టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్… ఆల్మోస్ట్ వర్కింగ్ సీఎం కేటీఆర్ సోషల్ మీడియాలో యాక్టివ్… ఏదైనా మనసుకు నచ్చినట్టయితే, రాజకీయాలకు అతీతమైనా సరే స్పందిస్తుంటాడు… ఈరోజు ఉదయం (24.09.2021) 9 గంటలకు ఓ ట్వీట్ కనిపించింది… చెక్ చేస్తే అది తన అఫీషియల్ అకౌంటే… రెండు ఫోటోలు షేర్ చేశాడు… ఒకటి ఖమ్మం జిల్లా, మరొకటి సిరిసిల్ల జిల్లా అని రాశాడు… ఆరోగ్య సిబ్బంది నిబద్ధతకు, కృషికి ఇవే నిదర్శనాలు అన్నాడు… పనిలోపనిగా ఇవి కేసీయార్ నాయకత్వంలోని పంట విప్లవానికి కూడా ప్రతీకలు అనేశాడు… గుడ్… పల్లెల్లోకి వెళ్లి మరీ ఆరోగ్య సిబ్బంది వ్యాక్షినేషన్ పనిలో నిమగ్నం అవుతున్నారంటే అభినందించాల్సిందే కదా… బాగుంది… కానీ ఆ ఫోటోలు ఒకటికి రెండుసార్లు పరిశీలించి చూస్తే… ఇవి ఇంతకుముందే ఎక్కడో చూశాం, ఎక్కడబ్బా అనే సందేహం తొలవడం స్టార్టయింది…
వెతకగా వెతకగా… ఆ ట్విట్టర్‌లోనే రెండురోజుల క్రితం ఎంపీ విజయసాయి రెడ్డి పోస్టు కనిపించింది ఒకటి… (22.09.2021)… ఆయన కూడా ఉదయమే పెట్టినట్టున్నాడు… తన అఫిషియల్ అకౌంట్ నుంచే ట్వీట్ చేయబడింది… సేమ్, కేటీయార్ ట్వీట్‌లో కనిపించిన ఫోటో ఒకటి ఆయన ట్వీట్‌లోనూ ఉంది… జగన్ స్పూర్తితో ఆరోగ్య సిబ్బంది ఓ ఉద్యమంలా వేక్సినేషన్ పనిలో మునిగిపోయారని ఆయన ఆ ఫోటో పెట్టి ప్రశంసించాడు… అయితే అది విజయనగరం జిల్లాలోని ఫోటో అన్నాడు… అది గాకుండా మరో రెండు ఫోటోలు పెట్టాడు… గుడ్… ఇప్పుడు డౌట్ ఏమిటయ్యా అంటే..? ఇంతకీ ఈ ఫోటో విజయనగరానిదా..? సిరిసిల్ల జిల్లాదా..? తెలంగాణ సూదిమందా..? ఆంధ్రా సూదిమందా..? స్పూర్తి దాత కేసీయారా..? కేటీయారా..? ట్వీట్లు డిలిట్ కావచ్చునేమో అని స్క్రీన్ షాట్లు పెడుతున్నాను… ఎవరి ఫోటో ఒరిజినల్, ఎవరు కాపీ కొట్టారు, మరీ ఫోటోలు కూడా కాపీ కొట్టాలా..? ఎవరు చెప్పాలి..? కేటీయార్..? విజయసాయిరెడ్డి..?
Ads
ఆగండాగండి, అయిపోలేదు… నిజానికి ఈ ఫోటో ఎక్కడిది..? ఈ వార్త ఎక్కడిది..? అని తరచిచూస్తే… మహబూబ్‌నగర్ జిల్లా, ఊట్కూరు డేట్‌లైన్‌తో నిన్న… అంటే 23.09.2021న ఓ వార్త కనిపించింది… సేమ్ ఫోటో… మరి ఒకరోజు ముందు విజయసాయిరెడ్డికి ఆ ఫోటో ఎక్కడిది..? కేటీయార్, సాయిరెడ్డి చెప్పినట్టు అది సిరిసిల్ల జిల్లా కాదు, విజయనగరం అసలే కాదు… ఈ ఫోటోల మాయ ఏమిటి సార్లూ..?!
అప్పుడే అయిపోలేదు సార్… కథ ఇంకా ఉంది… ఆంధ్రప్రభలో ఊట్కూరు డేట్‌లైన్ నుంచి వార్త వచ్చింది సరే… మరి డెక్కన్ క్రానికల్ వేసిన ఈ ఫోటో మాటేమిటి..? ఇది మరీ 13.09.2021వ రోజు ఎడిషన్… విజయనగరం జిల్లా, కొంపంగి గ్రామంలో ఈ వేక్సిన్ వేస్తున్నట్టుగా ఉంది… అంటే ఆంధ్రప్రభ వాడూ తప్పులో కాలేశాడా..? గమనించారు కదా… ఒక్క మంచి ఫోటో దొరికితే చాలు, దాన్ని ఎలా వాడేసుకుంటున్నారో….
ఈనాడు తప్పుదోవ పట్టించింది
కేటీయార్ ఈనాడు వార్త చూసి మిస్‌లీడ్ అయినట్టున్నాడు… ఆ వార్త క్లిప్పింగు చూడండి… మరి ఈ ఫోటోను ఈనాడు వాడు ఎందుకు వాడినట్టు..? కేటీయార్ కూడా తన ట్వీట్ల విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి… తను ఆఫ్టరాల్ నాయకుడు కాదు, పరిస్థితులు అనుకూలిస్తే సీఎం కుర్చీ ఎక్కాల్సిన కేరక్టర్… మొన్నటికిమొన్న రేపిస్ట్ రాజు విషయంలోనూ హడావుడిగా త్వరపడి ఓ ట్వీట్ పెట్టి, తరువాత నాలుక కర్చుకుని, అబ్బే, నాకు తప్పుడు సమాచారం వచ్చింది అని సమర్థించుకుని, ట్వీట్ సవరించుకున్నాడు…
కేటీయార్ ట్వీట్‌లోని ఫస్ట్ ఫోటో కూడా ఖమ్మం జిల్లాకు సంబంధించింది కాదు… అది ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించింది… ఇదీ సాక్షిలో వచ్చిన వార్త… 19నాడు అచ్చయిన వార్త… మొత్తానికి అర్థమైంది ఏమిటి..? నాయకులు, పత్రికల వార్తల క్లిప్పింగులు, ట్వీట్లలో వాడే ఫోటోలు అన్నీ నమ్మబుల్ కావు అని..! చూశారుగా ఈ ఉదాహరణలు… అదీ సంగతి..,.,.
Share this Article