.
మెట్రో విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేేసిన విమర్శలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరణ తేలిపోయింది.,. ప్రజల్ని కన్విన్స్ చేసేదిగా లేదు అది… వెరసి మరింత డిఫెన్స్‌లోకి జారిపోతున్నాడు… ఇది ఒకరకంగా బీజేపీకి కూడా మైనస్ అవుతోంది, కిషన్‌రెడ్డి పరోక్షంగా బీఆర్ఎస్ కోసం పనిచేస్తున్నాడనే భావన రోజురోజుకూ బలపడుతూ..!
‘మెట్రో విస్తరణకు ఐఆర్ఎఫ్‌సీ రుణమిచ్చింది, కేంద్రం ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియోకు అంగీకరించింది, మెట్రో లీగల్‌గా ఎల్‌అండ్‌టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించబడింది… కానీ ఆ రుణం రిలీజ్ చేయదు కేంద్రం, ఎందుకు..? పోనీ, మేమే స్వయంగా చేపడతాం, ఎన్వోసీ ఇవ్వండి అనడిగినా సరే ఇవ్వదు, తెలంగాణ అభివృద్ధికి ఎందుకు మోకాలడ్డుతున్నారు..?’ ఇదీ రేవంత్ రెడ్డి స్ట్రెయిట్ ప్రశ్న…
Ads
అంతేకాదు… మూసీ, మెట్రో తదితర ఏ హైదరాబాద్ సంబంధ ప్రాజెక్టు కోసం ఏ కేంద్ర మంత్రి దగ్గరకు వెళ్లినా, కిషన్ రెడ్డి తరువాత వెళ్లి అడ్డుపుల్లలు వేసి వస్తున్నాడనీ, అంతా కేసీయార్ కనుసన్నల్లో సాగుతోందని తీవ్ర ఆరోపణ చేశాడు… హైదరాబాద్ బేస్డ్ పొలిటిషియన్ కదా కిషన్ రెడ్డి, డిఫెన్సులో పడిపోయాడు..,
టికెట్ల ఆదాయం, యాడ్ రెవిన్యూతో మెట్రో మెయింటెనెన్స్ ఉండాలని కేంద్రం అన్నదట, తరువాత విడిగా రుణచెల్లింపులు జరగాలని షరతు పెట్టిందంటాడు కిషన్ రెడ్డి… రేవంత్ రెడ్డి దీనికి అంగీకరించడం లేదంటాడు… ఏదయితేనేం..? కేంద్రం- రాష్ట్రం సమానంగా ఖర్చులు భరించాలి, రుణచెల్లింపులూ చేయాలి… కానీ, ఏదో ఓ దిక్కుమాలిన షరతు…
నేను ఏ కేంద్ర మంత్రిని కలిసి ప్రాజెక్టుకు అడ్డుపడ్డానో చెప్పు అంటాడు కిషన్ రెడ్డి… తెలంగాణకు రావల్సిన చాలా పనులున్నాయి కేంద్రం నుంచి, కేంద్రంతో డెవలప్‌మెంట్ కోణంలో సత్సంబంధాలు కోరుకునే రేవంత్ రెడ్డి తనతో కేంద్ర మంత్రులు కాన్ఫిడెన్షియల్‌గా షేర్ చేసుకున్న విషయాలను ఎందుకు బహిరంగం చేయాలి..? అది అనైతికం అవుతుంది… ఎలాగూ రేవంత్ రెడ్డి అవి బయటికి చెప్పడనేదే కిషన్‌రెడ్డి ధైర్యం కూడా..!
ఏ కేంద్ర మంత్రి దగ్గరకు రావాలో చెప్పు, నేనూ వస్తాను అంటున్నాడు కిషన్ రెడ్డి, తను అలా అనగానే అశ్విని వైష్ణవ్‌తో భేటీ ఏర్పాటు చేయి, నువ్వూ రావాలి, అక్కడే ఖుల్లంఖుల్లా చర్చిద్దాం అని వెంటనే ఓ లేఖ రాశాడు రేవంత్ రెడ్డి… ఉమ్మడి భేటీ అయ్యాక కూడా మళ్లీ కిషన్ రెడ్డి అదే మంత్రి దగ్గరకు మళ్లీ వెళ్లి పుల్లలు పెట్టకూడదని ఏముంది..? సో, అంతా ఓ గేమ్ నడుస్తోంది…
నేను రేవంత్ రెడ్డికి జవాబుదారీని కాదు, తెలంగాణకు మాత్రమే జవాబుదారీని అని కొన్ని పడికట్టు పదాలు ప్రయోగించాడు కిషన్ రెడ్డి… కాదని ఎవరన్నారు..? అలా గాకుండా కేసీయార్‌కు జవాబుదారీగా ఎందుకు వ్యవహరిస్తున్నావనే కదా ఇక్కడ రేవంత్ రెడ్డి విమర్శ… ప్చ్, కిషన్ రెడ్డి సమాధానం, వివరణ, స్పష్టత ఏమాత్రం కన్విన్సింగుగా లేవు…
అన్నట్టు, రేవంత్ రెడ్డి ఏమన్నాడు..? ఛత్రపతి సినిమాలో కమెడియన్ వేణుమాధవ్ అపరిచితుడు వేషం వేసి బెదిరించినట్టుగా బీజేపీ రాంచందర్‌రావు తనను బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడని కదా ఎద్దేవా చేసింది… మళ్లీ బీజేపీ అధ్యక్షుడి నుంచి మాటపలుకు వినిపించలేదు, ఎందుకో..!!
Share this Article