.
అనేకసార్లు చెప్పుకున్నాం కదా… బీఆర్ఎస్, కేటీయార్, కేసీయార్, హరీష్ రావు… గతంలో తమ కర్కశ పాలన విధానాలు, అప్రజాస్వామిక నిరంకుశ పోకడలు మరిచిపోయి… ఇప్పుడు డెమోక్రటిక్, ప్రొపీపుల్ మాస్కులు తగిలించుకుని మాట్లాడుతున్నారని..!
జనానికి అన్నీ తెలుసు… రెండేళ్లే కదా అయిపోయింది, అప్పుడే జనం మరిచిపోతారా..? అన్నీ గుర్తుంటాయి, గుర్తున్నాయి… గుర్తులేకపోతే యూట్యూబ్ వీడియోలు, మీడియా కథనాలు గుర్తుచేస్తూనే ఉంటాయి… మచ్చుకు ఓ తాజా విమర్శ ఒకటి చూద్దాం…
Ads
కేసీయార్ ఎలాగూ జనంలోకి రాడు కదా… తెలుసు కదా… హరీష్ రావు తన ఇంట్లో విషాదం కారణంగా జుబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారానికి దూరమయ్యాడు… మరోవైపు ఆ కుటుంబ సభ్యురాలు కవిత ఉల్టా దాడిచేస్తోంది… ఇక ప్రచార క్షేత్రంలో మిగిలింది కేటీయార్ ఒక్కడే…
తనదేమో పూర్తిగా… పాతవన్నీ కావాలని మరుగుపరిచి, జనాన్ని మాయ చేయడానికి కొత్తగా కనిపించడం… ఉద్దేశపూర్వకంగా, రాజకీయ ఫాయిదా కోసం ప్రజాస్వామిక రంగు పులుముకోవడం… మానిప్యులేషన్ అంటారా..? ప్రాపగాండా అంటారా..? పేరు ఏదయితేనేం..?

ఇప్పుడు తను ఏమంటున్నాడంటే..? కాంగ్రెస్‌కు వోటేస్తే బుల్‌డోజర్లు వస్తాయి మీ ఇళ్ల మీదకు… హైడ్రా భూతం వచ్చేస్తుంది… అంటే, హైడ్రా కేవలం పేదల ఇళ్లను కూల్చేస్తుందని నెగెటివ్ క్యాంపెయిన్… అక్రమ కట్టడాల కూల్చివేతలు, చెరువుల సంరక్షణ, వందల ఎకరాలను కబ్జాల నుంచి విడిపించడం మీద కేటీయార్‌కు ఏదో అభ్యంతరమో, చెప్పుకోలేని వ్యక్తిగత నష్టమో ఉన్నట్టుంది హైడ్రా చర్యల్లో… లేకపోతే కబ్జాలకు వత్తాసు ఏమిటి..?
- కేసీయార్ అంటే కట్టుడు, రేవంత్ అంటే కూల్చుడు అట… (నిజమేనేమో… కేసీయార్ అంటే నాసిరకం మేడి(పండు)గడ్డలు కట్టుడు… రేవంత్ అంటే అక్రమ నిర్మాణాల్ని కూల్చుడు… వాస్తు పేరిట సెక్రెటేరియట్ భవనాల్ని కూల్చుడు, కొత్తవి కట్టుడు అనీ అనుకోవాలేమో…)
 

సరే, తను చెబుతున్నాడు కదా, హైడ్రా కూల్చివేతల గురించి..! నిజానికి కేసీయారే ఈ కూల్చివేతల ఆలోచనలకు ఆద్యుడు… అధికారంలోకి రాగానే అయ్యప్ప సొసైటీ మీద పడ్డాడు… దీన్నే కూల్చుడు పాలసీ అంటారు… (దాన్నే ఎందుకు టార్గెట్ చేశాడనేది వేరే కథ)…
అంతేకాదు… ఆరేళ్ల క్రితం కేసీయార్ స్వయంగా శాసనసభలోనే స్పష్టంగా చెప్పాడు… ఇకపై అక్రమ నిర్మాణాలను నోటీసులు ఇవ్వడాలు, క్రమబద్దీకరణలు ఉండవు, కూల్చేయడమే అని..!
ఇదుగో యూట్యూబ్ లింక్… కేసీయార్ బుల్‌డోజర్ పాలసీ
తెలంగాణ పురపాలక చట్టం-2019 మీద చర్చలో భాగంగా తనేమన్నాడంటే..? అక్రమ కట్టడం అంటే చాలు, ఇక కూల్చేయడమే, ఈ బిల్లు అందుకే… హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఈ చట్టం తీసుకొస్తున్నట్టు చెప్పుకొచ్చాడు…
- డియర్ కేటీయార్… మీ నాన్న, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీయార్ చూపిన బాటే కదా ఇది… మరి ఇప్పుడున్నది బుల్‌డోజర్ రాజ్యం ఎలా అవుతుంది..? ఆ కూల్చుడు చట్టం తెచ్చిందే మీ నాన్న కదా… అక్రమ కట్టడాల నిర్మూలన ప్రభుత్వ విధానం కదా… బాధ్యత కదా..?
 - ఏదో తాత్కాలికంగా జనంలో వ్యతిరేకతను ఎగదోయడానికి, పొలిటికల్ ఫాయిదా కోసం… ఎందుకీ ప్రాపగాండా..? ఎందుకీ నెగెటివ్ క్యాంపెయిన్..? అంటే, నాన్న విధానాల్ని కొడుకు ప్రజాక్షేత్రంలో ఖండిస్తున్నట్టా..!! బుల్ డోజ్ చేస్తున్నట్టా..!! కారు వర్సెస్ బుల్‌డోజర్ నినాదంలో ఏమైనా అర్థముందా అసలు..?!
 
Share this Article