కొన్ని సినిమాలు ఓటీటీలో కనిపిస్తాయి… డబ్ చేయబడి ఉంటాయి… డబ్ చేయకపోయినా పర్లేదు, మనల్ని చిన్నతనంలోకి అనగా వెనుకటి రోజుల్లోకి అమాంతం ఎత్తుకుపోతాయి… నాస్తాల్జిక్… వాటితో మనం కనెక్టవుతాయి… పెద్ద తారాగణం, భారీ ఖర్చు, అట్టహాసాలు, ఫైట్లు, పాటలు, ఐటమ్ సాంగ్స్, రొమాన్స్ గట్రా ఏమీ ఉండవు… ఐనా మనల్ని మనదైన మన పాత ప్రపంచంలోకి తీసుకుపోతాయి…
కురంగు పెడల్ అనే సినిమా కూడా అంతే… తమిళం నుంచి తెలుగుకు డబ్బయింది… 1980 ప్రాంతాల్లో పూర్తిగా గ్రామీణ వాతావరణంలోని కథ అది… సరికొత్త కథ… ఎక్కడా అసభ్యకరమైన సీన్లు, వెగటు ఆరబోతలు, వెకిలి కామెడీ ఉండదు… తెర మీద నెత్తుటి ధారలు, నరుకుడు, చంపుడు కూడా ఉండదు… కత్తులు కటార్లు తుపాకులు తూటాల మాటే లేదు…
క్లీన్ సినిమా… జస్ట్, సైకిల్ లేని ఓ పేద పిల్లాడు… ఎలాగైనా సైకిల్ నేర్చుకోవాలని ప్రయత్నం… 70, 80 లలో కూడా చాలామందికి సైకిల్ ఓ కల… సైకిల్ ఉన్నవాడు తోపు… గంటకు రూపాయో రెండు రూపాయలో, ఆఠాణో, చారాణో అద్దెకు తీసుకుని నేర్చుకోవడం, తిప్పడం ఓ సరదా… సైకిల్ తొక్కడం రాదంటే వాడు వేస్ట్ గాడు…
Ads
అంతేనా..? ఇదే సినిమాలో అప్పటి పిల్లలాటలు… అంటే బావుల్లో, చెరువుల్లో ఈతలు గట్రా… మనల్ని మన బాల్యంలోకి, బడి రోజుల్లోకి తీసుకుపోతాయి… సినిమా డబ్బింగ్ కూడా నీటుగా ఉంది… కంగాళీతనం లేకుండా… ఒక సైకిల్ కోసం ఓ పిల్లాడు పాడే పాట్లు, పిల్లల నడుమ సైకిల్ రేస్… అంతా ఓ కొత్త కథ… దర్శకనిర్మాతల టేస్టు భేష్… దీనికి మ్యూజిక్ గిబ్రాన్…
కింద పడకుండా, దెబ్బ తగలకుండా, నొప్పి లేకుండా ఎవడూ సైకిల్ నేర్చుకోలేడు అప్పట్లో… ఇప్పటి కాలం వేరు… అప్పట్లో పల్లెల్లో సైకిల్ నేర్చుకోవాలంటే, ఎవడో సైకిల్ దయతలిచి ఇవ్వాలి… భయంభయంగానే ఎదుటోళ్లను చూస్తూ మొదట కాంచీ (కాంచీట్)… కాళ్లతో నెట్టుతూ, మెల్లిమెల్లిగా కాళ్లు పైకి లేపి పెడల్ తొక్కుతూ ఆరంభ దశ… ఎక్కువగా కిందపడి మోకాళ్లు కొట్టుకుపోయేది ఆ దశలోనే…
తరువాత బొంగు… అప్పటికి సైకిల్ మీద కాస్త గ్రిప్ వస్తుంది… కాకపోతే ఎదుటోళ్లు వేగంగా నేర్చేసుకుని, సీటు డ్రైవింగ్ కూడా నేర్చేసుకుని, కొందరైతే స్టయిల్‌గా క్యారియర్ సైకిలింగ్ కూడా చేస్తుంటే… మనకెందుకు వేగంగా రావడం లేదనే బాధ… ఎలాగోలా సైకిల్ నేర్చేసుకుంటే టెన్త్ పాసైనంత గ్రేటు… ఈత, సైకిల్ రెండు రానివాడు అప్పట్లో ఎందుకూ పనికిరాడు అన్నట్టు చూసేరోజులవి… డబుల్, ట్రిపుల్ సవారీ చేసేవాడు ఇంకా తోపు అన్నమాట…
సొంత సైకిల్ అయితే ఓవరాయిలింగ్, చెయిన్‌కు కొబ్బరినూనె, లేదంటే ఆయిల్, డబ్బులున్నోడికి డైనమా, ఫ్రంట్ క్యారియర్, బొంగుకు కవర్, గిర్రలల్ల పూసలు… అబ్బో, ఒక్క కథ కాదు… ఈ సినిమా చూశాక మిత్రుడు సార్ల శ్రీనివాస్ రాసుకున్న ఓ ఫేస్ బుక్ పోస్టు ఓసారి చదవండి… కాకపోతే బాగా తెలంగాణ యాస తెలిసినవాళ్లకు కనెక్ట్ అవుతుంది… ఇలా… (ఇది శివ కార్తికేయన్ నిర్మించిన సినిమా…)(అమెజాన్ ప్రైమ్ ఓటీటీ)(పేరుకు పిల్లల సినిమా, కానీ పెద్దలకే కనెక్టయ్యేది…)
Share this Article