విను తెలంగాణ – ఇది స్తబ్దత కాదు, మౌనం… అనుకోకుండా కోర్టు పని మీద సిరిసిల్లకు వచ్చిన జనశక్తి అగ్రనేత శ్రీ కూర రాజన్న గారిని కలిసి వర్తమాన రాజకీయాలు, పదేళ్ల తెలంగాణ స్వరాష్ట్ర ఫలితాలు, గల్ఫ్ వలసల నేపథ్యం, సిరిసిల్ల -జగిత్యాల పోరాటాల ఫలితంగా ప్రజల్లో స్థిరపడిన విలువలు, ఉద్యమ ఆటుపోట్లు, ఓటమి, తదితర అంశాలపై లోతుగా వారితో చర్చించే అవకాశం లభించింది.
గుండెలో ఆరు స్టంట్ లు, రెండు బైపాస్ సర్జరీలు, బ్రెయిన్ హేమరేజ్ కి మరో సర్జరీ, ఇవన్నీ వారిని ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ, అవేవీ తనను ఆచేతనం చేయకపోవడం కానవచ్చింది. వారితో మూడు గంటలు గడపడం ఉత్తేజ భరితం చేసింది. సమాజం ప్రశ్నించే స్వభాన్ని కోల్పోయిందా అన్న ఒక ప్రశ్నకు “లేదు, మౌనంగా ఉంది” అన్నారాయన.
భవిష్యత్తు పట్ల, పోరాటాల పట్ల నిండు విశ్వాసంతో ఉన్న రాజన్న ఇంటర్వ్యూ తర్వాత రాస్తాను. గల్ఫ్ వలసలకు ప్రధాన కారణాల్లో మొదటిది నిర్బంధమా అంటే… కాదు, పేదరికం అన్నారాయన. రెండవ కారణం, వ్యవసాయం – సంసార జీవనానికి అవసరమైన పెట్టుబడి కొరత, మూడవదే నిర్బంధం అన్నారాయన.
Ads
ఎన్నికల సమయం కనుక భారత రాష్ట్ర సమితి గురించి, కెసిఆర్ గురించి మాట్లాడుతూ, ఒకప్పటి భూస్వాములు పోయి ధరణి వల్ల కొత్త భూస్వాములు వచ్చారని, ఇది దొరల పాలన కాదు, అంతకంటే మించి రాచరికమని ఆయన వివరించారు. విశేషం ఏమిటంటే ప్రస్తుత స్తబ్దత, కార్యాచరణలేమి విషయాల పట్ల కూడా వారు సూటిగా సమాధానం ఇచ్చారు. సమాజం ఘర్షణ లేని కారణంగా స్తబ్దతకు గురైందా అంటే, “కాదు పోరాటం ఓటమికి గురైంది” అని చెప్పారాయన.
ఓటమి, వైఫల్యాలు, ఆటుపోట్లు, నిర్బంధం నుంచి గొప్ప భవిష్యత్తు వైపు వారు చూపు సారించడం, ఆ విషయాలను పంచుకోవడం ఆశ్చర్యపరిచింది. అడగగానే సమయం ఇచ్చిన కూర రాజన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు…. కందుకూరి రమేష్ బాబు, Samanyashastram Gallery
Share this Article