Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నిజంగా కిన్నెర మొగులయ్యకు తెలంగాణ సమాజం ఏమీ చేయలేదా..?!

May 3, 2024 by M S R

ముందుగా ఓ క్లారిటీ… కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించిందీ అంటే… అది వివిధ రంగాల్లో ఆయా వ్యక్తుల ప్రతిభ, చేస్తున్న సేవలకు ఓ గుర్తింపు… పనిలోపనిగా ప్రోత్సాహకంగా పెద్ద మొత్తంలో డబ్బు… అంతే తప్ప ఒకసారి పద్మ పురస్కారం ప్రకటించినంత మాత్రాన ఇక ఆ వ్యక్తుల కుటుంబాల అన్ని ఖర్చులకూ కేంద్రమే పూచీపడ్డట్టు కాదు..!

పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్య కూలీ పనులు చేసుకుని బతుకుతున్నాడు అని సోషల్ మీడియాలో, మీడియాలో బోలెడుమంది సానుభూతి కురిపిస్తున్నారు… దొరికింది కదా చాన్స్ అనుకుని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై… అసలు పద్మ అవార్డులతో వచ్చేదేమిటి అనే నిర్హేతుకమైన విమర్శల దాకా వెళ్లిపోయారు… కేటీయార్ కూడా ఏదో స్పందించి నేను భరోసాగా నిలుస్తానని ప్రకటించాడు, గుడ్… రాష్ట్ర ప్రభుత్వాన్ని కార్నర్ చేసే ఓ అవకాశం దొరికింది అనుకున్నాడేమో… కానీ ఒకటి క్లియర్… మొగులయ్యకు దక్కాల్సిన దానికన్నా ఎక్కువే దక్కింది… మిగతాదంతా స్వయంకృతం..!

ఆయనకు కోటి రూపాయలు వచ్చాయి కదా… ఏమయ్యాయి..? ముగ్గురు పిల్లల పెళ్లిళ్లు చేశాడట, అయిపోయాయట… తుర్కయాంజాల్‌లో స్థలం కొన్నాడు, ఇల్లు కడుతున్నాడు… సరే, 600 గజాల జాగా ఇంకా ప్రభుత్వం ఇచ్చినట్టు లేదు, కానీ 10 వేల పెన్షన్ ఆగిపోయిందనే మాట అబద్ధమని ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి… నిజంగా లక్షల మంది కళాకారులున్నారు మన రాష్ట్రంలో… యాచక తెగలూ ఉన్నాయి… ఎవరూ తక్కువ కాదు, వాళ్లతో పోలిస్తే మొగులయ్య ఎంత అదృష్టవంతుడు..?

Ads

నాగర్‌ కర్నూల్‌ జిల్లా లింగాల మండలం అవుసలికుంట దర్శనం మొగిలయ్య స్వస్థలం… తను వాడే ‘పన్నెండు మెట్ల కిన్నెర’ అత్యంత అరుదైంది… తెలంగాణ ఏర్పాటు తర్వాత మొగిలయ్య ప్రతిభను గత బీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్ర ప్రథమ ఆవిర్భావ వేడుకల సందర్భంగా ‘ఉత్తమ కళాకారుని’గా ఎంపిక చేసింది. పన్నెండు మెట్ల కిన్నెర ప్రాముఖ్యం నేటి తరానికి తెలిసేలా ఎనిమిదో తరగతి విద్యార్థులకు పాఠ్యాంశంలో చేర్చింది. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, మొగిలయ్య జీవితంపై డాక్యుమెంటరీని రూపొందించింది. వారసత్వ కళను నమ్ముకున్న మొగిలయ్యకు ప్రత్యేక పింఛన్‌ మంజూరు చేసింది. 2022లో దేశంలోనే నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మశ్రీని కేంద్రం ప్రదానం చేసింది…

అంతేనా..? మొగులయ్యకు పోసాని కృష్ణమురళి లక్ష ఇచ్చాడు… గుడ్… ఏబీఎన్ చానెల్ ఓ ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేసి కొన్ని విరాళాలు ఇప్పించే ప్రయత్నం చేసింది… గుడ్… పవన్ కల్యాణ్ 2 లక్షలిచ్చాడు… గుడ్… నా ప్రతిభను గుర్తించింది కేవలం పవన్ కల్యాణ్ మాత్రమే అని ఆమధ్య ఏదో ప్రశంస జారీ చేశాడు… నిజమేనా..? మరి మిగతా సాయాలు చేసిన వాళ్లంతా..?!

మొగులయ్యకు తెలంగాణ ప్రభుత్వం ఏమీ చేయలేదా..? చెప్పుకోవాలి… (నిజాలు కొన్ని నిష్ఠురంగానే ధ్వనిస్తాయి కాబట్టి…)

mogulayya

మిగతా పాలన వ్యవహారాలు, విధాన నిర్ణయాలు తదితరాలెలా ఉన్నా… తన దృష్టికి వచ్చిన ఇలాంటి కళాకారుల దురవస్థల పట్ల కేసీయార్ ఉదారంగా వ్యవహరిస్తుంటాడు… కొన్ని వార్తలు చదివి తనే సాంస్కృతిక శాఖకు వివరాలు పంపించి, పెన్షన్లు ఇవ్వాల్సిందిగా ఆదేశించిన ఉదాహరణలు కూడా ఉన్నాయి… తను కనెక్టయితే అండగా నిలబడతాడు… ప్రత్యూష దగ్గర నుంచి పావలా శ్యామల దాకా బోలెడు ఉదాహరణలు…

ఒక కాంతారావు భార్యకు ప్రత్యేక పెన్షన్ కావచ్చు… ఒక పావలా శ్యామలకు ప్రత్యేక పెన్షన్ కావచ్చు… చిత్రకారుడు భరత్ భూషణ్ కావచ్చు… పద్మశ్రీ అవార్డు గ్రహీత గుస్సాడీ కనకరాజు కావచ్చు… చాలామందికి స్పెషల్ పెన్షన్లు ఇస్తున్నది తెలంగాణ సాంస్కృతిక శాఖ…

mogulayya

ఇదే మొగులయ్యకు తెలంగాణ సాంస్కృతిక శాఖ ఏడెనిమిదేళ్లుగా ఎప్పుడు అవసరం వచ్చినా అండగా నిలిచింది… కడుపు నొచ్చినా, కాలు నొచ్చినా … ఆరోగ్య అవసరానికి, ఆర్థిక అవసరానికి కూడా ఎంతోకొంత సర్దుబాటు చేస్తూ ఆదుకుంది… ఉగాది పురస్కారం ఇప్పించింది… అంతెందుకు, మహబూబ్‌నగర్‌లో 500 గజాల స్థలం ఇచ్చి, ఓ ఇల్లు కట్టించాలని కూడా ప్రయత్నించింది, కలెక్టర్‌తో సంప్రదింపులు జరిపింది… కానీ ఇదే మొగులయ్య అక్కడ తనకు ఇల్లు వద్దని, సిటీలో కావాలని కోరడంతో, అది ఎక్కడికక్కడ ఆగిపోయింది…

దర్శకుడు సాగర్‌చంద్రకు (కరీంనగర్) రెఫర్ చేసింది కూడా ఈ శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణే… సినిమా ఇండస్ట్రీ సపోర్ట్ గనుక దొరికితే మొగులయ్యకు ఆర్థికంగా మంచి వెసులుబాటు దొరుకుతుందని భావించారు… కిన్నెరమెట్ల వాయిద్యకళ అంతరించిపోకుండా 35 మందిని ఎంపిక చేసి, శిక్షణ కూడా ఇప్పిస్తున్నారు…

ఈ వాయిద్యాన్ని గుర్తించి, నెత్తిన పెట్టుకుని, ఎంకరేజ్ చేసింది పవన్ కల్యాణ్ కాదు… కాదు… మొదట మొగిలయ్య కిన్నెర వాయిద్యాన్ని, తనను, తన గొంతును పెద్ద తెరకు పరిచయం చేసింది నిర్మాత, దర్శకుడు ప్రభాకర్ జైనీ… నవీన్ పాపులర్ నవల అంపశయ్య ఆధారంగా తీసిన సినిమాలో ఒక పాట…

మొగులయ్య

10 వేల సాయం ఆగిపోయింది ఈ ప్రభుత్వం రాగానే అనేదీ అబద్ధం… ఇది సాంస్కృతిక శాఖ రికార్డే… 3.5.2024 వరకూ చెల్లింపులు జరిగాయి… ఇంకా ఏం చేయాలి ఈ సొసైటీ తనకు..? ఈ కూలీ పనుల వార్తలేమిటి..? నిజం ఏమిటంటే..? తనకు కేసీయార్ తక్కువేమీ చేయలేదు, ప్రభుత్వం మారినా రేవంత్ ప్రభుత్వమూ తనకిచ్చే సాయాన్ని ఆపలేదు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions