బీసీ సీఎం అంటున్నాం కదా… అందుకే ఈసారి నేను పోటీచేయడం లేదు… అంటున్నాడు కిషన్ రెడ్డి… నవ్వొచ్చింది… బీసీ సీఎం నినాదానికి తను పోటీచేయడానికి లింక్ ఏమిటి అసలు..? అంటే, తను పోటీచేస్తే, మెజారిటీ వస్తే, అన్నీ అనుకూలిస్తే తను మాత్రమే సీఎం అభ్యర్థి అని పరోక్షంగా సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నాడా..?
పైగా తను కేసీయార్ ఫేవర్ కాదని, ఎవరికీ లొంగబోననీ ఏవేవో తన మీద విమర్శలకు వివరణ ఇచ్చుకున్నాడు… కేసీయార్ కోసం కాకపోతే బండి సంజయ్‌ను మార్చి, మళ్లీ ఆ పాత కిషన్‌రెడ్డికే ఎందుకు పగ్గాలు ఇచ్చినట్టు..? బీజేపీ వద్ద ఒక్కటీ సరైన సమాధానం లేదు, స్పష్టీకరణ లేదు… అంటే, కేసీయార్ కోసమే అధ్యక్షుడి మార్పు జరిగింది అనే ఆరోపణలకు బలం అలాగే ఉంటుంది…
నిన్న రెండు ప్రెస్‌మీట్ల సారాంశం చూడండి… ఒకటి ధర్మపురి అర్వింద్, రెండు కిషన్ రెడ్డి… కిషన్ రెడ్డేమో కాంగ్రెస్ గెలిస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టే అంటున్నాడు… అంటే కాంగ్రెస్‌కు మాత్రం వేయొద్దు, మాకు వేయకపోయినా సరే, కేసీయార్ వచ్చినా పర్లేదు అని స్పష్టంగానే చెబుతున్నాడు… అదేకదా మరి అందరూ అంటున్నది… బీఆర్ఎస్ అనేది బీజేపీ బీటీం అని…!
Ads
రేవంత్ కంటే కేసీయారే మంచోడు అని ధర్మపురి అర్వింద్ అంటున్నాడు… ఆయన ఏదో అల్లాటప్పా ప్రజాప్రతినిధి కాదు, బీజేపీ ఎంపీ… దానికి విలువ ఉంటుంది… మరీ ఎన్నికల వేళ ప్రజల్లో వ్యతిరేకత బాగా ఉన్న ఓ ప్రత్యర్థి నాయకుడికి మంచోడు అని సర్టిఫికెట్ ఇవ్వడం ఏమిటి..? పైగా కాంగ్రెస్‌కు మెజారిటీ వస్తే సీఎం రేవంతే అవుతాడని ఏ ప్రాతిపదికన చెబుతున్నట్టు..? కాంగ్రెస్‌లో చాలామంది ఉన్నారు… పైగా కేసీయారే మంచోడు అని చెప్పడం అంటే బీఆర్ఎస్ పాజిటివ్ వోటుకు బీజేపీ మద్దతు పలుకుతోందా..?
మాకు వోటు వేయకపోయినా పర్లేదు గానీ కాంగ్రెస్‌కు మాత్రం వేయొద్దు, కేసీయార్ మంచోడే అని చెప్పడం ఒకరకంగా దిగజారిపోవడం… అదీ కీలకమైన పోరాటవేళ… అందులోనూ బీజేపీ, బీఆర్ఎస్ దోస్తీ మీద ఆరోపణలు వస్తున్నవేళ… అవును, బరాబర్ మేం దోస్తులమే అని చెబుతున్నట్టుగా ఉంది ఇదంతా… పైగా అర్వింద్ రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలో హంగ్ వస్తుందని చెబుతున్నాడు…
ఒక పార్టీ నేతృత్వంలో హంగ్ రావడం ఏమిటి..? అకస్మాత్తుగా ఏమైంది బీజేపీ రాష్ట్ర నేతలకు… ఓ శృతి లేదు, ఓ మతి లేదు… బీఆర్ఎస్ ఓడిపోయి, కాంగ్రెస్ గెలిస్తే ఇక బర్రెలు తినేవాళ్లు పోయి ఏనుగులు తినేవాళ్లు వస్తారు అంటున్నాడు కిషన్ రెడ్డి… అవును, రెండు పార్టీలూ ‘తినేవాళ్లే’ కదా… బర్రెలు అయితేనేం, ఏనుగులు అయితేనేం… ‘శుద్ద శాకాహారివి’… నీ గురించి నువ్వు చెప్పుకోకుండా… వాడికన్నా వీడు డేంజర్ అని వోటర్లకు చెప్పడం వెనుక ఆంతర్యేమిటి..? పోనీ, పదో పదిహేనో పోటీకి దిగి, మిగతా చోెట్ల స్నేహపూర్వక పోటీ అని చెప్పకపోయారా..?
Share this Article