యానిమల్… వసూళ్లతో దున్నేసిన ఈ సినిమాపై బుద్ధిజీవుల విమర్శలు కూడా ఆ వసూళ్ల స్థాయిలోనే ఉన్నాయి… అర్జున్‌రెడ్డి దగ్గర నుంచీ దర్శకుడు వంగ సందీప్‌రెడ్డి మీద విమర్శలు ఆగలేదు కదా… కాకపోతే గతంలో సైలెంటుగా ఉండేవాడు… ఇప్పుడేమో తన సినిమాపై నేరుగానో, వ్యంగ్యంగానో వ్యాఖ్యలు చేసిన ప్రతి ఒక్కరికీ తన భాషలోనే జవాబులు చెబుతున్నాడు…
సరే, అవి కన్విన్సింగుగా ఉన్నాయా అనేది మన దృక్కోణాన్ని బట్టి ఉంటుంది… కానీ పెద్దగా వివాదాల తెర మీద కనిపించని ఆమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు కూడా ఈ సినిమాపై ఏదో వ్యాఖ్య చేసింది… ఓటీటీలో ఈ సినిమా ప్రసారమయ్యాకే మేధోవర్గం నుంచి ఇది స్త్రీద్వేష చిత్రం అనే విమర్శలు ఎక్కువయ్యాయి…
కిరణ్ రావు… బాహుబలి-2 కబీర్ సింగ్ వంటి సినిమాలు స్త్రీ పట్ల ద్వేషాన్ని, వేధింపులను ఎక్కువ చేసేలా ఉన్నాయని అభిప్రాయపడింది… ప్రత్యేకించి యానిమల్‌లో దర్శకుడు ప్రేమ ఉన్నవాడే కొడతాడు అని సూత్రీకరించడం చాలామందికి నచ్చలేదు… ‘మీరు మీ స్త్రీని ప్రేమించలేకపోతే , మీరు ఆమెను చెంపదెబ్బ కొట్టలేరు, మీరు ముద్దు పెట్టుకోలేరు. మీరు అసభ్యకరమైన భాషను ఉపయోగించలేరు’ అంటూ ఏదేదో సమర్థనకు దిగాడు…
Ads
ఓహో, చెప్పొచ్చావులే, మీ మాజీ భర్త నటించిన దిల్ సినిమా చూడు ఓసారి అన్నట్టు వంగ బదులిచ్చాడు… సేమ్, జావేద్ అక్తర్‌కు నీకొడుకు సీరీస్ మాటేమిటి అని అడిగి బదులిచ్చినట్టు..! ఆమె ఇలా అంటోంది కదా అనే ప్రశ్న ఎదురైనప్పుడు ఆమెను ఓ సూపర్ స్టార్ రెండో భార్య అనే వెటకారాన్ని తగిలించి మరీ ఈ సమాధానం ఇచ్చాడు…
ఆమీర్ ఖాన్ నటించిన ఆ సినిమాలో అమ్మాయిపై అత్యాచారాన్ని ప్రేరేపించే సీన్ ఉంటుంది. ఆ తర్వాత ఆమెనే తప్పు చేసినట్లుగా భావించేలా చేస్తాడు. అంతా జరిగినా చివరికి అతడితోనే ఆమె ప్రేమలో పడుతుంది. మరి దీన్ని ఏమంటారు. ఇలాంటివి చూడకుండా ఎలా కామెంట్స్ చేస్తారో అర్థం కావడం లేదు… అని బదులిచ్చాడు వంగ…
ఈ సినిమాలో ఫూల్ కుమారి (నితాన్షి గోయల్) – మంజు బాయి (ఛాయా కదమ్) మధ్య వచ్చే సంభాషణలున్నాయి. మంజు తన పెళ్లి గురించి ఫూల్ కుమారితో మాట్లాడుతుంది. తన భర్త తనను కొట్టాడని చెప్పింది, దానికి మంజు, ‘నిన్ను ప్రేమించే వ్యక్తికి నిన్ను కొట్టే హక్కు కూడా ఉంది, ఒకరోజు నేను కూడా నా హక్కుల్ని వాడుకున్నాను’ అని కామెంట్ చేస్తుంది… అంటే ప్రేమించే వ్యక్తికి కొట్టే హక్కు ఉందనే సూత్రీకరణ మీద ఓ వ్యంగ్యం ప్రయోగించింది…
ఆహా, వంగ తనకు ఇచ్చిన కౌంటర్‌కు కిరణ్ రావు ఈ సీన్ ద్వారా భలే రీకౌంటర్ ఇచ్చిందే అంటూ నెటిజనం మొదలెట్టారు తమ విశ్లేషణల్ని… నిజంగా ఆమె ఆ ఉద్దేశంతో ఆ సీన్ పెట్టిందా, లేదా కథ డిమాండ్ చేసిందా అనేది పక్కన పెడితే… వంగ జవాబుకు ఆప్ట్‌గా ఉందని నెటిజన్లు తేల్చేశారు… దీనికి కూడా వంగ మళ్లీ ఏదో సెటైర్ వేసి బదులిస్తాడా, వదిలేస్తాడా కూడా వేచి చూడాల్సిందే…
Share this Article