.
( Ashok Pothraj )…… “కుడుంబస్తాన్” తమిళం (తెలుగు డబ్బింగ్ జీ5 OTT లో స్ట్రీమింగ్)…
మన దేశంలో ధనవంతులు మరింత ధనవంతులు అవుతున్నారు, పేదవాళ్ళు మరింత పేదవాళ్ళు అవుతున్నారు. దానికి కారణం “ఫైనాన్సియల్ నాలెడ్జ్”…
Ads
రాజకీయ నాయకులు, క్రికెటర్లు, సినిమా హీరోలు, వ్యాపార వేత్తలు యూ ట్యూబ్ లో కానీ, ఏ ఇతర సోషల్ మీడియాలో కానీ “ధనవంతుడు కావటం ఎలా…”? “డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ పెరుగుతాయి…?” అని వెతకరు, వాళ్ళే స్వయంగా ఫైనాన్సియల్ నాలెడ్జ్ పెంచుకుంటారని అంటాడు ఒక రోమన్ తత్వవేత్త.
ఈ సొసైటీలో డబ్బు ప్రధాన భూమిక పోషిస్తుంది. డబ్బే విలువ, డబ్బు సర్వస్వం, అలాంటి డబ్బుని సంపాదించలేని మనిషి జ్యూస్ తీసిన పిప్పితో సమానం.
డబ్బే ఇక్కడ సిస్టమ్… దాని వెనుక కుక్క తోక ఊపినట్టు ఊపుతూ వెళ్లాలి… లేకపోతే మనిషికి ఇప్పుడు విలువ లేదు. డబ్బుతో కూడిన ప్రదాన అంశాన్ని మెజారిటీగా చూపి కథలో వీటినే హైలెట్ చేసాడు.
ఈ విధమైన ఆలోచన కలిగిన ఒక యువకుడు ఒక తక్కువ కులం అమ్మాయిని ప్రేమించి రిజిష్టర్ మ్యారేజ్ చేసుకుంటాడు. పెళ్లి తరువాత జీవితం మరింత అందంగా ఉండాలనే అతడు కోరుకుంటాడు. పెళ్ళి తర్వాత తన భార్య ఇంట్లోనే ఉండి చదువుతూ upsc పరీక్షకు ప్రిపేర్ అవుతుంది.
అందుకు ఇంటర్నెట్, ల్యాప్టాప్ కావాలంటుంది. ఇంకొక వైపు తల్లి తీర్థయాత్రల గోల, తండ్రి పాతబడిన ఇంటిని పునరుద్ధరించాలని నసుగుతూ ఉంటాడు. మరోవైపు అక్కాబావల గోల భరించలేక సతమతమవుతున్న అతనికి ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం పోయి, ఏం చేయాలో తోచక ఆన్లైన్ లోన్ యాప్ ద్వారా డబ్బులు తీసుకుని అప్పులపాలౌతాడు…
అటు తన భార్యకి నిజం చెప్పలేక, ఇటు ఇంట్లో తల్లిదండ్రుల కోరికలు తీర్చలేక, దొరికిన చోటల్లా అప్పులు చేస్తూనే ఒక బేకరీ షాపు అద్దెకు తీసుకుని నడుపుతుంటాడు.
అదీ ఓ నాలుగు రోజులు మాత్రమే ఆనందంగా సాగుతుంది. ఇంతలో అతని షాపుకి ఎదురుగా మరొక బేకరీ షాపు ఓపెన్ అవుతుంది.ఇక్కడి జనాలు ఆ షాపుకి వెళ్తూ ఎగబడి మరీ తింటుంటారు. దీంతో ఇతని వ్యాపారం దివాలా తీస్తుంది.
ఎలాగైనా తన షాపుకి కస్టమర్లను రప్పించాలని తాపత్రయపడి అందుకోసం తీసుకున్న నిర్ణయాలు అతన్ని మరింత అప్పుల ఊబిలోకి నెట్టితే ఎలా ఉంటుందనే అంశం చుట్టూ దర్శకుడు ఈ కథను చూపించాడు.
ఉద్యోగం, చదువు, ఇల్లు, అప్పులు అనే ఓ సగటు మనిషి, వర్తమాన మన జీవితాల్లోని అంశాల చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఇది ప్రతీ మధ్య తరగతి ఇళ్లలో జరిగే విషయమే, ఇవే మెయిన్ పాయింట్స్ గా చేసుకుని దర్శకుడు సినిమా రూపొందించాడు.
ఒక మగాడికి ఈ ఆర్థిక సమస్యల నుంచి అవమానం ఎదురైతే అప్పుడు అతను ఏం చేస్తాడు? అనే దిశగా దర్శకుడు ఉద్విగ్నతలను చూపిస్తూ, మరొకవైపు కామెడీ డ్రామాను జోడించి కథను నడిపించిన తీరు మెప్పిస్తుంది.
జానర్ కి తగిన విధంగానే కథను ముందుండి నడిపించాడు. సంపాదించేవాడికి కాస్త సపోర్టు చేయండి. అనే రిక్వెస్ట్ తో కూడిన సందేశం ఈ కథలో కనిపిస్తుంది. సాధారణంగా ఏ మగాడైనా తన ఆఫీసులో పరిస్థితి బాగుంటే ఇంట్లో భార్యతో, తల్లిదండ్రులతో సంతోషంగా ఉంటాడు. ఇంట్లో హ్యాపీగా ఉంటేనే ఆఫీసులో అందరితో సరదాగా ఉంటాడు. కానీ.. ఈ రెండు చోట్లా మనఃశాంతి లేకపోతే ఫ్రెండ్స్ తోనే ఎక్కువగా ఉంటాడనే దిశగా దర్శకుడు చూపించిన తీరు ఆకట్టుకుంటుంది.
సహజత్వానికి దగ్గరగా ఉన్న ఈ కంటెంట్ ఆడియన్స్ ని మెప్పిస్తూ మంచి ప్రయత్నం చేసి దర్శకుడు రాజేశ్వర్ కలిసామి, హీరో మణికందన్ సక్సెస్ అయ్యారు… ప్రేమ,పెళ్లి, అప్పు అనే వాగ్వాదాలతో కూడిన ఇలాంటి కుటుంబ హాస్య చిత్రాలను ప్రేక్షకులు ఎప్పటికీ ఆదరిస్తూనే ఉంటారు. జీ5లో తెలుగులో ఉంది వీలైతే చూసేయండి. చక్కటి కామెడీ మరియు బాధ్యతాయుతమైన భావోధ్వేగాలతో కూడిన సినిమా…
Share this Article