On Sky: అది 2030 సంవత్సరపు వర్ష రుతువు. మేఘాలు నీటిని కడుపులో దాచుకుని నలుపెక్కి, బరువెక్కి కిందికి దిగి కురవడానికి సిద్ధంగా ఉన్నాయి. నయాపాలిష్ బండల కొండల ఈ వేలం పాటలతో ఆవేళ ఆన్ లైన్ గాలి వెర్రెక్కి ఊగుతోంది.
పాటకు తాళం లేని సాకీకి పాస్ వర్డ్ తాళం తీశారు.
ఎకరా వేలం పల్లవి వేగం అందుకుంది.
ఆది తాళం వంద కోట్లు. ఆలాపన రెండొందల కోట్లు. మొదటి చరణానికి మూడొందల కోట్లు. మొదటి చరణం నాలుగో పాదానికి నాలుగు వందల కోట్లు. పాట పంచప్రాణాల మనో ధర్మానికి పంచశత- అయిదు వందల కోట్లు.
రెండో చరణం త్రిస్ర గతి దాటి మిశ్ర గతిలో అఖండ గతిని అందుకుని బ్రహ్మ గాంధర్వ గానం కూడా అందుకోలేని ఆరున్నొక్క రాగంలో ఏడు వందల కోట్లు పలికే సరికి ఏడు స్వరాలు మూగవై తలదించుకుని మౌనంగా నిష్క్రమించాయి.
Ads
…అంటే ఎకరం నికరంగా పాడుకున్న ధర ఏడు వందల కోట్లు. అర ఎకరా మూడు వందల యాభై కోట్లు. పావు ఎకరా 175 కోట్లు. గజం పద్నాలుగు లక్షలా యాభై ఎనిమిది వేలా మూడు వందలా ముప్పయ్ మూడు రూపాయలు. చదరపు గజం విలువను సాధించడానికి సున్నాల గుణింతాలు ఏ క్యాలిక్యులెటర్లో అయినా పడతాయా? పడినా కనీసం ప్రపంచ లెక్కల అద్భుతం శ్రీనివాస రామానుజన్ లాంటివారికయినా అర్థమవుతాయా?
చదరపు అడుగు ఎంతో అడుగు. అంగుళం ఎంతో? సెంటీ మీటర్…పోనీ చదరపు మిల్లీ మీటర్ ధర చెప్తారా?
నో.
రేట్ ఆన్ రిక్వెస్ట్.
సెండ్ యువర్ ప్రొఫైల్ ఫస్ట్.
వుయ్ విల్ డిసైడ్ వెదర్ యూ డిజర్వ్ టు నో ది రేట్ ఆర్ నాట్!
మరుసటి రోజు వార్తలు:-
ప్రపంచ రియలెస్టేట్ మార్కెట్లో ఆల్ టైం రికార్డ్
హాంగ్ కాంగ్, లండన్, న్యూయార్క్ లను దాటిన నయాపాలిష్ కొండల రేట్లు
ఎకరం ఏడు వందల కోట్ల చొప్పున ఈరోజు వేలం గాలి పాటల్లో ప్రభుత్వ ఖజానా గాలానికి చిక్కిన మొత్తం ఇన్ని వేల కాదు లక్షల కోట్లు
రేపు మరో వంద ఎకరాల అంతర్జాతీయ ఈ వేల గానకచేరీలో రియలెస్టేట్ దిగ్గజ సంగీతజ్ఞులు పాడే పాటలకు మూసీ తీరం ముస్తాబు
ఇది కాలాతీత అభివృద్ధికి కొలమానం అన్న అధికార పక్షం
ఉన్న భూములను అమ్మేస్తే భాగ్యనగరం భూమిలేని నిర్భాగ్య అవుతుందన్న ప్రతిపక్షం
అక్కుపక్షులయిన ప్రతిపక్షులను లెక్కచేయబోమన్న అధికారపక్షులు
నయాపాలిష్ కొండల చుట్టూ యాభై కిలోమీటర్ల వలయంలో ఇక ఎకరా కనీస ధర వంద కోట్ల నుండి అయిదు వందల కోట్లకు తగ్గకూడదని కొనుగోలుదారుల సౌకర్యార్థం రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకున్న రియలెస్టేట్ అంతర్జాతీయ అంతరిక్ష సంఘాల సమాఖ్య- తెలంగాణ శాఖ
మొన్నటి దాకా యాభై అంతస్థులకే అనుమతించిన పురపాలక శాఖ…నయాపాలిష్ లో వంద అంతస్థుల కనీస ఎత్తుగా నిర్ణయించాలని ప్రతిపాదన
వేలం వేసిన భూమిలో…కట్టబోయే హై రైజ్ గురించి…మాటవరసకు వాట్సాప్ గ్రూపుల్లో పెడితే...ప్రీ లాంచ్ మార్కెట్ పద్మవ్యూహంలో సాయంత్రానికే చిక్కుకున్న ఏడు వేల మంది నయా సంపన్న అభిమన్య కొనుగోలుదారులు
పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1200 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేస్తే…ఇరవై లక్షల మంది నిరుద్యోగులు నిరీక్షిస్తుంటే…పది కోట్ల రూపాయల ఇళ్లు, పాతిక కోట్ల రూపాయల ఇళ్లు ఇలా సంతలో కిలోల్లెక్కన కూరగాయలు కొంటున్నట్లు కొంటున్నదెవరో? అన్ని లక్షల కోట్ల రూపాయల డబ్బు ఎలా పుడుతోందో? అని అనుకుంటూ…మేఘాల కడుపు బరువెక్కి…గుండె చెరువై…ఎలాగూ ఇక్కడ చెరువుల్లేవు కాబట్టి…అనుకుంటూ దెబ్బతిన్న మనోభావాలతో జైసల్మేర్ ఎడారిలో తడారిన గొంతుల మీద కురిస్తే నయమనుకుని మేఘ మార్గంలో రివ్వున ఎగిరిపోయాయి. మబ్బులు తొలగిన ఆకాశం మరింత వెలుగెక్కి నయాపాలిష్ బండల కొండలను వెలిగిస్తోంది.
నయాపాలిష్ ఈజ్ షైనింగ్!
తోకాపేట ఈజ్ లాఫింగ్!!
-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com
Share this Article