సత్యదేవ్… నటనలో మెరిట్ ఉన్న బహుకొద్దిమంది తెలుగు హీరోల్లో ఒకడు… నో డౌట్… సరైన పాత్ర పడి, డిమాండ్ చేయాలే గానీ తన ఎఫర్ట్ మొత్తం పెట్టి న్యాయం చేయగలడు… చాన్నాళ్లుగా ఫ్లాపులు పడుతూనే ఉన్నా సరే ఈరోజుకూ తనకు అవకాశాలు వస్తున్నాయంటే విశేషమే… అఫ్‌కోర్స్, సినిమాను తను ఈజీగా లాగగలడు అనే నమ్మకమే కావచ్చు కూడా…
ఇప్పుడు కృష్ణమ్మ అనే ఓ సినిమా వచ్చింది… మార్కెట్‌లో పెద్ద మంచి పేరున్న సినిమాలు ఏమీ లేవు… ఈ సినిమాకు అది ప్లస్ పాయింట్ కావాలి… కానీ సినిమా చూస్తుంటే అసలు ఆ సత్యదేవుడేనా అని డౌటొస్తుంది పలుచోట్ల… తన నుంచి సరైన నటన పిండుకోవడం దర్శకుడికి చేతకాలేదు అనుకోవాలి, లేదా ఆ పాత్ర కేరక్టరైజేషన్ అంత కంగాళీగా ఉండటం వల్ల సరైన ఔట్ పుట్ రాకపోయి ఉండాలి…
స్టోరీ లైన్ వరకూ వోకే… ముగ్గురు మిత్రులు… ఒకరేదో ప్రింటింగ్ ప్రెస్, మిగతా ఇద్దరూ గంజాయి వ్యాపారం… కానీ అనుకోకుండా ఏదో కేసులో, అదీ హత్యాచారం కేసులో బుక్కవుతారు… తరువాత ప్రతీకారం, రొటీన్ హీరోయిజం, మన్నూమశానం… అసలు క్రిమినల్ వేరే… అది ఎవరు అనేదే కథ సారాంశం…
Ads
అమాయకుల మీద కేసులు పెట్టేయడం, విచారణ బాగోతాలు గట్రా చాలా సినిమాల్లో చూసినవే… సరే, ఎన్నిసార్లు చూస్తేనేం, కథను ప్రజెంట్ చేసే విధానమే కదా దర్శకుడికి అసలు పరీక్ష… ఫాఫం, ఏదో కష్టపడ్డట్టుగా కనిపిస్తుందే తప్ప ఎక్కడో తేడా కొట్టి కాసేపు సాగదీత, ఏమాత్రం థ్రిల్, ఉత్కంఠ కనిపించకుండా కథనం… ప్రేక్షకుడు కనెక్ట్ కాలేకపోయాడు…
దీనికితోడు సినిమా అన్నాక హీరోయిన్ ఉండాలనే ఓ భ్రమ ఇండస్ట్రీలో ఉన్నదే కదా… ఈ కథలోనూ ఓ అమ్మడు ఉంటుంది, ఎందుకు ఈ పాత్ర పెట్టామో అని దర్శకుడికి కూడా చివరి వరకూ డౌటున్నట్టుంది… ఆ పాత్ర అలాగే ఉండిపోయింది ఫాఫం… ఈమాత్రం సినిమాకు కష్టపడి ఏం పనిచేస్తాంలే అన్నట్టుగా బీజీఎం సోసో, పాటలు మరీ సోసో… కాలభైరవను, అనంత శ్రీరామ్‌ను సరిగ్గా వాడుకోలేదు ఇందులో…
సత్యదేవ్ నటన కూడా సహజంగా లేదు, ఒరిజినల్ సత్యదేవ్‌లా లేడు… పలుచోట్ల ఆర్టిఫిషియాలిటీ… ఏదో సినిమా ఒప్పుకున్నాం కదా, చేయాల్సిందే అన్నట్టు లాగించాడు… ఏ సినిమాకైనా క్లైమాక్స్ ప్రధానం, పలువురు దర్శకులు సినిమా మొత్తాన్ని ఎలాగోలా లాగించి క్లైమాక్స్ అదరగొట్టి చప్పట్లు కొట్టించుకుంటారు… ఇందులో అదీ కరువైంది… ప్చ్, అసలే ఓటీటీ రోజులివి… మరీ థియేటర్ దాకా వ్యయప్రయాసలకు ఓర్చి వచ్చేంత సీన్ కనిపించలేదు… సత్యదేవుడికి మరోసారి నిరాశ..! అవునూ, బెజవాడ నేపథ్యం కాబట్టి కృష్ణమ్మ అని పేరు పెట్టారా సార్..?!
Share this Article