.
Subramanyam Dogiparthi
మహిళలు మెచ్చిన చిత్రం . మహిళలకు నచ్చిన మరో భార్యాభర్తల సినిమా . సినిమా పేరు కొంగుముడి ఎలా ఉన్నా, ఇది కూడా భార్యకు భర్త శీలం మీద కోపం రావడం , పుట్టింటికి చేరడం , మరో స్త్రీతో డ్యూయెట్ పాడుకుంటున్నట్లు ఊహ రావటం , పుట్టింట్లో అవమానాలు , చుట్టుపక్కల ఉన్నవారు తలంటుపోయటం , సినిమాఖరుకు భర్త దగ్గరకు వెళ్ళిపోవటం . ఇదే కధ .
అయితే ఈ సినిమాలో భార్యకు కోపం రావడానికి ఘట్టి కారణాన్నే చూపారు కధా రచయిత విజయ బాపినీడు . రాత్రి టైంలో పెళ్ళయిన శోభన్ బాబుని బేవార్స్ ఫ్రెండ్ ఒకడు హోటల్ గదికి రమ్మంటాడు . హోటల్ రూంకు వెళ్ళాక ఇంటి దగ్గర నుండి భార్య గారు వస్తావా చావమంటావా అనగానే ఇప్పుడే వస్తానని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు .
Ads
గదిలో అమ్మాయి ఉంది జాగ్రత్త అని చెప్పి వెళతాడు . ఇంతలో పోలీసులు దాడి చేయటం , అరెస్ట్ చేయటం , కోర్టులో ప్రొడ్యూస్ చేయటం , కొంప కొల్లేరు కావటం చకచకా జరిగిపోతాయి . మలుపులు తిరుగుతూ కధ సుఖాంతం అవుతుంది .
ఈ సినిమాలో సమాంతరంగా ఓ బ్రోకరింగ్ రాజకీయ నాయకుడి ప్రస్థానం నడుస్తుంది . అది రావు గోపాలరావుది . 1984 ఆగస్టులో నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడుతో వెన్నుపోటు అనే మాట మన రాష్ట్రంలో వీర పాపులర్ అయిపోయింది . 1984, 1985 ప్రాంతంలో వచ్చిన చాలా సినిమాల్లో ఆ వెన్నుపోటును బాగానే వాడుకున్నారు .
రావు గోపాలరావు ముత్యాలముగ్గు సినిమాలో లాగా కాంట్రాక్టర్ . బైఎలక్షన్లలో మునిసిపల్ కౌన్సిలర్ అవుతాడు . చైర్మన్ గుండె ఆపరేషనుకు బొంబాయి వెళతాడు . ఆయన తిరిగి వచ్చే లోపు ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెట్టి తాను చైర్మన్ అయిపోతాడు .
బొంబాయి నుండి తిరిగొచ్చిన మాజీ చైర్మన్ నన్ను వెన్నుపోటు పొడుస్తావా అంటాడు . అప్పుడు రావు గోపాలరావు చక్కగా వెన్నుపోటోపాఖ్యానాన్ని బోధిస్తాడు . ఓ టివి ఇంటర్వ్యూలో నాదెండ్ల భాస్కరరావు గారు ఇదే ఉపాఖ్యానాన్ని ప్రవచిస్తారు . సక్సెస్ అయితే తిరుగుబాటు , ఫెయిలయితే వెన్నుపోటు . రాజకీయాల్లో , యుధ్ధం లాంటి రాజకీయాల్లో ఇదేదీ తప్పు కాదని రావు గోపాలరావు ప్రబోధిస్తాడు . ఈ సినిమాలో మెయిన్ కధకు సమాంతరంగా నడిచే రావు గోపొలరావు రాజకీయ ప్రహసనం బాగుంటుంది .
శోభన్ బాబుకి ఇలా నలిగిపోయే భర్త పాత్ర కొట్టిన పిండే . Possessive and suspicious భార్య పాత్ర సుహాసినిది . మరంతే కదా ! భర్తా రూపవాన్ శత్రుః . భర్త షోగ్గా , శోభన్ బాబు లాగా ఉంటే అందరూ ఖాళీగా తన భర్త పుంగవుడికే లైనేస్తున్నారు అని భార్యామణులు తలుస్తుంటారు , భ్రమిస్తుంటారు .
అలాంటి పాత్రలో సుహాసిని బాగా నటించింది . సుహాసిని కూడా మొదట్లో గ్లామర్ స్పేసుని , తర్వాత ఏక్షన్ స్పేసుని బాగానే ఫిల్ చేసింది . రావు గోపాలరావు తర్వాత ప్రేక్షకులకు గుర్తుండే పాత్రలు నిర్మలమ్మ , రమాప్రభవి . రమాప్రభ తల్లీకూతుళ్ళుగా ద్విపాత్రాభినయం చేసింది .
మరో జంటగా శ్రీధర్ , దీప చక్కగా ఉంటారు . ఇతర పాత్రల్లో నూతన్ ప్రసాద్ , ప్రసాద్ బాబు , రాళ్ళపల్లి , అనూరాధ , జయమాలిని , ప్రసాద్ బాబు , కల్పనారాయ్ , మల్లిఖార్జునరావు , ప్రభృతులు నటించారు . షావుకారు జానకి , రోజారమణి , బేబీ షాలినిల పాత్రలు బాగుంటాయి .
బాలసుబ్రమణ్యం సంగీత దర్శకత్వంలో వేటూరి , యం బాబూరావుల పాటలు శ్రావ్యంగా బాగుంటాయి . అన్ని పాటల్లో హుషారిచ్చే డ్యూయెట్ శోభన్ బాబు , దీపల మీద ఉంటుంది . మల్లెపువ్వు గిల్లింది , తెల్లచీరె నవ్వింది అంటూ సాగుతుందీ పాట .
అనూరాధ డాన్స్ పాట అలాంటిలాంటి దాన్ని కాదురా అప్పలకొండా హుషారుగా ఉంటుంది . అలాగే మరో హుషారయిన పాట శివ శివ ఆగరా అంటూ జయమాలిని , ప్రసాద్ బాబుల మీద ఉంటుంది .
- ఇప్పుడయితే సెన్సార్ వాళ్ళు ఒప్పుకునే వారు కాదు . రోజులు మారాయి . జానకి vs స్టేట్ ఆఫ్ కేరళ సినిమా టైటిల్లో జానకి అనే పేరు ఉంటానికే సెన్సార్ వారు ఒప్పుకోలేదు .
శోభన్ బాబు , సుహాసినిల మీద డ్యూయెట్లు రెండూ హుషారుగా ఉంటాయి . ఇద్దరి చేత చలాకీగా నటింపచేసారు , డాన్సింపచేసారు దర్శకుడు విజయ బాపినీడు . చేయి చూసి చెప్పండి డాక్టర్ గారు , రాదా మళ్ళీ వసంత కాలం పాటలు శ్రావ్యంగా ఉంటాయి.
సినిమా సక్సెస్ అవటానికి ముఖ్య కారణం విజయ బాపినీడు బిర్రయిన కధ , స్క్రీన్ ప్లే , తర్వాత దర్శకత్వం . కాశీ విశ్వనాథ్ డైలాగులను బాగా వ్రాసారు . సినిమా , పాటల వీడియోలు యూట్యూబులో ఉన్నాయి . చూడబుల్ సినిమాయే .
శోభన్ బాబు , రావు గోపాలరావు , సుహాసిని అభిమానులు తప్పక చూడతగ్గ సినిమాయే . It’s a wife-husband sentiment , emotion-filled , feel good , neat movie . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు
Share this Article