కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డితో అమిత్‌షా ముప్పావు గంట భేటీ వేశాడట… అబ్బే, కలిసిన మాట నిజమే గానీ, జస్ట్, ఓ మర్యాదపూర్వక కలయిక అంటున్నాడు రెడ్డి గారు… హహహ… ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేతో ముప్పావుగంట అమిత్ షా భేటీ వేయడమా..? అదీ మర్యాదపూర్వంగా..!! జనం చెవుల్లో చాలా మర్యాదపూలు పెడుతున్నారు రెడ్డి గారు… అమిత్ షా మర్యాదస్తుడే గానీ… ఇప్పుడున్న స్థితిలో అమిత్ షా ప్రతి పలకరింపు వెనుక, ప్రతి షేక్ హ్యాండ్ వెనుక చాలా మర్మాలుంటాయని దేశమంతా ఎరుకే కోమటిరెడ్డి భయ్యా…
మరీ రొటీన్ రాజకీయ వ్యాఖ్య దేనికి..? ఎప్పటి నుంచో చెబుతున్నావు కదా… కాంగ్రెస్‌లో ఉండను, ఉండను అని… ఇప్పుడూ అదే చెబితే పాయె… నువ్వు ఎలాగూ అందులో ఉండవని కూడా అందరికీ తెలుసు… అమిత్ షా ఏదో ప్లాన్ రచించే నిన్ను ముందుకు తోస్తున్నాడనీ అందరికీ తెలుసు… టీఆర్ఎస్‌ను దెబ్బతీయడానికి కేవలం ఉత్తర తెలంగాణ సరిపోదని, దక్షిణ తెలంగాణ మీద కాన్సంట్రేట్ చేయాలని బీజేపీ ఆలోచన… దక్షిణ తెలంగాణలో బలపడాలంటే ఇప్పటికిప్పుడు చేయడానికి ఏమీలేదు… వలసవాదులకు అర్జెంటుగా కాషాయకండువాలు కప్పేయడం తప్ప…
నువ్వెలాగూ రెడీగా ఉన్నావు… రారమ్మని ఆలింగనం చేసుకోవడానికి అమిత్ షా కూడా రెడీయే… ఖమ్మంలో పొంగులేటి కావచ్చు, నల్గొండలో కోమటిరెడ్డి కావచ్చు, మహబూబ్‌నగర్‌లో జూపల్లి కావచ్చు కాషాయానికి కాస్త స్ట్రెంత్ కావాలనే కదా… ఆల్‌రెడీ రంగారెడ్డిలో కొండా విశ్వేశ్వరరెడ్డి పడిపోయాడు కదా… ఇంకా ఎవరెవరున్నారో గుర్తిస్తున్నారు, అందుకే అంత టైమ్ ఇస్తున్నాడు అమిత్ షా… పార్టీ చందాల కోసం కాదుగా…
Ads
కోమటిరెడ్డి గతంలో కూడా అమిత్ షాను కలిశాడు… వచ్చెయ్, ఇంకా ఎందుకు దోబూచులాట అని అమిత్ షా చెబుతూనే ఉన్నాడు… కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా కొంతకాలం ఆగీ ఆగీ సడెన్‌గా జంపైపోయాడు… ఇక వెయిటింగు అక్కర్లేదనీ, పార్టీలో జాయిన్ అయిపోవాలని అమిత్ షా చెబుతున్నాడు… జార్ఖండ్‌లోని గోడా నియోజకవర్గ ఎంపీ నిషికాంత్ దూబే (బీజేపీ) ఈ భేటీకి మధ్యవర్తిత్వం వహించాడనీ, కోమటిరెడ్డి ఆయన దోస్తులనీ, కోమటిరెడ్డి జార్ఖండ్‌లో కొన్ని కంట్రాక్టులు చేస్తున్నప్పుడు స్నేహం పెరిగిందనీ అంటారు… కానీ కోమటిరెడ్డికి అమిత్ షాకు నడుమ ఏ దూబేలు అక్కర్లేదు… కోమటిరెడ్డికి అమిత్ షా ఆఫీసుతో యాక్సెస్ ఉంది…
అలాగే కోమటిరెడ్డిని వెంటనే రాజీనామా చేయాలని అమిత్ షా సూచించాడనీ, కేసీయార్‌ను వరుస ఉపఎన్నికలతో రాష్ట్ర రాజకీయాల్లోనే ఎంగేజ్ చేసే ప్రయత్నమనీ ప్రచారం సాగుతోంది… అదీ నిజం కాదు… నిజానికి కేసీయార్ జాతీయ రాజకీయాల్లోకి రావాలనే మోడీ, షా కోరుకుంటున్నారు… దానికీ వాళ్లకు కొన్ని కారణాలున్నయ్… లెక్కలున్నయ్…
మరి కోమటిరెడ్డి ఇక బీజేపీలోకి జంప్ అయిపోయినట్టేనా..? ఆ కేరక్టర్ అంత సులభంగా తేల్చేసేది కాదు… బాగా నానబెడుతున్నాడు కొన్నాళ్లుగా… ఏదో ఒకటి తేల్చుకో అని నిర్మొహమాటంగా చెప్పినట్టున్నాడు అమిత్ షా… త్వరలో ఈ చేరికలు, జంపింగుల మీద కాన్సంట్రేట్ చేసి, జిల్లాల వారీగా పార్టీ యాక్టివిటీని పెంచాలనేది బీజేపీ ఆలోచన… ఆ ప్రణాళిక రచన, మంతనాల కోసమే కోమటిరెడ్డితో అమిత్ షా భేటీ… అంతే… !! ఆల్‌రెడీ బీజేపీ ఐడెంటిఫై చేసుకుని, లిస్టవుట్ చేసుకున్న పలు పేర్లలో కోమటిరెడ్డి పేరు కూడా ఉంది..!
Share this Article