.
Mohan Goteti …. అబ్బ.. ఏం కామెడీ మనిషండి ఈయన!
‘రయ్’ మంటూ.. వరుసగామూడు ఆటోలు వచ్చి ఓ షాపు ముందు ఆగాయి..
మొదటి ఆటో లోంచి ఓ వ్యక్తి దిగాడు..
మిగతా ఆటోలలోని మనుషులు కూడా ఆ వెనుకే దిగారు.
ఎవడినీ కేర్ చేయని బిహేవియర్ .. ముఖంలో రెక్లెస్ నెస్..
నోట్లో పాన్ పరాగ్.. అది నమలడంలో కూడా ఓ దర్పం..
చేతి వేళ్లకి నకిల్ డస్టర్ బిగించాడు..
అతనే ఖాన్ దాదా..!
థియేటర్లో జనం గొల్లుమని నవ్వారు..
బ్రహ్మానందం ఏమిటి?
ఈ గెటప్పు ఏమిటి?
ఎవరికీ అర్థంకాలేదు..
తెరవైపు ఉగ్గబెట్టి చూస్తున్నారు..
నలుగురు బాడీగార్డులతో స్టయిల్ గా నడుచుకుంటూ షాపులోకి వచ్చాడు ఖాన్.
“ఏరా.. డబ్బులివ్వనన్నావంట..” అంటూ ఓనర్ ని గదమాయించాడు.
“లేదు సార్.. నెక్స్ట్ వీక్ ఇస్తాను” అన్నాడు ఓనర్ భయంతో వణుకుతూ.
ఒక్కటి పీకాడు ఖాన్ దాదా..
దెబ్బతిన్న వాడి బాధ ఎలా వున్నా.. థియేటర్లో జనం మాత్రం పెద్దపెట్టున నవ్వారు.
Ads
బ్రహ్మానందం దెబ్బలు తినడమే కానీ.. అంతవరకూ ఎవరినీ కొట్టడం చూడలేదు కదా?
అందరికీ ఇంటరెస్ట్ పెరిగిపోయింది..
పడి పడి నవ్వుకుంటూనే.. తర్వాత ఏమవుతుందా? అని కళ్లప్పగించి చూస్తున్నారు.
ఓనర్ సొరుగులో చేతికందిన డబ్బు తీసుకున్నాడు..
“ఖాన్ తో గేమ్స్ ఆడకు.. శాల్తీలు లేచిపోతాయ్” అంటూ వార్నింగ్ ఇచ్చాడు.
ప్రేక్షకులకు రెండు చంకల్లోనూ చక్కిలిగింతలు పెట్టినట్టయింది..
తెగనవ్వేస్తున్నారు.. కుర్చీల్లోంచి అటు ఇటూ కదులుతూ మరీ నవ్వేస్తున్నారు..
ఇక అక్కడి నుంచి బ్రహ్మానందం కనిపించినప్పుడల్లా థియేటర్లో గోల గోల.. ఈలలు.. చప్పట్లు .. కేరింతలు!
ఆ సినిమా 1993లో వచ్చిన ‘మనీ’!

దాని నిర్మాత రాంగోపాల్ వర్మ.. దర్శకుడు శివ నాగేశ్వరరావు.. కొత్త దర్శకుడు
ఈ సినిమా అనుకున్నప్పుడు అసలు మొదట్లో ఖాన్ దాదా పాత్ర లేదు.
షూటింగ్ అయిపోయాక చూస్తే.. సినిమా నిడివి తక్కువ వచ్చిందట. దాంతో దానిని భర్తీ చేయడానికి ఈ ట్రాక్ అనుకున్నారు.
“ఖాన్ దాదాకి ఎవరిని అనుకుంటున్నావు?” అని వర్మ గారు అడిగితే.. “బ్రహ్మానందాన్ని” అన్నారు శివ నాగేశ్వరరావు.
వెంటనే వర్మ పెద్దగా నవ్వి “క్యారీ ఆన్” అన్నారు.
బహుశా ఆయనకి అప్పుడే అర్థమై వుంటుంది ఆ కామెడీ!
కేవలం మూడురోజుల్లో ఆ సీన్స్ అన్నీ తీసేశారు.
ఖాన్ దాదా ఫీవర్ మామూలుగా లేదప్పుడు..
ఆ సినిమాని ఆ పాత్ర కోసమే మళ్లీ మళ్లీ చూశారు.
కామెడీ చేసే బ్రహ్మీ చేత విలనీ చేయించడమే ఇక్కడ పెద్ద కామెడీ.
అసలు బ్రహ్మీ కామెడీ ఎక్స్ ప్రెషన్సే ఇవ్వక్కర్లేదు..
ఆయన సీరియస్ లుక్ ఇచ్చినా ప్రేక్షకులు నవ్వుతారన్న విషయం దర్శకుడికి తెలుసు.
అందుకే అది బాగాపండుతుందని శివ నాగేశ్వరరావుకు ఓ నమ్మకం..
ఆ సినిమా తర్వాత ఆయనకు వరుసగా సినిమాలు.. బిజీ అయిపోయారు.
పందొమ్మిదేళ్ళ వయసులో దాసరి నారాయణరావుగారి ‘స్వర్గం నరకం’ సినిమా చూశాక శివనాగేశ్వరరావుకి సినిమాలపై మోజు బాగా పెరిగిపోయింది.
టైటిల్స్ లో అలా మేఘాలలో దాసరి గారి పేరు చూసి .. దర్శకత్వం వైపు ఆకర్షితులయ్యారు.
ఆ తర్వాత ‘ఇదెక్కడి న్యాయం’ సినిమా చూశాక..
‘ఇక మద్రాసే మన ఊరు’ అనుకుని డిసైడ్ అయి వెళ్లిపోయారు.
శివ నాగేశ్వరరావుగారు నాకు కో- డైరెక్టర్ గా ఉన్నప్పటి నుంచీ తెలుసు కానీ.. పెద్దగా పరిచయం లేదు.
‘మనీ’ విడుదలయ్యాక బాగా పరిచయమయ్యారు.
‘ఏమిటీ మనిషి సీరియస్ గా కనపడుతున్నాడు?’ అనుకున్నాను మొదట్లో.
కాసేపు ఆయనతో మాట్లాడాక..ఆ ‘లోపలి శివుడు’ అర్థమయ్యాడు! మాట్లాడితే జోకు.. నవ్వితే జోకు .. ఏం చేసినా జోకే!
అందుకే.. కొన్నాళ్లకే ఆయన మాకు మంచి స్నేహితుడైపోయారు.
ఆయన షూటింగుకి కవరేజీకి వెళితే.. ఏదో కామెడీ సినిమాకి వెళ్లినట్టు వుండేది.
ఓపక్క షూటింగ్ చేస్తూనే .. షాట్ గ్యాప్ లో మాతో సరదా కబుర్లు..
ఉన్నట్టుండి ఏదో సీరియస్ గా టాపిక్ మొదలెడతారు..
చివరికి అది పెద్ద జోక్ తో ఎండ్ అవుతుంది.
ఓసారి అలాగే ఆయన షూటింగ్ కవరేజికి వెళ్లి అప్పుడే ఆఫీసుకి వచ్చాను.
ఇంతలో ఆ సినిమా పీఆర్వో, మా జర్నలిస్టు మిత్రుడు అయిన రవి కొలికపూడి (నేటి టీవీ సీరియల్స్ బిజీ రచయిత) నుంచి ల్యాండ్ లైన్ కి ఫోన్..
“మోహన్.. ఇందాక శివనాగేశ్వరరావు గారు అదేదో చెప్పి రాయద్దన్నారు కదా.. అది మళ్లీ నీకు జ్ఞాపకం చేయమన్నారు” అన్నాడు రవి.
“వద్దన్నాక ఎందుకు రాస్తాం రవీ? దీనికి మళ్లీ ఫోన్ చేయాలా?” అన్నాను.
“నేనూ అదే అన్నాను ఆయనతో.. అయితే ఆయన ఏమన్నారో తెలుసా.. ‘ఇక్కడ రాయనని చెప్పారాయన. నిజమే.. కానీ ఆ జర్నలిస్టు సీటులోకి వెళితే, అసలు జర్నలిస్టు పూనితే రాసేస్తారేమోనని భయం..’ అన్నారాయన” అన్నాడు రవి నవ్వుతూ.
ఆ జోక్ కి ఫక్కున నవ్వొచ్చింది నాకు..
అదీ శివనాగేశ్వరరావు గారి సమయస్పూర్తి చమత్కారం!
ఆయన సినిమాలన్నీ సరదాగా.. కామెడీగానే వుంటాయి.
హెవీ సీన్స్ జోలికి, విపరీతమైన మెలో డ్రామా జోలికి ఆయన ససేమిరా వెళ్లరు.
దీనికి కారణం కూడా వుంది..
ఇండస్ట్రీకి రాకమునుపు ‘మనుషులు మారాలి’ సినిమా చూశారట ఆయన.
ఆ సినిమాలో ఉన్నహెవీ ఎమోషనల్ సీన్స్ కి ఆయన కళ్ళంట నీళ్లు ఉబికి ఉబికి వచ్చేశాయట.
ఇక అప్పుడే ఆయన డిసైడ్ అయ్యారట.. అలాంటి హెవీ సీన్స్ వున్న సినిమాలు చూడకూడదని.
అందుకే, ఆయన తీసే సినిమాలలో ఎక్కడా ఏడుపులు.. కన్నీళ్లు.. బాధలు.. ఇవేమీ వుండవు.
ఒకవేళ వుంటే డార్క్ కామెడీ వుంటుంది!
చంటిపిల్లాడు అఖిల్ తో తీసిన ‘సిసింద్రీ’ కూడా ఎంటర్టైనరే!
నిజం చెప్పాలంటే, ఆయన చేసిన సినిమాలన్నిటిలోకీ ఆయన బాగా కష్టపడింది సిసింద్రీకే.
మేం ఆ సినిమా షూటింగులో ఆయన కష్టాలు చూసేవాళ్ళం..
చంటి పిల్లాడు.. ఏమీ అర్థం చేసుకోలేడు..
అలాంటి పిల్లాడితో తనకు కావలసిన అవుట్ పుట్ ను రాబట్టుకోవడం దర్శకుడికి కత్తిమీదసామే కదా?
పైగా ఉదయం రెండు గంటలు.. సాయంత్రం రెండు గంటలు ఆ పిల్లాడి కాల్షీటు..
మధ్యలో ఏడిచాడంటే.. షూటింగ్ కేన్సిల్ ..
అబ్బో.. ఆయన కష్టాలు అన్నీఇన్నీ కావు!
ఓసారి ‘పట్టుకోండి చూద్దాం’ సినిమా షూటింగు కవరేజీకి వెళ్లాను.
నేను వెళ్లగానే ఎదురొచ్చి ‘మీకు చాల చాలా థ్యాంక్స్ చెప్పాలి” అన్నారు శివనాగేశ్వరరావు గారు.
“ఎందుకండీ?” అన్నాను అర్థం గాక.. ఏదో జోక్ అనుకుని.
ఆయనో పట్టాన అసలు విషయం చెప్పరు కదా?
అలా తీసుకెళ్లి.. అప్పుడే వచ్చిన ‘సితార’లో నేను ‘పట్టుకోండి చూద్దాం’ సినిమా గురించి రాసిన కవరేజీ చూపించారు.
ఆ సినిమాలోని చంద్రబోస్ రాసిన “వినరా వినరా దోస్తు, సూటిగా నన్నే చూస్తూ.. గొప్పదిరా ఈ వాస్తు.. పుట్టెను పూర్వం క్రీస్తు” అన్న పాట గురించి మా ‘సితార’లో నేను వివరించి రాస్తూ .. “ఈ పాట గొప్ప హైలైట్ అవుతుంది.. పెళ్లి సందడి సినిమాలోని పాటల రేంజిలో వుంది” అంటూ పేర్కొన్నాను.
ఆ లైన్ ని అండర్లైన్ చేసి వుంచారాయన.
“ఇది మీరు రాయడం వల్ల బయ్యర్ల నుంచి మాకు మంచి రెస్పాన్స్ వచ్చిందండి.. చాలా థ్యాంక్స్” అన్నారు.
అసలు అంతవరకూ ఎప్పుడూ ఎవరూ నాకు అలా నేను రాసిన ఒక వ్యాసాన్ని అండర్ లైన్ చేసి చూపిస్తూ థ్యాంక్స్ చెప్పలేదు..
అందుకే ఆయన సంస్కారానికి ఆశ్చర్యపోయాను.
ఇలాంటి దర్శకులు కూడా ఉంటారా? అనిపించింది.
అది ఆయన గొప్పతనం.. అది ఆయన నిజాయితీ!
శివనాగేశ్వరరావుగారి సినిమా అంటేనే వినోదం..
ఆ మనిషి ఎక్కడుంటే అక్కడా వినోదమే!
జోకుల కేకులు తినిపిస్తారు మనచేత!
మరి ఆ లెక్కన ఆయన ఇంట్లో ఎలా వుంటారు?
ఇది అందరికీ వచ్చే డౌటే!
అక్కడా అంతా లైటర్ వేనే.. ఏం మాట్లాడినా జోకులే!
ఆమధ్య ఆయన శ్రీమతి పద్మ గారు స్టౌ మీద కుక్కర్ పెట్టి.. ఏదో పని మీద కిందకు వెళుతూ.. “ఏమండీ, మూడు విజిల్స్ వచ్చాక సిమ్ లో పెట్టండి” అంటూ ఆర్డర్ వేశారు.
“ఇదిగో.. అది మూడు విజిల్స్ వేస్తే, నేను ఐదు విజిల్స్ వేస్తా.. అంతేగానీ నన్ను అండర్ ఎస్టిమేట్ చేయకు.. ఇప్పుడు సినిమాలు చేయనంత మాత్రాన.. మాకు ఇంట్లో పనులు చెబితే ఎలా? మాకూ మళ్లీ మంచి రోజులు వస్తాయి మేడమ్” అంటూ తనదైన డైలాగ్ వదిలారు.
మరి పద్మగారు నవ్వకుండా ఉంటారా?
అలాగే .. ఇద్దరూ పొద్దున్నే కలిసి ఓసారి కాఫీ తాగుతారు.
తర్వాత ఆయన వాకింగ్ కి వెళ్ళొచ్చాక మళ్లీ కలిసి మరోసారి తాగుతారు.
ఈమధ్య అలాగే ఈయన వాకింగుకి వెళ్లి వచ్చేసరికి పద్మగారు ఒక్కరే కాఫీ తాగుతూ కనిపించారు.
“ఏదీ.. నాకు కూడా తీసుకురా” అన్నారాయన.
“వెళ్లి తెచ్చుకోలేరేమిటీ?” అన్నారావిడ నవ్వుతూ.
“ఇదిగో.. బుచ్చయ్యకి ఫోన్ చేసేస్తున్నాను.. వచ్చితీసుకుపొమ్మని..” అన్నారాయన చిరు కోపం ప్రదర్శిస్తూ..
బుచ్చయ్య అంటే ఆయనకు కాళ్లు కడిగి.. పిల్లనిచ్చిన మామగారన్న మాట!
ఆ డైలాగుకి ఆవిడ పడి పడి నవ్వుకున్నారు.
వెంటనే వెళ్లికాఫీ కప్పు తెచ్చి ఇచ్చారు.
అలా వుంటుంది ఇంట్లో ఆయన హాస్యవల్లరి!
- ఈమధ్య ఆయనింటికి ఓ మిత్రుడు వచ్చాడు.
భార్యను చూపించి “మా పద్మ” అని చెప్పి.. మెల్లిగా ఆవిడకు వినపడకుండా “నా ఫస్ట్ వైఫ్” అన్నారు.
ఆ మిత్రుడికి మతిపోయింది..
ఈయనకి ఇంత సీనుందా? పైకి ఇలా వున్నాడేమిటి మరి? ఇన్నాళ్లూ ఏదో పెద్ద మనిషి అనుకున్నాను.. అనుకుంటూ ఆలోచిస్తున్నాడు సదరు మిత్రుడు.
ఈయన ఏం చెప్పినా ఆ మిత్రుడికి ఎక్కడం లేదు..
తర్వాత వెళ్లిపోతుంటే .. కిందకు వెళ్లారాయన వీడ్కోలు చెప్పడానికి.
ఇక ఆ మిత్రుడు ఆగలేకపోయాడు.. డౌట్ తీర్చేసుకోవాలనుకున్నాడు.
“సార్.. ఇందాక.. ఏమిటీ అన్నారు.. ఫస్ట్ వైఫా?” అన్నాడు నసుగుతూ.
“ఆ.. అదా.. అవును ఆవిడ ఫస్ట్ వైఫే” అన్నారు సింపుల్ గా.
“మరి సెకండ్ ఎక్కడ సార్?” అంటూ నసిగాడు.
“ఓ.. అదా.. సెకండ్ గురించి ఇంకా ఏమీ అనుకోలేదు..” అంటూ సింపుల్ గా తేల్చేశారీయన.
ఆ జోక్ కి ఆ మిత్రుడు నవ్విన నవ్వు చూసితీరాలి..
అలా వుంటుంది శివనాగేశ్వరరావు గారితో ప్రాక్టికల్ కామెడీ!
ఈమద్యోసారి సరదాగా ఆయనకి ఫోన్ చేశాను..
ఆ రోజు గాంధీగారి జయంతి..
అందుకే మాటల మధ్యలో “గాంధీ గారు మీకు ఏమవుతారు?” అనడిగారాయన.
“మనందరికీ ఆయన తాతే కదా?” అన్నాను.
“మీకు తాత.. నాకు మాత్రం అన్నయ్య” అన్నారు ‘తాపీ’ధర్మారావులా.
“అదేమిటండీ?” అంటే అప్పుడు చెప్పారు అసలు విషయం.
“గాంధీ గారు అక్టోబర్ 2న పుట్టారు.. నేను అక్టోబర్ 7న పుట్టాను.. అంటే నా కంటే ఆయన ఐదు రోజులు పెద్ద.. అంటే అన్నయ్యే కదా మరి?” అంటూ లాజిక్ తీశారు.
ఇంక ఆయనకి ఏం చెబుతాం?
అ లాజిక్కుకీ.. ఆ సెన్సాఫ్ హ్యుమర్ కీ.. హ్యాట్సాఫ్ చెప్పడమే కదా!
కామెడీ సినిమాలు తీయడం.. కామెడీగా రాయడం.. కామెడీగా మాట్లాడడం..
ఈ మూడు ప్రక్రియలూ నేను ఒక్క జంధ్యాలగారిలోనే చూశాను.
మళ్లీ ఆ మూడు లక్షణాలు ఇప్పుడు మన శివనాగేశ్వర రావు గారిలోనే చూస్తున్నాను!
-మోహన్ గోటేటి
(అక్టోబర్ 7న జన్మదినం జరుపుకుంటున్న మంచి మిత్రులు శివ నాగేశ్వర రావు గారికి HAPPY BIRTHDAY)
Share this Article