.
‘వానెక్క’ విజయ్ దేవరకొండ ఇరగదీశాడు… టీజరో, ట్రెయిలరో లాంచ్ చేస్తూ… నామీద దయచూపు స్వామీ, ఎక్కడికో పోయి కూసుంటా అని వెంకటేశ్వర స్వామిని మొక్కుకున్నాడు కదా… మరీ ఎక్కడికో వెళ్లి కూర్చునేంత కాదు గానీ… తను నటనపరంగా మాత్రం కొన్ని మెట్లు ఎక్కాడు…
తనకు అప్పగించిన అండర్ కవర్ పాత్రను నిజాయితీగా… ఎక్కడా ఎక్కువ గాకుండా, ఏమాత్రం తక్కువ గాకుండా పోషించాడు… కొన్నేళ్లుగా వరుసగా ఫెయిల్యూర్స్ బారిన పడుతున్న ఈ రౌడీ హీరో ఈ సినిమాతో కాస్త తలెత్తుకోవచ్చు… ప్రస్తుతం మార్కెట్‌లో మహావతార్ నరసింహ తప్ప వేరే పెద్ద సినిమా ఏమీ లేదు కాబట్టి సినిమా కూడా అనుకున్నంత గాకపోయినా, బాగానే నడిచే చాన్స్ ఉంది…
Ads
జెర్సీ వంటి ఎమోషనల్ కంటెంట్ బలంగా తెరపై చూపిన దర్శకుడు గౌతమ్ ఈసారి అన్నదమ్ముల అనుబంధాన్ని, ఓ గూఢచారి కథనం నేపథ్యంలో చిత్రీకరించాడు… గొప్పగా అనలేకపోయినా, తీసికట్టుగా మాత్రం లేదు… ఓ సాధారణ పోలీస్ కానిస్టేబుల్ చుట్టూ తిరిగే కథ… అనుకోకుండా ఓ గూఢచారి మిషన్‌లో భాగమవుతాడు…
శ్రీలంక వెళ్తాడు… నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర సత్యదేవ్ తన సోదరుడు అని తెలుస్తుంది… తరువాత కథ ఇక ఇద్దరి చుట్టూ తిరుగుతుంది… తప్పదు కదా, మరో విలన్ ఉంటాడు, తనకో గ్యాంగు… స్పై లేదా అండర్ కవర్ పాత్ర అన్నాక… యాక్షన్ సీన్లు తప్పవు కదా… అవి బాగున్నాయి… దేశాన్ని ఓ ముప్పు నుంచి రక్షించడం అదే సమయంలో అన్నను కలుసుకోవడం ఈ రెండు పాయింట్లనూ బాగానే బిగించాడు దర్శకుడు…
సత్యదేవ్ నటనకు వంక ఏముంటుంది..? ఎప్పటిలాగే మంచి ప్రదర్శన ఇచ్చాడు… మంచి పాత్ర పడింది తనకు… అదీ విజయ్‌కు దీటుగా పర్‌ఫామ్ చేయడానికి… గుడ్… అంతా ఆ ఇద్దరి చుట్టే తిరుగుతూ ఉంటే హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకు పెద్ద పనేముంటుంది..? అవును, పెద్ద ప్రాధాన్యం లేదు, కొన్ని సీన్లలో తళుక్కు…
రొటీన్ విలన్… ఈ పాత్రను ఇంకాస్త బలంగా రాసుకుని ఉంటే, హీరోయిజం ఇంకాస్త ఎలివేటయ్యేదేమో… బ్రిటిష్ కాలం నాటి ఆసక్తికరమైన నేపథ్యంతో మొదలై సినిమా ఫస్ట్ నుంచే ఇంట్రస్టు క్రియేట్ చేస్తుంది… కాకపోతే ఫస్టాఫ్‌లో పెద్దగా ఎమోషనల్ సీన్లు జనానికి కనెక్టయ్యేలా ఏమీ లేవు… నిదానంగా, ఓ దశలో విసుగు కలిగిస్తుంది…
ఉదాహరణకు, అన్న జైలులో తన తమ్ముడిని గుర్తించే సన్నివేశం కూడా ఎలాంటి ఉద్వేగం లేకుండా సాగిపోతుంది… మొదటి సగం విజువల్స్‌పరంగా అద్భుతంగా ఉన్నా, కథనం మాత్రం బోరింగ్‌గా, భావోద్వేగ రహితంగా ఉంటుంది… సెకండాఫ్‌లో సత్యదేవ్‌కు సంబంధించిన సీన్స్ కొన్ని రక్తికట్టాయి… కైమాక్స్ మీద దర్శకుడు కేర్ తీసుకున్నాడు, బాగా వచ్చింది…
ఈ సినిమాలో చెప్పుకోదలిచింది విజువల్స్, నిర్మాణ విలువలు.., మీడియా ఎదుట ఏదేదో అదుపు తప్పి మాట్లాడతాడు గానీ, నిర్మాత నాగవంశీ ఈ సినిమా స్టాండర్డ్స్ విషయంలో మాత్రం ఎక్కడా రాజీపడలేదు… పెట్టిన ఖర్చు ప్రతి ఫ్రేములో కనిపిస్తుంది… అనిరుధ్ సంగీతం కూడా సినిమాకు బలం… బీజీఎం కొన్ని సీన్లను బాగా ఎలివేట్ చేసింది… వెరసి సినిమా టెక్నికల్లీ సౌండ్… ఆ రెండు ప్రధాన పాత్రలూ బలంగా ఎలివేటయ్యాయి…
కాస్త ఎమోషనల్ సీన్లపై కాన్సంట్రేట్ చేసి ఉంటే సినిమా వాణిజ్యపరంగా కూడా ఎక్కడికో వెళ్లిపోయి ఉండేదేమో… ఇప్పటికీ పర్లేదు… అబ్బే, ఎమోషనల్ సీన్లు పండకపోతేనేం… నిర్మాణ విలువలు, టెక్నికల్‌గా బలమైన విజువల్స్ ఉన్నాయి కదా అంటారా..? ఎస్, వాటి కోసం సినిమా చూడొచ్చు ఓసారి..!! (అమెరికా ప్రేక్షకుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా..)
Share this Article