Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ ఇద్దరూ అందాలను ఆరబోసిన మసాలా వంట.. సినిమా సూపర్ హిట్…

August 8, 2025 by M S R

.

Subramanyam Dogiparthi …… 26 కేంద్రాలలో వంద రోజులు ఆడిన సూపర్ హిట్ మాస్ మసాలా ఎంటర్టైనర్ 1986 జనవరిలో వచ్చిన ఈ కొండవీటి రాజా సినిమా . 1+ 2 సినిమా . వన్ చిరంజీవి , టు విజయశాంతి , రాధలు …

కధ రొటీన్ దుష్టశిక్షణ , దేశరక్షణలతో పాటు ఫ్లేష్ బేక్లో హీరో గారి కుటుంబానికి విలన్ గారు చేసిన ద్రోహానికి ప్రతీకారం . ప్రస్తుత మన రెండు తెలుగు రాష్ట్రాలలో మారుమోగిపోతున్న మాట అయితే కక్ష సాధింపు .

Ads

అనగనగా రత్నగిరి అనే ఊళ్ళో రావు గోపాలరావు అనే విలనాసురుడు అనుచర విలన్లయిన నూతన్ ప్రసాద్ (సినిమాలో కొడుకు కూడా) , చలపతిరావు , రాళ్ళపల్లిలతో కలిసి అఘాయిత్యాలు , జనం మీద పెత్తనం చేస్తుంటాడు . వాటిని శోధిస్తానికి పురావస్తు శాఖ ఆఫీసర్ అయిన చిరంజీవి పనోడుగా గ్రామ ప్రవేశం చేసి , మోతుబరి విలన్ని ఎదిరిస్తూ ఉంటాడు .

గ్రామంలో ఓ పోస్ట్ మాస్టర్ గారికి విజయశాంతి కూతురు . ఆమె , చిరంజీవి డ్యూయెట్లు పాడేసుకుంటారు . ఆ ఊళ్ళోనే మరో నోరు లేని భార్యా భయస్తుడు సత్యనారాయణ . ఆయన చనిపోయిన మొదటి భార్య కూతురు రాధ . వాళ్ళింట్లో సూపర్వైజర్ ఉద్యోగంలో చేరతాడు హీరో .

గుండమ్మ కధలోలాగా అమ్మాయి గారిని బుల్లెమ్మా అంటుంటాడు . సినిమా మధ్యలో తెలుస్తుంది . ఆ నోరు లేనాయన తన చనిపోయిన అక్క భర్తేనని . చనిపోయే ముందు హీరో నాయనమ్మ కధంతా చెప్పి మేనకోడలు అయిన రాధను పెళ్ళి చేసుకోవాలని చేతిలో చెయ్యి వేయించుకుని టపా కట్టేస్తుంది .

విజయశాంతి తన ప్రేమను త్యాగం చేసి రాధకు దారిస్తుంది . హీరో గారు విలన్ దేశ సంపదను దోచే కార్యక్రమానికి అడ్డుకట్ట వేసి పోలీసులకు దేశద్రోహులను అప్పచెప్పటంతో సినిమా ముగుస్తుంది .

చిరంజీవి , రాధ , విజయశాంతిలు ఆటాపాటలతో ప్రేక్షకులను అదరగొట్టేసారు . రాఘవేంద్రరావు పాటల చిత్రీకరణ మనకు తెలిసిందే కదా ! అదే ట్రెండ్ . పాటల్ని వ్రాసిన వేటూరి గారిని , చక్రవర్తి సంగీతాన్ని , బాలసుబ్రమణ్యం సుశీలమ్మ జానకమ్మ గొంతుల్ని బ్రహ్మాండంగా మెచ్చుకోవాలి . వీటన్నింటికి ధీటుగా సలీం కంపోజ్ చేసిన డాన్సులు అద్భుతం .

ముఖ్యంగా పాటల్లో విజయశాంతి , రాధల కాస్ట్యూమ్స్ తయారు చేసిన ఆర్టిస్టులను , వారిద్దరిని చాలా అందంగా చూపిన కె యస్ ప్రకాషుని ప్రత్యేకంగా అభినందించాలి . పరుచూరి బ్రదర్స్ కధను , మాటల్ని చాలా పదునుగా సానపెట్టారు .

సినిమా చాలా భాగం గద్వాల్ కోటలో , చుట్టుపక్కల గ్రామాల్లో షూట్ చేసారు . అంగాంగ వీరాంగమే అమ్మమ్మ చదరంగమే అనే గ్రూప్ డాన్స్ కోటలోని దేవాలయ ప్రాంగణంలో షూట్ చేసారు . ఈ సినిమాలో చిరంజీవి ఒక పాటలో ముగ్గురు అందాల భామలతో డాన్స్ చేస్తాడు .

యమగోల , బాహుబలి సినిమాల్లోలాగా ఒకేసారి చేయడు . ఒకరి తర్వాత ఒకరితో డాన్స్ ఉంటుంది . జయమాలిని , సిల్క్ స్మిత , అనూరాధలతో ఉంటుంది ఈ డాన్స్ . అప్పట్లో అలాంటి డాన్స్ ఒక్క యన్టీఆర్ సినిమాలోనే చూసిన ప్రేక్షకులకు ఇది బాగా నచ్చింది .

ఇంక డ్యూయెట్లు . మంచమేసి దుప్పటేసి మల్లెపూలు చల్లాను రాజా అంటూ సాగే డ్యూయెట్ విజయశాంతి , చిరంజీవిల మీద గ్రూప్ డాన్సుగా రాఘవేంద్రరావు ఇరగతీసాడు ముతగ్గా చెప్పాలంటే . వీరిద్దరి మీద మరో డ్యూయెట్ ఊరికంత నీటుగాడె డాం డాం డాం …

ఇంక రాధ వంతు . ఆమెతో కూడా పేచీ లేకుండా రెండు డ్యూయెట్లు . ఇద్దరు హీరోయిన్లకు రెండు కళ్ళ సమ న్యాయం . ఇదోరకం మల్టీస్టారర్ తంతు… నా కోక బాగుందా నా రెయిక బాగుందా , కొమ్మలకి కోయిలకి పాటలకి పల్లవికి పెళ్లి అంటూ సాగుతాయి . వీటిలో మొదటిది కాస్తంటే కాస్త బూతు లాగా అనిపించినా రెండోది సంసారపక్షంగా బాగుంటుంది . మహానుభావుడు వేటూరి కలానికి అన్ని వైపులా పదునే . బాల్ పాయింట్ కదా !

సినిమాలో మాస్ మసాలాలు చాలా ఉన్నాయి . ముఖ్యంగా ఎడ్ల పందాలు . ఒక రకంగా జీవ హింస అయినా గ్రామాలలో నివసించే వారికి అవంటే ఇష్టం . సినిమాలో బాగా జొప్పించారు . క్లైమాక్సులో ఫైట్లని స్టంట్ మాస్టర్ విజయన్ అద్భుతంగా కంపోజ్ చేసాడు . కాళ్ళు కింద పెట్టకుండా ఫైటింగ్ చేస్తానని పందెం కట్టి అలాగే ఫైట్ చేస్తాడు చిరంజీవి . ఫైట్లను బాగా తీసారు చిరంజీవి లెవెల్లో . సినిమాలో మాడా బేండ్ ట్రూప్ సరదాగా ఉంటుంది .

ఇతర ప్రధాన పాత్రల్లో నిర్మలమ్మ , వై విజయ , పి యల్ నారాయణ , భీమేశ్వరరావు , జయ విజయ , మమత , నర్రా , పి జె శర్మలు నటించారు . అప్పట్లో ఈ సినిమాను చూడని సినీ ప్రేమికులు ఎవరూ ఉండరు . చిరంజీవి అభిమానులు అయితే చాలా సార్లు చూసే ఉంటారు .

It’s a romantic , hilarious , action entertainer . సినిమా యూట్యూబులో ఉంది . విజయశాంతి చాలా అందంగా ఉంటుంది . ఇలాంటి సినిమాలు చూసినప్పుడు దర్శకులు ఆమెను రాములమ్మని చేసి ప్రేక్షకులకు అన్యాయం చేసారని అనిపిస్తూ ఉంటుంది . అదో గోల . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమాకబుర్లు #తెలుగు_సినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఐటీసీ స్కామ్..! షెల్ కంపెనీలతో దేశవ్యాప్తంగా విస్తరించిన నెట్‌వర్క్…
  • పెద్ద హీరోలకు వందల కోట్లు… కార్మికుల కడుపు నింపడానికి ఏడుపులు..?!
  • ఆ ఇద్దరూ అందాలను ఆరబోసిన మసాలా వంట.. సినిమా సూపర్ హిట్…
  • కేసీయార్ ‘స్వచ్చంద జైలు’… రేవంత్‌రెడ్డి సెటైరిక్ ‘పంచుల’ భాష…
  • *పోలీసుల ముక్కూచెవులు కోస్తూ… అమ్మవారికి రక్తార్పణం…*
  • హీరో మాస్ మహారాజ్… సినిమా మాస్ జాతర… పాటకు బూతాభిషేకం…
  • ‘‘మాకు అప్పగించండి… ఫోన్ ట్యాపింగ్ అరాచకం కథేమిటో తేల్చేస్తాం..’’
  • రేయ్ ఎవుర్రా మీరంతా… ఈ పాదపూజలు, నాగభజనలూ ఏమిటర్రా…
  • అదనపు అమ్మ స్తన్యం… ఎందరెందరో బిడ్డలపై ‘అమ్మతనం’…
  • చందమామపై ఓ విల్లా… ఎట్‌లీస్ట్ ఓ డబుల్ బెడ్‌రూం ఫ్లాట్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions