.
Murali Buddha …… జ్ఞానం ప్రమాదకరం… ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో హామీల జాబితా చూశాక ఒకటి బాగా నచ్చింది … గ్రంధాలయాన్ని పునరుద్ధరిస్తాం అనే హామీ …
అంటే ఇంత కాలం మీడియా వారి ప్రెస్ క్లబ్ లో గ్రంధాలయం కూడా లేదన్న మాట… గ్రేట్ … అందుబాటులో పుస్తకాలు ఉంటే చదవాలి అనిపిస్తుంది .. చదివితే జ్ఞానం పెరుగుతుంది .. జ్ఞానం పెరిగితే మేధావులుగా ఉండలేం … ముందు జాగ్రత్తగా మంచి పని చేశారు . గ్రంధాలయం లేకుండా …
Ads
ఓ 10- 15 ఏళ్ల క్రితం ఆధార్ నమోదు కోసం ప్రెస్ క్లబ్ కు వెళ్ళినప్పుడు చాలాసేపు నిరీక్షించాల్సి వచ్చింది . ఓ మూలకు ఫర్నిచర్ తో పాటు నరిశెట్టి ఇన్నయ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి రాసిన బుక్ కనిపిస్తే చదివేశా… 1952 నుంచి టీడీపీ కాలం వరకు కులరాజకీయాల గురించి మంచి సమాచారం ఉంది …
బుక్ చదివా కానీ, ఇక్కడో లైబ్రరీ ఉండేది … దాని అవశేషమే ఈ బుక్ అనే ఆలోచన రాలేదు అప్పుడు … కొద్దిపాటి అవశేషాలు కూడా మిగల్చవద్దు, గ్రంధాలయం అనే మాటే వినిపించ కూడదు …
ప్రెస్ అకాడెమీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మెరుగు పరిచేందుకు , ప్రపంచ శాంతి కోసం చేసే బృహత్ కార్యాల గురించి అంతగా అవగాహన లేదు కానీ ఉమ్మడి రాష్ట్రంలో ప్రెస్ అకాడెమీ వెబ్ సైట్ మాత్రం నాకు బాగా తెలుసు … తెలుగు పత్రికలు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని దిన , వార , మాస పత్రికల pdf ప్రతులు ఇక్కడ లభించేవి …
ఓసారి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తనకున్న జ్ఞానంతో మోడీ వచ్చాకే తెలంగాణ ప్రజలు రైలు పట్టాలు చూశారు అని ప్రకటించారు … ప్రెస్ అకాడెమీ వెబ్ సైట్ ఆర్చివ్ కు వెళ్లి, 1940 ప్రాంతంలో నిజాం … అప్పటి నిజాం రైల్ వే భద్రాచలంకు రాముల వారి కల్యాణానికి వెళ్లే భక్తులకు రైలులో 50 శాతం రాయితీ అంటూ చేసిన ప్రకటనను face book లో పోస్ట్ చేశా .. ప్రెస్ అకాడెమీ వెబ్ సైట్ వల్లే ఇది సాధ్యం అయింది …
మీడియా వాళ్లే కాకుండా ఇతరులు కూడా పాత పత్రికల కోసం ఈ వెబ్ సైట్ చూసేవారు … చదివితే తెలివి మీరి పోతారు అవసరమా అనుకున్నారో, ఏం జరిగిందో కారణం ఏమిటో తెలియదు కానీ వెబ్ సైట్ మూతపడి ఏళ్ళు గడుస్తున్నాయి …
ఓ ఏడాది క్రితం కేవలం ఈ వెబ్ సైట్ కోసమే మీడియా అకాడెమీ చైర్మెన్ ను కలిస్తే వారం రోజుల్లో కొత్త సొగసులతో వస్తోంది అన్నారు … ఉత్సాహాంగా face book లో ఇది రాసేశా … ఓ మిత్రుడు వారంలో అని చాలా కాలం నుంచి వింటున్నాం అని కామెంట్ చేశాడు కూడా …. మీడియాలో ఉన్నవారి కన్నా ఎక్కువగా పాత పత్రికలు ఇష్టపడే మిత్రులు ఆ పోస్ట్ చూసి సంతోషించారు …
వారం కాదు ఏడాది గడిచినా అతీ గతి లేదు … ప్రపంచ గతిని మార్చడంలో బిజీగా ఉండే మీడియా వారు వెబ్ సైట్ లాంటి చిన్నా చితక విషయాలు పట్టించుకోవాలి అని కోరుకోవడం అత్యాశే …
చదువుకునే రోజుల్లో చిక్కడపల్లి , కవాడిగూడ , సికింద్రాబాద్ ఆదయ్య నగర్ గ్రంధాలయాలకు మిత్రులం రెగ్యులర్ గా వెళ్లే వాళ్ళం .. ఈ మధ్య పాత రోజులు గుర్తుకు వచ్చి కవాడి గూడా గ్రంథాలయానికి వెళితే కొత్త భవనం కట్టారు . కొందరు న్యూస్ పేపర్స్ చదువుతున్నారు .
ఇక్కడ బుక్స్ ఉండేవి కదా అని అడిగితే పైఅంతస్తులో ఉంటాయి . తాళం వేసి ఉంటుంది . మీకు కావాలి అంటే తాళం చెవి ఇస్తాను అని సమాధానం . ఒకప్పుడు కళకళలాడిన గ్రంధాలయం అడిగితే తాళం చెవి ఇచ్చే స్థితికి చేరింది . ఎక్కువ సేపు ఉండబుద్ది కాలేదు .
ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారితో చిక్కడపల్లి గ్రంధాలయం కిక్కిరిసిపోయి కళకళలాడుతున్నా … రచయితలు ఉచితంగా ఇచ్చిన పుస్తకాలే తప్ప కొత్త పుస్తకాలు కొనే పాపం చేయడం లేదు ..
మున్సిపాలిటీకి , గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు మనం కట్టే పన్నులో కొంత భాగం గ్రంథాలయాలకు వెళ్ళాలి . కానీ వెళ్ళదు .. అడిగే వాడు ఉండడు … కొత్త పుస్తకాలు కొనడం , చదివి చెడి పోవడం అవసరమా ? అని ప్రజల మేలు కోసం పుస్తకాలు కొనడం లేదు …
ఒక ఛాంబర్ కొందరు స్టాఫ్ , ఓ కారు , నెల జీతం… ఇంతకు మించి గ్రంధాలయ ఛైర్మెన్ నెత్తిన ఎక్కువ బాధ్యతలు పెట్టడం లేదు … బెంగాల్ కు చెందిన రాజా రామ్మోహన్ రాయ్ ఫౌండేషన్ వాళ్ళు దేశంలోని అన్ని భాషల బుక్స్ కొని గ్రంథాలయాలకు ఉచితంగా ఇస్తారు …
పుస్తకాలు చదివి ప్రజలు చెడిపోతారు అని మన పాలకులు బుక్స్ కొనకుండా , గ్రంధాలయాలు కళావిహీనంగా మారుస్తూ , చివరకు ప్రెస్ అకాడెమీ వెబ్ సైట్ కూడా అందుబాటులో లేకుండా ఎంతో కృషి చేస్తుంటే – బెంగాల్ వాళ్ళు ఇలా పుస్తకాలు ఉచిత పంపిణీ చేయడం సహించ రాని నేరం … దీన్ని పాలకులు అడ్డుకోవాలి …
జ్ఞానం అత్యంత ప్రమాదకరం … ఏ మూల నుంచి కూడా అది మనల్ని తాకకుండా జాగ్రత్త వహించాలి …
కావాలి అంటే టాంజానియాలో ఆహార అలవాట్లు – ఆఫ్రికాలో ఆకులపై పరిశోధన – చైనాలో గుండు సూదులపై పరిశోధన కోసం పాలకులు ప్రభుత్వ ఖర్చుతో మీడియా వారిని పంపవచ్చు… కానీ జ్ఞానం పెరగకుండా చూసుకోవాలి … జ్ఞానం అత్యంత ప్రమాదకరం …
చదువుకుంటే బూతులు మాట్లాడలేరు, మహా అయితే గ్రూప్ 4 ఉద్యోగానికి సెలక్ట్ అయ్యేవారు , గ్రూప్ 1 కు ప్రిపేర్ అయ్యేవారు … కానీ చదువుకోకపోతే బూతులు నమ్ముకొని సీఎం పదవి వరకు ఎదగవచ్చు … జ్ఞానం గ్రూప్ 4 ఉద్యోగానికి పరిమితం చేస్తే… జ్ఞానానికి దూరంగా ఉంటే సీఎం పోస్ట్ వరకు వెళ్ళవచ్చు…
సో, అతడు సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్టు… నాలెడ్జ్ ఈజ్ డివైన్ కాదు… ఎంత తాగితే అంత బలం అని కూడా కాదు…
Share this Article