.
Subramanyam Dogiparthi …. 1980s బాహుబలి . తెలుగు వారి బెన్-హర్ (1959) , తెలుగు వారి క్లియోపాత్ర (1963) . తెలుగు చలన చిత్ర రంగంలో ఇంత భారీ సెట్లను వేసిన మొదటి నిర్మాత హీరో కృష్ణే . గ్రేండియర్లో ఇప్పటి బాహుబలితో పోటీ పడగలదు . ఒక విధంగా చెప్పాలంటే బాహుబలి- గ్రాఫిక్స్= సింహాసనం .
బెన్-హర్ సినిమాలో సెట్లను గుర్తుకు తెస్తాయి . అవంతీ దేశ యువరాజు పట్టాభిషేకానికి అలకనందా దేవి పాత్రలో జయప్రద వచ్చిన రధం క్లియోపాత్ర సినిమాలో ఎలిజబెత్ టేలర్ ఎంట్రీ గుర్తుకొస్తుంది . అంత భారీ కాదు కానీ దాని స్ఫూర్తితోనే తీసి ఉంటాడు కృష్ణ .
Ads
తెలుగు , హిందీ భాషల్లో ఏకకాలంలో తీసారు . హిందీలో జితేంద్ర హీరో కాగా , ముగ్గురు అందాల భామలు , ఓల్డ్ బ్యూటీ వహీదా రెహమాన్ తమ తమ పాత్రలను తిరిగి వేసారు . తెలుగులో మొదటి సినిమా స్కోప్ , మొదటి 70 MM రెండూ సాహస వీరుడు కృష్ణ ఎకౌంట్లోనే .
150 థియేటర్లలో విడుదలయిన గ్రేండ్ గలా సినిమా కూడా ఇదే . 41 సెంటర్లలో వంద రోజుల పోస్టర్ పడింది . మా నరసరావుపేటలో కూడా ఈశ్వర్ మహల్లో వంద రోజులు అడిందని పోస్టర్లో చూసా .
వంద రోజుల పండుగ మద్రాస్ వి.జి.పి గార్డెన్సులో నేల ఈనినట్లు ఆంధ్రప్రదేశ్ నుండి కృష్ణ అభిమానులు బస్సులేసుకుని వెళ్ళారట . పోలీసులకు జన నియంత్రణ కష్టం అయిందట . ఇంతటి 1980s బాహుబలికి సుమారు మూడు కోట్లు ఖర్చు అయితే సుమారు అయిదు కోట్ల రెవెన్యూ వచ్చిందట . అయితే ఇక్కడ వచ్చిన లాభం హిందీలో సర్దుకుందట …
వహీదా రెహమాన్ , నీలి కళ్ళ సుందరి మందాకినిని , అమ్జాద్ ఖాన్ని బాలీవుడ్ నుంచి దించారు . నీలి కళ్ళ సుందరికి , అమ్జాద్ ఖాన్లకు ఇదే మొదటి తెలుగు సినిమా కూడా . వహీదాకు షావుకారు జానకి , అమ్జాదుకు నూతన్ ప్రసాద్ గాత్రదానం చేసారు . కృష్ణ సినిమా అంటే సాదారణంగానే భారీ తారాగణం ఉంటుంది . అందులో జానపదం . ఇక చెప్పేదేముంది . అతిరధ మహారధులు అందరూ కనిపిస్తారు .
కాంతారావు , సత్యనారాయణ , ప్రభాకరరెడ్డి , గుమ్మడి , గిరిబాబు , సి యస్ రావు , రాజ్ వర్మ , అల్లు రామలింగయ్య , త్యాగరాజు , సుదర్శన్ , మరెంతో మంది రాళ్ళెత్తారు .
కధను అద్భుతంగా నేసిన గుంటూరు జిల్లా ఇద్దరినీ అభినందించాలి . ఒకరు తెనాలి వద్ద బుర్రిపాలెం బుల్లోడు కృష్ణ అయితే మరొకరు చిలకలూరిపేట దగ్గర పసుమర్రు వాసి త్రిపురనేని మహారధి . తూటాల్లాంటి మాటల్ని కూడా వ్రాసారు మహారధి . ఈ సినిమాకు నిర్మాత , స్క్రీన్ ప్లే , ఎడిటింగ్ , దర్శకత్వంతో పాటు ద్విపాత్రాభినయం కూడా చేసారు కృష్ణ .
ఈ సినిమాలో మెచ్చుకోతగ్గ సాంకేతిక నిపుణుడు సెట్టింగులతో పాటు కాస్ట్యూమ్సుని కూడా డిజైన్ చేసిన భాస్కర రాజుని . ఇలాంటి భారీ జానపదాల్లో కాస్ట్యూమ్స్ చాలా ముఖ్యం . ఆ తర్వాత మెచ్చుకోవలసిన సాంకేతిక నిపుణుడు వి యస్ ఆర్ స్వామి . బ్రహ్మాండమయిన ఫొటోగ్రఫీ .
ఆకాశంలో ఒక తార నా కోసమొచ్చింది ఈ వేళ . ఒక ఊపు ఊపేసిన పాట . బప్పీ లహరి సంగీత దర్శకత్వంలో పాటలు , బేక్ గ్రౌండ్ మ్యుజిక్ రెండూ అదిరిపోయాయి . జయప్రద పట్టాభిషేకానికి వచ్చే సన్నివేశంలో స్వాగతం స్వాగతం అంటూ సాగే పాటలో రాధ నృత్యం , గ్రూప్ నృత్యం , చిత్రీకరణ మహాద్భుతం . నాకయితే ఎలిజబెత్ టేలర్ కన్నా మన జయప్రదే అందంగా కనిపించింది , అనిపించింది .
ఇంత చక్కటి నృత్యాలను కంపోజ్ చేసిన నృత్య దర్శకుడు శ్రీనివాసుకి అభినందనలు చెప్పాల్సిందే . It’s all a visual splendour . ఇది కలయని నేననుకోనా కలనైనా ఇది నిజమౌనా , గుమ్మా గుమ్మా గుమ్మా ముద్దు గుమ్మా , వహవ్వా నీ యవ్వనం వహవ్వా నీ జవ్వనం , వయ్యారమంత కోరే ఒక్క కౌగిలి పాటలు హిట్టయ్యాయి కూడా . వ్రాసిన ఆత్రేయ , వేటూరి అభినందనీయులు . పాడిన రాజ సీతారాం , సుశీలమ్మలను ప్రత్యేకంగా అభినందించాలి . (కృష్ణతో బాలుకు సయోధ్య అప్పటికే సాధ్యమై ఉంటే… పాటలు ఇంకెంత రక్తికట్టేవో)…
మరి కొన్ని సంచలనాత్మక , వివాదాస్పద అంశాలు కూడా ఉన్నాయి . సన్యాసి పాత్రలో కనిపించే సత్యనారాయణ చేత నా దగ్గరేముంది బూడిద , సన్యాసిని వంటి డైలాగులు ఆనాటి ముఖ్యమంత్రి యన్టీఆర్ మీద చెణుకులు .
అలాగే మరొకటి . యన్టీఆర్ సాంస్కృతిక , సంగీత , నృత్య అకాడమీలను రద్దు చేసారు . దీన్నీ టార్గెట్ చేసారు సినిమాలో . విశ్వ విఖ్యాత కళాకారుడయిన యన్టీఆర్ కళలకు సంబంధించిన అకాడమీలను రద్దు చేయటం అప్పట్లో చాలామంది కళాహృదయులను బాధించింది .
యన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్ళు తెలుగు నాట కచేరీ చేయనని మంగళంపల్లి బాల మురళీకృష్ణ శపధం కూడా చేసారు . ఈ సినిమా తర్వాత యన్టీఆర్ని టార్గెట్ చేస్తూ మరి కొన్ని సినిమాలను కూడా కృష్ణ చేసారని మనందరికీ తెలిసిందే .
సినిమా స్కోప్ , బయో స్కోప్ , ఇలా చాలా స్కోపులు ఉన్నాయి . ఇది కృష్ణా స్కోప్ . 1986 మార్చిలో ఈ సినిమా వచ్చేటప్పటికి నేను రీడర్ని. , వైస్ ప్రిన్సిపాల్ని కూడా అయ్యా . అయినా థియేటర్లోనే రెండు సార్లు చూసా . ఇప్పటికీ టివిలో ఎప్పుడు వచ్చినా కళ్ళప్పగించి అలా చూస్తూనే ఉంటా . అంత ఇష్టమైన సినిమా నాకు .
ఇప్పటి తరంలో చూడనివారు ఎవరయినా ఉంటే తప్పక చూడండి . An unmissable , grand , visual , musical , entertaining wonder about which Telugu film industry and Telugu cine lovers should be proud of . Hats off to Super Star Krishna . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_స్కూల్ #సినిమా_కబుర్లు #తెలుగు_సినిమాలు
Share this Article