Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పెద్ద థ్రిల్ ఏమీ లేదు… సినిమా మొత్తం చూడాల్సి రావడమే ఓ హారర్…

September 12, 2025 by M S R

.

పదకొండేళ్లు… పదకొండు సినిమాలు… ఈరోజుకూ నటన బేసిక్స్ నేర్చుకుంటూనే ఉన్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్… సినిమాల్లోకి ఎంట్రీ వరకే సినిమా కుటుంబనేపథ్యం పనిచేస్తుంది గానీ నిలదొక్కుకోవడానికి స్వయంకృషి, సాధన అవసరమనీ, దానికితోడు పిసరంత అదృష్టం కూడా కావాలని చెప్పడానికి మరో ఉదాహరణ…

లాంగ్ షాట్స్ ఎలాగోలా కవర్ చేసినా… క్లోజప్ షాట్స్‌లో తేలిపోతారు చాలామంది నటులు… భావోద్వేగాలను పలికించే ఫ్లెక్సిబుల్ మొహం, సాధన అవసరం… పదేళ్లు దాటినా ఈరోజుకూ ఇదీ తన సినిమా అని చెప్పుకోవడానికి ఏమీ లేదు ఈ హీరో కెరీర్‌లో…

Ads

ఇప్పుడు మరో సినిమాతో వచ్చాడు కిష్కింధపురి అని… అసలు ఆ టైటిల్ ఎందుకు పెట్టారో దర్శకుడికైనా తెలుసా అని డౌట్… తమిళ, మలయాళ అర్థం కాని పదాల్ని అవే టైటిల్స్‌తో తెలుగులోకి వదిలేస్తే చూడటం లేదా అంటారా..? ఏదో ఓ టైటిల్, ఏదో ఓ ఊరి పేరు, ఐనా నేములోనేముంది అంటారా..? ఐతే సరే…

ఫాఫం, ఈ సినిమా మీద భాఘా ఆశలు పెట్టుకున్నట్టున్నాడు శ్రీనివాస్… తనతో రాక్షసుడులో నటించిన అనుపమతో కలిసి వచ్చాడు మళ్లీ… అదీ ‘చావు కబురు చల్లగా’ అనే ఫెయిల్యూర్ తీసిన దర్శకుడు పెగళ్లపాటి కౌశిక్ దర్శకత్వంలో… హారర్ థ్రిల్లర్ ఈ జానర్ పేరు… అవును, సినిమా చూడటం ఓ హారరే…

ఇందులో చూడదగిన విశేషం ఏమిటీ అంటే..? అనుపమ పరమేశ్వరన్ మాత్రమే… సెకండాఫ్‌లో బాగా చేసింది… ఎందుకో ఫాఫం ఆమెకు మంచి పాత్రలు పడటం లేదు గానీ, దొరికితే మంచి పర్‌ఫామెన్స్ ఇవ్వగలదు ఆమె… క్లైమాక్సులో ఘోస్ట్ ఆవహించే సీన్లలో బాగా చేసింది, సినిమాలో అదొక్కటే ప్లస్…

పాటలు తుస్… బీజీఎం వోకే వోకే… ఇక హీరో శ్రీనివాసుడు గురించి తెలిసిందే… హైపర్ ఆది తన ఒరిజినల్ టీవీ కెరీర్‌లోలాగే కొన్ని పంచ్ డైలాగ్స్ వేయటానికి ట్రై చేశాడు గానీ పెద్దగా పేలలేదు… పేలవు, తన పంచులకు మొనాటనీ వచ్చేసింది… జనం ఇష్టపడటం మానేశారనే విషయం తనకు ఇంకా అర్థం కావడం లేదు… కనీసం దర్శకుడైనా భిన్నమైన పాత్ర ఇచ్చి ఉండాల్సింది…

ఘోస్ట్ రైడ్ టూర్స్ నిర్వహించే ఓ భిన్నమైన వృత్తి కలిగిన టీమ్… స్కేరీ హౌజులు తిప్పుతూ జనానికి భయం పోగొట్టి, థ్రిల్ కలిగించాలనేది వాళ్ల వృత్తి… నిజానికి హారర్ థ్రిల్లర్‌కు అవసరమైన మంచి బేస్ స్టోరీ లైన్… కానీ దాన్ని అంతే ఆసక్తికరంగా ప్రజెంట్ చేయడంలో దర్శకుడి ఫెయిల్యూర్ కనిపిస్తోంది…

సువర్ణమాయ అనే ఓ పాడుబడిన రేడియో స్టేషన్‌కు వెళ్తారు… తలుపులు బద్దలు కొట్టుకుని వెళ్లాక (టీమ్‌గా వెళ్లినప్పుడు… ఆ భవనం గురించి ముందు తెలుసుకోరా..? ప్రతి పాడుబడిన బిల్డింగు వెనుకా తప్పకుండా హారర్ కథలుంటాయా..? ఘోస్టులుంటాయా..? వంటి ప్రశ్నలు దయచేసి వేసుకోకండి…)

స్టేషన్‌లో అడుగుపెడితే 11 మంది చస్తార్రోయ్ అనే ఓ వాయిస్ హెచ్చరిక… సరిగ్గా 11 మంది ఎందుకు..? తెలియదు… బహుశా ఆ దెయ్యానికీ తెలియదేమో… ఓ ఇద్దరు మరణిస్తారు, నిజంగానే… మూడో మరణాన్ని హీరో ఆపుతాడు… అసలు ఆ వాయిస్ ఎవరిది..? అష్టావక్ర  బాపతు వైకల్య పుట్టుక విసృతపుత్ర ఎవరు..? తన తల్లి ఎవరు..? అనేదే కథ… (విసృతపుత్ర అనగానేమి..? తెలియదు)…

అసలు ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన వాళ్లపై రివెంజ్ తీర్చుకోవడం ఏమిటి..? దానికి తల్లి సెంటిమెంట్ ఒకటి… ఐనా హారర్ సినిమాలకు, దెయ్యం చేష్టలకు లాజిక్కులు, రీజనింగులు ఏమిటీ అంటారా..? సరే, సరే… చివరలో శ్రీరామరక్ష సీన్ బాగా తీశారు, తరువాత తల్లి పాత్రను చూపించి, వీలుంటే సీక్వెల్ తీస్తామురోయ్ అని కూడా దర్శకుడు భయపెట్టాడు… అదీ హారర్ ఎలిమెంట్ అంటే..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Mirai..! భిన్నమైన ఓ కథకు రక్తికట్టించే ప్రజెంటేషన్… గుడ్ ఔట్‌పుట్…
  • పెద్ద థ్రిల్ ఏమీ లేదు… సినిమా మొత్తం చూడాల్సి రావడమే ఓ హారర్…
  • ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అనగా… ప్రయోగశాలల్లో పెంచబడిన వజ్రాలు…
  • వారసత్వమంటే బీజేపీకి పడదట… కానీ టీ-స్టేట్ కమిటీలో ఆరుగురు వాళ్లే..!!
  • కేసీయార్ స్కామ్స్ చూసీచూడనట్లు వదిలేయాలా… ఎందుకు..?!
  • నేపాల్ తాత్కాలిక ప్రధానిగా ఈ పచ్చి భారత వ్యతిరేకి పేరు వాపస్…
  • బరేలీ మార్కెట్‌లో పడిపోయిన ‘చెవికమ్మ’ దొరికింది… ఇదుగో ఇదే…
  • అప్పట్లో మహాబాహుబలి… ఆరుగురు ఎంపీలు… ఇద్దరు మంత్రులు, ఓ ఎమ్మెల్యే…
  • పెద్ద దొరవారి ధరణి..! నిఖిల జగమూ నివ్వెరపోయే భారీ భూస్కాం..!!
  • 2 రోజుల్లో నలుగురు ప్రధానులు ఔట్… ఈసారి గ్రహణ బాధితుడు ఎవరు..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions