .
ఇది నేను పరిచయం చేస్తున్న 1175 వ సినిమా . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్ #తెలుగు_సినిమాలు
Share this Article