.
డెస్టినేషన్ వెడ్డింగులకు పెట్టిన కోట కుంభల్ గఢ్
ఏ కోట చూసినా ఏమున్నది గర్వకారణం? అని ప్రశ్నించుకుని కోటగోడ లోతుల్లోకి వెళితే సమాధానంగా ఎన్నెన్నో గర్వకారణాలు దొరుకుతాయి. ప్రపంచంలో చైనా కోట గోడ తరువాత రెండో అతిపెద్ద కోటగోడ రాజస్థాన్ లో కుంభల్ గఢ్ లో ఉంది. ఉదయ్ పూర్ కు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న కుంభల్ గఢ్ చూసి తీరాల్సిన ప్రదేశం. శత్రుదుర్భేద్యమైన ఈ కోట గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియాగా పేరు పొందింది.
Ads
అప్పటికే ఉన్న కోటను పదిహేనో శతాబ్దంలో మేవాడ్ రాజు రాణా కుంభ మరింత విస్తరించాడు. మరింత ఎత్తు పెంచి…బలంగా నిర్మించాడు. మహారాణా ప్రతాప్ పుట్టింది ఈ కోటలోనే. 13 కొండలను కలుపుతూ, ఏడు మహాద్వారాలతో నిర్మించారు.
యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించిన ఈ కోటను మొదట నిర్మించింది మౌర్యరాజు సంప్రతి. మేవాడ్ రాజు రాణా కుంభ నాటికి ప్రఖ్యాత వాస్తు శిల్పి “మండన్” ఆధ్వర్యంలో కోట కొత్త మెరుగులు దిద్దుకుంది. తన ఆధ్వర్యంలో ఉండిన 82 కోటలలో 32 కోటలను కుంభ పునర్నిర్మించాడు. అందులో కుంభల్ గఢ్ అతి పెద్దది.
1457లో గుజరాత్ రాజు అహ్మద్ షా కుంభల్ గఢ్ మీద దాడి చేశాడు. కానీ కోటను జయించలేక…వెనుదిరిగాడు. 1458, 1459, 1467లో ఖిల్జీ సేనలు కూడా కోటను ఆక్రమించుకోవడానికి ప్రయత్నించి…విఫలమయ్యాయి. మొఘల్ చక్రవర్తి అక్బర్ సేనాధిపతి షాబాజ్ ఖాన్ 1577, 1578లో వరుసగా దాడులు చేసి…కోటను స్వాధీనం చేసుకున్నాడు. అయితే అతి కష్టం మీద 1583లో మహారాణా ప్రతాప్ తిరిగి కోటను దక్కించుకోగలిగాడు. 1818 తరువాత కోట బ్రిటిష్ వారి చేతుల్లోకి వెళ్లిపోయింది.
36 కిలోమీటర్ల మేర నిర్మించిన కోటే దానికదిగా ఒక చరిత్ర. కోట గోడ మందం పదిహేను అడుగులు. ఎత్తు యాభై అడుగుల పైనే. శత్రువులు కోటను ఎక్కడానికి వీల్లేకుండా ఏటవాలుగా, జారిపోయేలా, పట్టు చిక్కనట్లుగా నిర్మించారు. పైనుండి బాణాలు వేయడానికి, మందుగుండు పేల్చడానికి కన్నాలు పెట్టారు.
1513 నుండి నిర్మించిన జైన దేవాలయాలు కూడా తోడై కోట లోపల మొత్తం 360 ఆలయాలున్నాయి. రాజస్థాన్ పర్యాటకశాఖ కోటలో లైట్ అండ్ సౌండ్ షో ఏర్పాటు చేసింది. రాజస్థానీ సంస్కృతి సంప్రదాయాలు తెలిసేలా ప్రతి ఏటా మూడు రోజులపాటు ప్రత్యేక ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.
1457 నుండి పదేళ్లపాటు శత్రువులు ఈ కోటను గెలవలేకపోవడానికి కారణం- కోటలోపలి ప్రధాన ఆలయంలో జగన్మాత రక్షించడమే అని ఆరోజుల్లో ప్రచారంలో ఉండేదట. దాంతో 1467లో శత్రువులు మొదట ఈ ఆలయంలో జగన్మాత విగ్రహాన్ని ధ్వంసం చేసి తరువాతే కోటను స్వాధీనం చేసుకున్నారని చెబుతారు.
అంతటి మహా సౌధాలు, దర్బార్ లు, ఉద్యానవనాలు, ఈత కొలనులు, ఆలయాలు ఇప్పుడు డెస్టినేషన్ వెడ్డింగ్ లకు వేదికలయ్యాయి. మీ చేతిలో ఒక యాభై లక్షలుంటే మీరో దర్బార్ హాల్ బుక్ చేసుకుని వైభవంగా పెళ్లి చేసుకోవచ్చు. పక్కనే నక్షత్రాల హోటళ్లు బుక్ చేసుకోవడానికి రోజుకు రెండు కోట్లే. కుంభల్ గఢ్ కోటలో బాగా పొదుపుగా పెళ్లి చేసుకోవాలంటే ముష్టి మూడు కోట్లున్నా ఏ మూలకూ చాలదని గైడ్లు నవ్వుతూ చెబుతున్నారు. పది కోట్లు పారబోస్తే ఒకమాదిరి పెళ్లి. పాతిక కోట్లు కుమ్మరిస్తే రాణా కుంభ లెవెల్లో పెళ్లి! మహారాణా ప్రతాప్ లేచొచ్చి నవదంపతులను ఆశీర్వదిస్తాడేమో!
నిజమే. రాజులే పోయారు. రాజరికం మీద మన మోజు పోలేదు!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article