అప్పట్లో ఓ సెన్సేషనల్ కేసు గుర్తుందా..? ఇప్పుడు ఆమె ఏ జైలులో ఎలా ఉందో తెలియదు గానీ… ప్రియుడితో కలిసి భర్తను చంపేసి, అచ్చం భర్తలా తన ప్రియుడికే ప్లాస్టిక్ సర్జరీ చేయించి, భర్త స్థానంలో ప్రవేశపెట్టింది… కాకపోతే చికెన్ సూప్ దగ్గర ఈ నకిలీ భర్త బయటపడిపోయి, బండారం బద్ధలై, మొత్తం కథంతా బయటపడింది… ప్రియుడితో కలిసి భర్త హత్య తాలుకు కేసులు బోలెడు… కానీ ఓ సినిమా కథలా ఉన్న ఈ కేసు ఇదే మొదటిది…
దాదాపు సేమ్ కథ… అక్కడ చికెన్ సూప్… ఇక్కడ కూడా సూప్… ఎలాగూ ఆమె కిల్లర్ కదా, సో, కిల్లర్ సూప్ అని ఓ వెబ్ సీరీస్ తీశారు… నిజానికి చాలా ఓటీటీల్లో చాలా సీరీస్ వస్తుంటాయి, అన్నీ ఎందుకు చెప్పుకుంటాం గానీ… ఇందులో మనోజ్ వాజపేయి ఉన్నాడు… నటనకు ఐకన్… పైగా కొంకణా సేన్ శర్మ, మన నాజర్, మన సాయాజీ షిండే కూడా ఉన్నారు… నెట్‌ఫ్లిక్స్‌లో పెట్టారు…
కాకపోతే కేవలం క్రైమ్, థ్రిల్లర్ మాత్రమే కాదు, కామెడీని కూడా కథానుగుణంగా జొప్పించడంతో ఇంకాస్త చూడబుల్ అయిపోయింది… కొంకణాసేన్ కు పెద్ద చెఫ్ కావాలని కోరిక… రెస్టారెంట్ సొంతంగా పెట్టాలి, అందుకని ముందుగా వంట నేర్చుకోవాలి, దాంతో ఓ వంటవాడి దగ్గర చేరుతుంది… ఆమెకు కనీసం సూప్ కూడా రుచిగా కాచడం తెలియదు అప్పటిదాకా… మొగుడు మనోజ్‌కు బిల్డర్ కావాలనీ, మస్తు డబ్బులు సంపాదించాలనీ కోరిక… కానీ ఏదీ కలిసిరాదు…
Ads
ఈలోపు అచ్చం మనోజ్‌లాగే ఉండే మసాజిస్టుతో ఆమెకు అక్రమ సంబంధం ఏర్పడుతుంది… సదరు మనోజ్ హఠాత్తుగా హత్యకు గురవుతాడు, ఇక తన స్థానంలో ఈ నకిలీ మనోజ్‌ను తీసుకొస్తుంది కొంకణాసేన్… (కాకపోతే ప్లాస్టిక్ సర్జరీ లేదు)… తరువాత ఏం జరిగింది అనేదే కథ… మరి సీరీస్ అన్నాక సాగదీత ఉంటుంది కదా… ఇక్కడా అంతే… కాకపోతే మరీ కార్తీకదీపం, ప్రేమఎంతమధురం వంటి ఏళ్ల సాగదీత కాదు గానీ, బాగా ల్యాగ్… నటీనటులు ఎంత బాగా చేసినా, కథ కొత్తగా ఉన్నా సరే, ఈ సాగదీతను భరించడం కాస్త దుస్సహమే…
మధ్యమధ్యలో ఈ హత్య తెలిసినవాళ్లు చనిపోవడం, ఎవరెవరో కథలోకి వస్తూ పోతూ ఉంటారు… కామెడీ జనరేట్ అవుతూ ఉంటుంది… స్పీడ్ వ్యూ పెట్టలేం, ఫార్వర్డ్ కొట్టలేం… మిస్సయితే కథ టెంపో దెబ్బతింటుంది… పైగా వెబ్ సీరీస్ అనగానే బూతులు, ముద్దులు, ఇంటిమేట్ సీన్లు ఉండాలని ఓ నియమం పెట్టుకున్నట్టున్నారు ప్రబుద్ధులు… ఎలాగూ సెన్సారింగ్ లేదు కదా… మన రానా, మన వెంకటేషులే బరితెగించిన తీరు చూశాం కదా, మనోజ్ ఎంత, కొంకణాసేన్ ఎంత..?
మన ఘెప్పాతిఘొప్ప స్టారాధిస్టార్లు మనోజ్ వాజపేయిని చూసి నేర్చుకోవాలి… నటన అంటే ఎన్నిరకాల ఉద్వేగాల్ని ప్రదర్శించవచ్చో, ఎలా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయొచ్చో… తనకు దీటుగా కొంకణాసేన్ కూడా అదరగొడుతుంది… ఎటొచ్చీ లెంత్ అండ్ లాగ్ కాస్త భరించలేం… అది భరించగలిగితే భలే టైంపాస్ సీరీస్ ఇది…!
Share this Article