ఆరడుగుల దాటిన ఎత్తు… మొహంలో కొట్టొచ్చినట్టు కనిపించే గాంభీర్యం… దృఢమైన దేహం… కళ్లల్లో రౌద్రం… మాటలో పౌరుషం… కృష్ణంరాజు ఎన్నిరకాల సాత్విక పాత్రలు వేసినా సరే, ఆయన పేరు వినగానే సినిమాలకు సంబంధించి రౌద్రరూపమే ఎక్కువగా కనిపిస్తుంది… బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు వంటి పాత్రలే చటుక్కున ఆలోచనల్లో మెదులుతాయి… అదేమిటో గానీ తనకు నటుడిగా పేరు తెచ్చిపెట్టినవీ, నిలబెట్టినవీ అలాంటి పాత్రలే…
నిజానికి తనకు బేసిక్‌గా నటనకన్నా ఫోటోగ్రఫీ అంటే ప్యాషన్… హైదరాబాదులో రాయల్ స్టూడియో కూడా పెట్టాడు… కొన్నాళ్లు జర్నలిస్టుగా కూడా చేశాడు… నీకేం గురూ, నువ్వు హీరో మెటీరియల్, సినిమాల్లోకి వెళ్లిపో, నీకు తిరుగులేదు వంటి మాటలతో కిక్కు ఎక్కువై సినిమాల్లోకి వచ్చి పడ్డాడు… విశేషంగా అనిపించేది ఏమిటంటే… అప్పట్లో మిగతా హీరోల ఫ్యాన్స్ తన్నుకునేవాళ్లు, కానీ కృష్ణంరాజు ఫ్యాన్స్‌తో బాగానే ఉండేవాళ్లు… తను కూడా ఏ భేషజమూ లేకుండా ఇతర హీరోల సినిమాల్లో ఎలాంటి పాత్రనైనా ఏ సంకోచమూ చూపకుండా అంగీకరించేవాడు…
మొదట్లో తను హీరోగా స్థిరపడకముందు… పెద్ద హీరోల సినిమాల్లో ఎలాంటి పాత్ర లభించినా చేసేవాడు… సపోర్టింగ్ కేరక్టర్స్, విలన్ కేరక్టర్స్ కూడా ఎక్కువగానే చేసేవాడు… ఎన్టీయార్‌తో భలే మాస్టారు, బడిపంతులు, వాడేవీడు, పల్లెటూరి చిన్నోడు, మనుషుల్లో దేవుడు, మంచికి మరోపేరు, సతీసావిత్రి ఇలాంటివి… అక్కినేనితో బుద్ధిమంతుడు, జైజవాన్, పవిత్రబంధం, మంచిరోజులు వచ్చాయి, మాతృమూర్తి ఎట్సెట్రా… మల్టీ స్టారర్ సినిమాలకు సంబంధించి పెద్దగా ఇగో చూపించడు… ప్రత్యేకించి కృష్ణతో 17 సినిమాలు చేశాడు… శోభన్‌బాబుతో కూడా తన మల్టీ స్టారర్ బంధం బాగానే వర్కవుట్ అయ్యేది…
Ads
తనకు హీరోగా పేరుతెచ్చి పెట్టినవి చాలా సినిమాలు ఉండవచ్చుగాక… కానీ దాసరి సినిమాలతో మాస్ ఆడియెన్స్‌లోకి బాగా వెళ్లగలిగాడు కృష్ణంరాజు… ప్రత్యేకించి కటకటాల రుద్రయ్య… కృష్ణంరాజుకు భలే నప్పిన వేషం అది… ఆ లుక్కు, ఆ డైలాగులు అప్పట్లో హిట్… స్టెప్పులు వేయడానికి ఇబ్బంది పడేవాడు… తనకున్న రెబల్ ఇమేజీ కారణంగా తన కేరక్టరైజేషన్‌లో కూడా దర్శకులు కామెడీ, రొమాన్స్ తదితర అంశాలకు, సాత్వికతకు పెద్దగా ప్రయారిటీ ఇచ్చేవాళ్లు కాదు…
కృష్ణంరాజు అనగానే గుర్తొచ్చే పాత్ర భక్తకన్నప్ప… బహుశా ఆ ఒక్క సినిమాయే కావచ్చు, పలురకాల ఉద్వేగాల్ని కృష్ణంరాజుతో ప్రదర్శింపజేసిన పాత్ర… ఓ డిఫరెంట్ కృష్ణంరాజును కళ్లముందు ఉంచుతుంది… అలాగే త్రిశూలంలో పాత్ర కూడా చెప్పుకోదగింది… సినిమాల్లోలాగే రాజకీయాల్లో కూడా తనది నాన్-సీరియస్ అప్రోచ్… తనకు సినిమాల్లో డాన్స్ స్టెప్పులు సరిగ్గా పడేవి కావు… రాజకీయాల్లోనూ అంతే, సరైన స్టెప్పులు పడలేదు… మొదట్లో కాంగ్రెస్, తరువాత బీజేపీ… ఎంపీ… కేంద్ర మంత్రి… ఆ తరువాత ప్రజారాజ్యం… నెక్స్ట్..? ఏమో..! పేరుకు బీజేపీలో ఉన్నాడేమో గానీ, చాన్నాళ్లుగా ఆ పార్టీలో కూడా నామ్‌కేవాస్తే కొనసాగుతున్నట్టున్నాడు…
పెద్దగా వివాదాల్లోకి వెళ్లడు… అందరితోనూ బాగుంటాడు… హుందాగా వ్యవహరిస్తాడు… మంచి హోస్ట్… అదీ తన కేరక్టర్… సినిమాల్లో గానీ, రాజకీయాల్లో గానీ కాలం ఎటుతోస్తే అటు వెళ్లిపోయాడు… అంతేతప్ప అందరినీ గెలకడం, గోకడం వంటి వేషాలు మాత్రం వేయలేదు… అలాంటి చెడ్డపేరు తెచ్చుకోలేదు… అందుకే కృష్ణంరాజు కృష్ణంరాజే… వేరే ఎవరితోనూ పోలిక లేదు… దట్సాల్…!! (కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న ఆయన ఆదివారం కన్నుమూశాడు…)
చివరగా :: ఆమధ్య ఏదో ఇంటర్వ్యూలో ఆయనకు ఎదురైన ప్రశ్న… ‘‘మీరు ఇంకా సాధించాల్సినవి ఏమున్నాయి..?’’ దానికి ఆయన జవాబు ఏమిటో తెలుసా..? ‘‘జీవిత చరమాంకంలో, ఓ పచ్చని చెట్టు కింద కూర్చుని, గుండె మీద చేయి వేసుకుని…, దేవుడా, నాకిచ్చిన ఈ మానవ జన్మలో నేనెవరికీ ద్రోహం చేయలేదు, నావల్ల ఎవరికీ బాధ కలగలేదనే భావనతో హాయిగా కన్నుమూయాలి…..’’
Share this Article