.
యుక్తాయుక్త విచక్షణ… రాజకీయాల్లో ఉండదగిన ప్రధాన లక్షణం ఇది… పర్వర్షన్ కావచ్చు, ఫ్రస్ట్రేషన్ కావచ్చు… ఈ లక్షణం నాయకుడి మాటను అదుపులో ఉంచాల్సిందే… దురదృష్టవశాత్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీయార్‌లో ఇది కనిపించడం లేదు…
రాజకీయాల్లో ఆరోపణలు, విమర్శలు, కౌంటర్లు సహజం… బురద జల్లడం కూడా కామన్ అయిపోయింది ఈరోజుల్లో… బట్టకాల్చి మీదేయడం… ఎవరూ అతీతులు కారు, అందరిదీ అదే బాట… సోషల్ మీడియా శకం వచ్చాక మరీ శృతిమించిపోయింది… కానీ..?
Ads
వరదలు, ప్రమాదాలు, విపత్తులు, ప్రకృతి వైపరీత్యాలు, మరే ఇతర మానవ విషాదాలను రాజకీయ లబ్ధికి వాడుకోకూడదు… వాడితే అది అనుచితం… విజ్ఞతలేమి… ఉదాహరణకు… మూసీ వరదలు… దేశంలోనే కాదు, ప్రపంచంలోనే క్లౌడ్ బరస్ట్‌లు విపరీతంగా పెరిగాయి… దానికి భౌగోళిక వాతావరణ స్థితుల్లో పెరుగుతున్న అననుకూలతలు కారణం…
హఠాత్తుగా కుండపోత మొదలవుతుంది… ఆ నీరంతా దిగువకు సాఫీగా వెళ్లిపోయే అవకాశం ఉంటే సరే, లేదంటే వరద మార్గంలో ఏదున్నా అది ముంచేస్తుంది… తోసుకుని, కోసుకుని తన బాటలో అది సాగిపోతుంది… జంటనగరాల దాహార్తిని దశాబ్దాలుగా తీరుస్తున్న హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ నిండి, మత్తళ్లు దూకాయి…
క్యాచ్‌మెంట్ ఏరియాలో భారీ వర్షాల కారణంగా… ఉదయం వెయ్యి క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంటే, రాత్రికి అది 30, 40 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లోగా మారింది… ఇంకా ఎగువ నుంచి భారీ వర్షపు నీరు వస్తోంది… తప్పదు, గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు… మూసీ నదీప్రవాహంలోకి వరదనీరు ఒక్క ఉదుటున వచ్చిపడింది… ఎంజీబీఎస్‌లోకీ నీళ్లొచ్చాయి… మరి అదీ నదీగర్భంలో కట్టిందే కదా… నది ఊరుకోదు కదా… అలాగే నదీగర్భంలోకి జొచ్చుకుపోయి కట్టబడిన ఇళ్లనూ ముంచెత్తింది… ఇది ప్రకృతి అప్పుడప్పుడూ విసిరే పంజా…
తన ఉనికిని చాటుకుంటుంది ప్రకృతి.., అది తిరుగులేనిది… కేటీయార్ ఆరోపణ ఏమిటంటే..? మూసీ సుందరీకరణ, మూసీ ప్రక్షాళన పేరే ఏదయితేనేం, లక్షన్నర కోట్లు తినడానికి ఓ ప్రాజెక్టు సంకల్పించి… ఇళ్ల కూల్చివేత సాధ్యం గాక… ఇదుగో గ్రాడ్యుయల్‌గా గేట్లు ఎత్తాల్సింది పోయి, ఆ రెండు రిజర్వాయర్ల గేట్లను ఒకేసారి ఎత్తించాడట…
ఎందుకు..? ఆ నీరు మూసీలోని కబ్జాలను ముంచెత్తితే, చూశారా, నేను ఊరుకోను అనే శాడిస్టిక్ ఆనందం కోసం అట… కిరాతకుడు అట… జనం నవ్విపోతారు నాయకా..? పై నుంచి భారీ వర్షాల నీరొస్తుంటే, గేట్లు ఎత్తకపోతే తెగిపోయి మరింత విధ్వంసం, కల్లోలం… నాడు 1908లో కనిపించిన వరద బీభత్సం మళ్లీ కనిపించేది… పూడ్చలేని నష్టం వాటిల్లేది…
ఆమాత్రం ఆలోచించక… ఏదో ఒకటి చాన్స్ దొరికింది కదాని వరదల్ని, విపత్తుల్ని కూడా రేవంత్ మెడకు చుట్టడం ఏమిటి..? దానికి కూడా కుట్ర అనే ముద్ర వేయడం దేనికి..? వెంటనే రాజకీయం మొదలుపెట్టకుండా మీ అపార సంపాదన నుంచి ఎంతో కొంత వెచ్చించి, మీ పార్టీ కేడర్ ద్వారా నాలుగు సహాయ కార్యక్రమాలు చేయిస్తే (వెంటనే ఆ ఏరియాల్లో పర్యటించి, బురద జల్లే ప్రక్రియ గాకుండా)… సంయమనం పాటిస్తే బాగుండేది…
సమయం వచ్చింది కాబట్టి, మరొకటీ చెప్పుకోవాలి… అసలు ఈ రెండు రిజర్వాయర్ల క్యాచ్‌మెంట్ ఏరియాలో నిర్మాణాలు జరగకుండా, 111 జీవో ఉంటే… రియల్ ఎస్టేట్ స్వార్థం కోసం దాన్ని బొందబెట్టి… ఈ రెండు చెరువులనూ ఎండబెట్టి… మొత్తం మాయం చేయాలని చూసింది ఎవరు..? కేసీయార్ ప్రభుత్వమే… అంటే ప్రకృతిని చెరబట్టడం…
అందుకే ప్రకృతి తన ఉనికిని ఇలా చూపిస్తుంది… ఎలాగూ గోదావరి నీళ్లొస్తున్నాయి కదా, ఇంకా ఈ రెండు రిజర్వాయర్లు దేనికని అనుకున్నారు కదా… తాగునీరు సరే, మేం వరదల నియంత్రణకు అవసరమే అని ఆ చెరువులు చెబుతున్నాయి… రియల్ ఎస్టేట్ కబ్జాసురులతో కుంచించుకుపోతూ గట్టిగా నాలుగు వర్షాలు పడితే చాలు, నీరు దిగువకు వదిలేయాల్సిందే… ఎవరిది పాపం..?
- మరొకటి… మూసీ నదీప్రక్షాళన, సుందరీకరణ, అభివృద్ధి… పేరు ఏదైతేనేం..? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తలపెట్టిన సంకల్పానికి ప్రకృతే సహకరిస్తోంది అనుకోవాలా మరి… మూసీయే ఉగ్రరూపం దాల్చి, నా గర్భంలో ఆక్రమణలు ఇవీ అని మార్కింగ్ చేస్తోందని భావించాలా మరి… తన ప్రవాహమార్గం లోతు, వెడల్పు ఎక్కడెక్కడ ఎంతో స్పష్టంగా చూపిస్తోందా..?
- ఇళ్లు ఖాళీ చేయించి, అందరికీ పక్కా ఇళ్లు కట్టించి ఇవ్వు, నా దారిని క్లియర్ చేయండీ అని మూసీ చెబుతోందా ఇలా…!!
చిన్న ఉదాహరణ… మూసారాంబాగ్ వంతెన ఇది… దిల్‌సుఖ్‌నగర్ టు అంబర్‌పేట రోడ్డు… నదీప్రవాహమార్గంలోనే ఏకంగా ఓ పెట్రోల్ బంక్… దాని పక్క నుంచే గోల్నాకకు ఓ పెద్ద రోడ్డు వేసింది ప్రభుత్వం… ఓ గుడి, ఇళ్లు, ఇంకొన్ని నిర్మాణాలు… ఇలా మూసీ పొడవునా కబ్జాలే…!!
Share this Article