.
‘దమ్ముంటే రాజీనామా చెయ్, ఇప్పుడు మాకు 90 సీట్లొస్తాయి’ అని కేటీయార్ నిన్న రేవంత్ రెడ్డిని సవాల్ చేసిన తీరు చూడగానే నవ్వొచ్చింది… మాటిమాటికీ ప్రతి విషయానికీ దమ్ముంటే నిరూపించు… దమ్ముంటే రాజీనామా చెయ్… దమ్ముంటే చర్చకు రా… దమ్ముంటే పోటీకి దిగు… దమ్ముంటే డ్యాష్ డ్యాష్….
.
అసలు ఈ దగ్గూదమ్ము, ఉబ్బసం భాషేమిటో ఎడాపెడా వాడేస్తుంటారు హరీష్, కేటీయార్… దమ్మంటే ఏమిటో ఈ లీడర్లకు తెలుసా..? అసలు దమ్ము అనగానేమి..? ఎంత బలంగా దమ్ము పీల్చి వదిలితే అంత బలమున్నట్టా..? ధైర్యం ఉన్నట్టా..? పౌరుషం ఉన్నట్టా..? ఈ గుణాలకూ దమ్ముకూ లింకేమిటి అసలు..? వీళ్లే కాదు, చాలామంది లీడర్లదీ అదే భాష…
మరీ కొందరు లీడర్లయితే దమ్ముంటే మగతనం (పుంసత్వం) అన్నట్టుగా భీకర ప్రకటనలు చేస్తుంటారు… అసలే ఆస్త్మా రోగులు పెరుగుతూ, దమ్ము సరిపోక బాధపడుతున్నారు… వచ్చే 8న, మార్గశిర ఆరంభదినాన ఉబ్బసం రోగులు బత్తిన చేపమందుకు రెడీ అయిపోతున్నారు… మరోవైపు ఇదుగో, ఈ భాషా, భావ కాలుష్యాల దుమ్ము రేపే దమ్ము సవాళ్లు….. ప్చ్, ఇదంతా సమజ్ చేసుకోవడానికి దమ్ము సరిపోవడం లేదు…
Ads
.

పాపం, పవన్ కల్యాణ్ దుర్భాషలు, ద్వేష కాలుష్యం మీద బాగానే స్పందించాడులే అనుకునేలోపు… నో, నేను మారనే మారను, నా భాషా మారదు అన్నట్టుగా… పవన్ కల్యాణ్ వ్యాఖ్యల వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడేమో అంటాడు… ప్రపంచంలో ఏం జరిగినా రేవంత్ రెడ్డి మెడలో వేయడం అలవాటైంది… పవన్ కల్యాణ్ జాగీర్దార్ భాషను ఖండించింది పొన్నం ప్రభాకర్ తదితరులు, ఆ ద్వేష సమావేశానికి అనుమతి నిరాకరించింది కాంగ్రెస్ ప్రభుత్వం… ఐనా పవన్ కల్యాణ్ వ్యాఖ్యల వెనుక రేవంత్ ఉన్నాడేమోననే సందేహ శుష్క భాష ఏమిటసలు..? (బ్లేమ్ గేమ్)…
తెలంగాణ ఆత్మ, జాతిపిత, కేటీయార్ భాషలో తెలంగాణ ఓజీ అని చెప్పబడే కేసీయార్ కనీసం స్పందించాడా..? ఎందుకు..? నీ అయ్య జాగీరా అని ఎవడో పరాయోడు హూంకరిస్తుంటే కనీస కదలిక లేదు దేనికి..? అసలు తెలంగాణ ఆవిర్భావదినాన ఎక్కడైనా జెండా ఎగరేశాడా..? తను ప్రజాజీవితంలో ఉన్నాడా..?
పైగా దమ్ముంటే రాజీనామా చెయ్ అని కేటీయార్ సవాళ్లు… ప్రజలు మిమ్మల్ని అయిదేళ్లు ప్రతిపక్షంలోనే ఉండమని తీర్పు చెప్పారు… మీ నాన్న అలియాస్ ఓజీ ఎలాగూ ప్రజాతీర్పును గౌరవించడం లేదు, జనానికి మొహం చూపించడం లేదు… మరి పదే పదే ఎన్నికలకు రెడీ కావాలి, రాజీనామా చేయాలంటూ ప్రజాతీర్పును అవమానించడం దేనికి..?

సరే, మిగతా మీట్ ది ప్రెస్ అంశాలకు వస్తే….. పాదయాత్ర చేస్తే చేయి, పాదయాత్రలు చేసిన నాయకులు ముఖ్యమంత్రులు అవుదురు అని ఏదో నమ్మకం ప్రబలింది కదా నాయకుల్లో… ఓ పిచ్చి భ్రమ… రీసెంటుగా ముఖ్యమంత్రులైన సువేందు అధికారి, టీవీకే విజయ్, వీడీ సతీషన్, రంగస్వామి ఎవరూ పాదయాత్రలు చేయలేదు… మళ్లీ ముఖ్యమంత్రి అయిన హిమంత విశ్వశర్మ కూడా చేయలేదు…
కానీ 90 సీట్ల లెక్క మరిచిపో మాస్టారూ… డీలిమిటేషన్ ఖాయం, తెలంగాణలో సీట్ల సంఖ్య 150 దాటిపోనున్నాయి… జమిలి ఎన్నికలు కూడా ఖాయం… ఇంకా పాత లెక్కల్లోనే ఉంటే ఎలా..?
చివరగా… బాల్క సుమన్ మాటలు పొరపాటేనని అంగీకరించడం వరకూ గుడ్… కానీ మిలిటెన్సీ స్పిరిట్‌తో పోరాడాలని చెప్పాడు కావచ్చు అని మళ్లీ దానికి సవరింపులు అనవసరం… పక్కాగా సుమన్ పట్లాలు కోసేద్దాం, ఆఫీసులపై దాడులు చేద్దాం, ఆగమాగం చేద్దాం అనే విద్వేష భాషే మాట్లాడాడు… నీ భాషలోనే చెప్పాలంటే… ‘దమ్ముంటే సుమన్‌ను పార్టీ నుంచి బహిష్కరించు’…
Share this Article