.
ఫార్ములా రేసు కేసుపై కేటీయార్ వాదనలు విచిత్రంగా ఉంటున్నాయి… దేశంలో చాలామంది నాయకుల మీద విచారణలు జరిగాయి… తనొక్కడి మీదే కాదు…
అసలు అందులో అవినీతే జరగలేదు, లొట్టపీసు కేసు, హైదరాబాద్‌కు 700 కోట్ల ఫాయిదా వచ్చింది అని పదే పదే అంటున్నప్పుడు… మరి కొత్త కొత్త వాదనల్ని, వింత డిమాండ్లను తెరమీదకు తీసుకురావడం దేనికి..? అవినీతి లేనప్పుడు అదే తేలిపోయి పులుకడిగిన ముత్యంగా తనకే ఇమేజ్ వస్తుంది కదా…
Ads
పైగా ఈ దేశ న్యాయవ్యవస్థ మీద ఎలాగూ బాగా నమ్మకం ఉందని చెబుతున్నప్పుడు… ఎలాగూ విచారణకు సహకరిస్తాను అంటున్నప్పుడు… ఆ కోర్టుల్ని కాదంటూ కొంగొత్త విచారణ విధానాలను ప్రతిపాదించడం దేనికి..? ఏ దర్యాప్తు సంస్థ, ఏ కోర్టు దానికి అంగీకరిస్తుంది..?
మొదట్లోనేమో అసెంబ్లీలో చర్చిద్దాం అన్నాడు… ఒక వ్యక్తిపై ఏవైనా నేరారోపణలు వచ్చినప్పుడు… ప్రజాజీవితంలో ఉన్న నాయకుడు కావచ్చు, ఇతరత్రా ఏ ప్రముఖుడైనా కావచ్చు, విచారించాల్సింది దర్యాప్తు సంస్థలు, అంతిమంగా ఆ ఆరోపణలు నిజమో కాదో తేల్చాల్సింది న్యాయస్థానాలు… దీనికి భిన్నమైన విధానాలున్నాయా ఇప్పటివరకూ దేశంలో..? అసెంబ్లీ కాదు కదా కేసుల్ని విచారించేది…?
ఇప్పుడేమో ఇంత ఖర్చు దేనికి, చాలా చౌకగా ఓ పద్ధతి పాటిద్దాం… రేవంత్ రెడ్డి అక్రమ కేసు పెట్టాడు కాబట్టి న్యాయమూర్తి సమక్షంలో లైవ్ డిబేట్ పెట్టుకుందాం, లై డిటెక్టర్ టెస్టుకు నేను రెడీ… రేవంత్ రెడ్డి సిద్ధం కావాలి… ఇదీ తన ప్రతిపాదన… తన వోటుకునోటు కేసు, నా ఫార్ములా కార్ రేసుల్ని అక్కడే చర్చిద్దాం, తేల్చేద్దాం అంటున్నాడు… మరిక కోర్టులు దేనికి..? ఇతరత్రా కేసుల్ని కూడా ఇలాగే మీడియా ఎదుట లై డిటెక్టర్ టెస్టులతో తేల్చేస్తే సరి…!!
వోటుకునోటు కేసు ఆల్రెడీ కోర్టులో ఉంది… కేటీయార్‌పై ఫార్ములా కేసు క్వాష్ చేయడం కుదరదనీ కోర్టు చెప్పింది… అంటే ఆ రెండూ కోర్టుల పరిధిలో ఉన్నట్టే… రేప్పొద్దున ఈ కేసులపై ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా, ఉపసంహరించుకున్నా కోర్టుల అంగీకారం కావాలి… ఆ కేసు వేరు, ఈ కేసు వేరు… అసలు దానికీ దీనికీ లంకె ఏమిటి..? పైగా నమోదయ్యే ప్రతి అవినీతి కేసుకూ సీఎం లేదా పీఎం లై డిటెక్టర్ టెస్టులకు సిద్ధం కావాలా ఇక..?
ఇలాంటి వింత ప్రకటనలు, ప్రతిపాదనలతో ఒరిగేదేమీ ఉండదని తనకూ తెలుసు… కానీ ఇలాంటివి సమాజంలోకి ఎలా వెళ్తున్నాయో కూడా అర్థం చేసుకోవాలి కదా… తప్పు చేసినట్టు రుజువు చేస్తే ఏ శిక్షకైనా రెడీ అంటున్నాడు కదా… మరి అదేదో రుజువు కానివ్వాలి… నడుమ ఈ లై డిటెక్టర్లు దేనికి..? పోనీ, కోర్టుకే ఈ మేరకు విజ్ఞాపన చేసుకోవచ్చు కదా…
మనీ లాండరింగ్, అక్రమ చెల్లింపులు, గ్రీన్‌కో విరాళాలతో క్విడ్ ప్రోకో వంటి చాలా కోణాలున్న సంక్లిష్టమైన కేసుగా మారుతోంది క్రమేపీ… ఛూమంతర్ అనగానే తేలిపోయే కేసు కాదు కదా… కేబినెట్ అనుమతి లేకుండా చెల్లింపులు మాత్రమే కాదు, పౌండ్ల రూపంలో చెల్లింపులు ఆర్బీఐ పర్మిషన్ లేకుండా, ప్రైవేటు సంస్థలకు నష్టం వస్తే ప్రభుత్వం ఎందుకు భరించాలి… రేస్ స్పాన్సరర్స్ ఎందుకు తప్పుకున్నారు వంటి ప్రశ్నలూ ఉన్నాయి… ఈడీ వీటిపైనే కాన్సంట్రేట్ చేస్తోంది…
అవునూ.., పాలిగ్రాఫీ, బ్రెయిన్ మ్యాపింగ్, నార్కో అనాలిసిస్, లై డిటెక్టర్లు శాస్త్రీయమేనా..? వాటిని కోర్టులు సాక్ష్యాలుగా అనుమతిస్తాయా..? ఇదే ఇంకా ఎటూ తేలని పెద్ద చర్చ… రేప్పొద్దున కేటీయార్ ప్రకటనల్నే స్పూర్తిగా కవిత కూడా మద్యం కేసు మోడీ పెట్టించాడు కాబట్టి తనతో లై డిటెక్టర్ టెస్టుకు రెడీ కావాలని డిమాండ్ చేస్తే..! హేమిటో… ఈ ధోరణులు..?!
కాలేశ్వరం, కరెంటు వంటి అంశాలపై కేసీయార్ మీద కూడా విచారణల కమిషన్లు వర్క్ చేస్తున్నాయి… నో, ఈ ప్రయాస, ఈ ఖర్చంతా దేనికి..? మీడియా సాక్షిగా, ఓ న్యాయమూర్తి ఎదుట ఇలాగే లైవ్ డిబేట్, లై డిటెక్టర్ టెస్టులకు నేను రెడీ అనగలడా కేసీయార్..? అనలేడు, అనడు, ఎందుకంటే..? తను కేటీయార్ కాదు కాబట్టి..!!
Share this Article