మొత్తానికి ఖర్గే ఓ మంచి మాట చెప్పాడు… కర్నాటక ఎన్నికలకు ముందు ఎందుకు చెప్పలేదు మరి, తెలంగాణ సిక్స్ గ్యారంటీల మేనిఫెస్టోను స్వయంగా విడుదల చేసినప్పుడు ఎందుకు చెప్పలేదు మరి… అనే ప్రశ్నలకన్నా దేశవ్యాప్తంగా ఓ పాజిటివ్ మార్గంలో ఓ మంచి చర్చను లేవనెత్తినందుకు అభినందించాలి…
సుప్రీంకోర్టు, కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల ప్రలోభాలు అంశంపై ఇంకాస్త దూకుడు పెంచాలి… తనేమంటున్నాడు..? రాష్ట్రాల బడ్జెట్ పరిమితులకు లోబడి ఎన్నికల హామీలు ఉండాలి, లేకపోతే ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితి వస్తుంది అని… ఎందుకు ఇప్పుడు ఇలా చెబుతున్నాడు..? కర్నాటక ప్రభుత్వం ఫ్రీ బస్ స్కీమ్ ఎత్తివేయడమో, కుదించడమో చేయబోతోంది కాబట్టి…
అంతేకాదు, కర్నాటక, తెలంగాణ హామీల వంటివే హర్యానాలో కురిపించినా సరే, వోటర్లు కాంగ్రెస్‌ను గెలిపించలేదు కాబట్టి… పంచుడు పథకాలతో ఏపీ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసిన జగన్‌ను ఘోరంగా ఓడించారు కాబట్టి… బాబు కూటమి కూడా సేమ్ కాంగ్రెస్‌లాగే ఎన్నికల ప్రలోభాల్ని విసిరింది కానీ అక్కడ తమ గెలుపు కేవలం జగన్ వ్యతిరేకతే తప్ప ఆ పథకాల పట్ల పాజిటివ్ వోటు కానేకాదు… బాబుకున్న క్రెడిబులిటీ కూడా కాదు…
Ads
తెలంగాణలో కూడా కాంగ్రెస్ గెలుపుకు కారణం కేసీయార్ మీద జనంలో వ్యతిరేకత… కేసీయార్ కూడా కాంగ్రెస్ పార్టీలాగే బోలెడు అలవిమాలిన హామీలు ఇచ్చాడు కూడా… జనం నమ్మలేదు… అలాగని సిక్స్ గ్యారంటీలను నమ్మి కాంగ్రెస్‌ను గెలిపించలేదు… సో, ఏతావాతా పార్టీలు విసిరే ఎన్నికల ప్రలోభాలు వోట్లను కురిపిస్తాయనేది నిజం కాదు, ఆ సత్యమే ఖర్గే నోటి వెంట ఈ కొత్త మాటలు పలికిస్తోంది…
(గాలి హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజల్ని నయవంచన చేసిందని, కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని కేటీయార్ విమర్శిస్తున్నాడు గానీ… ఆ గ్యారంటీలను మించిన ఎన్నికల హామీలను బీఆర్ఎస్ కూడా ఇచ్చిందని మరిచిపోయినట్టున్నాడు… పైగా కాంగ్రెస్ గెలుపును ఆ పార్టీ మేనిఫెస్టో ఏమీ సాధించలేదు… అది బీఆర్ఎస్ వ్యతిరేకత ప్రభావం మాత్రమే…)
ఎన్నికల ప్రలోభాలు అంటే… నేరుగా వోటర్లను కొనేయడం మాత్రమే కాదు, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలను పణంగా పెట్టి మరీ, సంక్షేమం పేరిట పథకాలు ప్రకటించి, ఉచితాలతో ఖజానాలను ఖాళీ చేయడం కూడా..! ఎన్నికల ప్రణాళికల్లో చేర్చే ఏ పథకానికైనా బడ్జెట్ పరిమితులను అంచనా వేసి, పగ్గాలు వేసే అధికారం, అవకాశం కేంద్ర ఎన్నికల సంఘానికి అవసరం…
మహారాష్ట్ర ఎన్నికలపై కాంగ్రెస్‌కు ఎన్నో ఆశలున్నాయి… ఒకవేళ ఠాక్రే, పవార్ తక్కువ సీట్లు గెలిచి, తమకు ఎక్కువ సీట్లు వస్తే… బీజేపీ కూటమిని ప్రజలు తిరస్కరిస్తే… కుర్చీ ఎక్కాలనే ఆశ… మరి ఖర్గే కొత్త సూత్రం మేరకు మేనిఫెస్టోలో కాంగ్రెస్ రీసెంటు గ్యారంటీల అస్త్రాన్నే ప్రయోగిస్తుందా..? సంయమనం పాటిస్తుందా..? చూడాలిక…
ఏ పార్టీ ఏం హామీలు ఇచ్చినా సరే… ఆ రాష్ట్రంలో జీడీపీ ఎంత..? పెరుగుదల అంచనాలు ఎంత..? ఈ హామీల భారం ఎంత..? ఆచరణ సాధ్యత ఎంత..? ఈ వివరాలన్నీ నిగ్గు తేల్చడానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఓ అధ్యయన విభాగాన్ని ఏర్పాటు చేసుకుంటే బెటర్… అది గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే ఆ మేనిఫెస్టో ఆధారంగా పార్టీలపై కఠిన నిర్ణయాల్ని ప్రకటించాలి… అప్పుడు గానీ ఈ ఎన్నికల సంక్షేమ ఉచిత ప్రలోభాలు ఆగవేమో… ఐనా ఏమో… పార్టీలు కొత్త పంథాలు అన్వేషిస్తాయేమో..!!
Share this Article