బంగారంపై సుంకం తగ్గింపు, స్మగ్లింగు తగ్గుతుంది, ధరలు తగ్గుతాయి… మొబైల్స్ ధరలు తగ్గుతాయి… ఇంకా ఏమేం తగ్గుతాయి..? ఏమేం పెరుగుతాయి అనే చర్చ, ఆసక్తి ప్రతి బడ్జెట్ సమయంలోనూ ఉండేదే…
కేపిటల్ గెయిన్స్ మీద ఏకంగా 12.5 శాతం పెంపుతో స్టాక్ మార్కెట్‌లో రక్తకన్నీరు… స్టాండర్డ్ డిడక్షన్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉద్యోగులకు కూడా నిరాశ… ఎంతోకాలంగా చూస్తున్నదే కదా… నిర్మల సీతారామన్ జనానికి కనెక్టయ్యే ఏ బడ్జెట్‌నూ ప్రవేశపెట్టలేదు, పైగా ఆమెది వరుస బడ్జెట్ ప్రజెంటేషన్లలో రికార్డు అట… కరోనా సమయంలో చూశాం కదా ఆమె పనితీరు, అఫ్ కోర్స్, మోడీ చెప్పినట్టు చేస్తుంది, ఫాఫం, ఆమె తప్పేముంది..?
అసలు జరగాల్సిన చర్చ ఇది కాదు… ఏపీ, బీహార్ రాష్ట్రాల పట్ల ఔదార్యం కనబరచడం… నితిశ్, చంద్రబాబుల మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉండటంతో వాళ్లు అడిగినంత కాకపోయినా చాలా ప్రేమను కనబరిచాడు మోడీ ఆ రెండు రాష్ట్రాల మీద… సంతోషమే… కానీ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్టు ఖచ్చితంగా ఇది ‘కుర్చీ బచావో బడ్జెట్’ కాదా మోడీ భాయ్..?
Ads
వాళ్ల అవసరం రాజకీయంగా ఉంది కాబట్టి… వాళ్లను ఎప్పుడూ నమ్మలేం కాబట్టి… ఎప్పుడు కాడి కింద పడేస్తారో కూడా తెలియదు కాబట్టి… వాళ్లను ప్లీజ్ చేసుకోవడం..! మరి నిన్ను అధికారంలోకి తీసుకొచ్చిన ఇతర రాష్ట్రాల మాటేమిటి..? ప్రతిపక్ష ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలు ఏం పాపం చేశాయి..? వాళ్లు ఈ దేశంలోని ప్రజలు కారా..? అసలు దేశాన్ని ఒక యూనిట్‌గా చూడాలి తప్ప… రాజకీయ అవసరాలను బట్టి, పార్టీలతో పొత్తు అనివార్యతలను బట్టి కొన్ని రాష్ట్రాలకు ప్రేమ, కొన్ని రాష్ట్రాలకు నిర్దయ పంచుతారా..? ఇదేం రాజనీతిజ్ఞత..? అసలు స్టేట్స్‌మన్ అనే పదానికి అర్థం తెలుసా మోడీకి..?
పోనీ, అమరావతికో, చంద్రబాబుకో కట్నం పెడుతున్నావు సరే… మరి గత అయిదేళ్లూ జగన్ కూడా నీ మద్దతుదారే కదా… భయానికో, భక్తికో సాగిలబడినవాడే కదా… మరి ఆ అయిదేళ్లూ ఏమీ ఇవ్వలేదెందుకు..? చంద్రబాబు ఎప్పుడు యూటర్న్ తీసుకుంటాడో తెలియదు కాబట్టి నిధులివ్వాలా..? దేశ ఆర్థికరథాన్ని నిర్దేశించే బడ్జెట్‌కు మరీ ఇంతగా పొలిటికల్ డైనమిక్స్ అవసరమా..?
తెలంగాణలో పార్టీ పుంజుకోవాలట, సొంతంగా అధికారంలోకి రావాలట… కానీ నయా పైసా విదిలించడట… ఇదేం రాజనీతి..? సంకీర్ణధర్మం అనే ఓ బ్రహ్మపదార్థం వంటి పదం ఉంటుంది… వాజపేయి కూడా సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపినవాడే… కానీ ఎవరి ఎదుటా సాగిలపడలేదు… 13 రోజులు, 13 నెలల ప్రభుత్వాల్నీ జస్ట్, అలా వదిలేసుకున్న రోజులవి… తను రాజనీతిజ్ఞుడు… మరి మోడీ..?
(Cartoon :: Mrutyunjay)
అందుకే ఈ బడ్జెట్‌ను సమతుల్య బడ్జెట్ అని కీర్తించిన కిషన్ రెడ్డి వ్యాఖ్యలు నవ్వు పుట్టించాయి… కొన్ని రాష్ట్రాల విస్లళ్లలో ఎక్కువ ధమ్ బిర్యానీ, స్వీట్ హల్వా పెట్టి, మరికొన్ని రాష్ట్రాల విస్తళ్లలో నాలుగు పచ్చడి మెతుకులూ విదిల్చలేని బడ్జెట్ సమతుల్యం ఎలా అయ్యింది నాయకా..? ఎనిమిది మంది ఎంపీలున్నారు తెలంగాణలో… చెప్పుకోవడానికి మాత్రం ఏమీ లేదు..!!
Share this Article