Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎంత డబ్బిచ్చినా సరే.., మోహన్‌బాబుతో మాత్రం పోను అంటుందామె..!!

June 4, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ……..  సినిమాలన్నీ సందేశాలనో వినోదాన్నో ఇవ్వవు . సమాజంలో ఉండే ఒక రుగ్మతను లేదా సమస్యను తీసుకుని దానిని ప్రేక్షకులకు పరిచయం చేయటమో , వివరించటమో , జాగ్రత్తగా ఉండండని చెప్పటమో జరుగుతుంది .

సాధారణంగా ఇలాంటి కధావస్తువుతో సినిమాలను బాలచందర్ ఎక్కువగా తీసారు . ఒకప్పుడు మన తెలుగు వారు కూడా తీసారు . 1970s నుండి ఇలాంటి సినిమాలు తీసేవారు తగ్గిపోయారు . మళ్ళా అలాంటి ప్రయత్నం 1980 s తర్వాత దాసరి నారాయణరావు చేసారు .

Ads

1984 లో వచ్చిన ఈ కురుక్షేత్రంలో సీత సినిమా చిత్రానువాదం , మాటలు దాసరే వ్రాసారు . దర్శకత్వం బి వి ప్రసాద్ చేసారు . బహుశా తనకు టైం లేక ఆయనకు ఏమయినా ఇచ్చారేమో !!

టైటిల్ పాత్ర జయసుధది కాదు . అయినా షీరో మాత్రం ఆమే . చాలా గొప్పగా నటించింది . Women trafficking సమస్య మీద తీయబడిన సినిమా . వ్యభిచారంలోకి లాగేందుకు కట్నకానుకలు ఇచ్చుకోలేక ఇబ్బందులు పడే కుటుంబాలను పట్టుకుని , పెళ్ళి చేసుకుని వేశ్యాగృహాలకు అమ్ముతుంటాడు మోహన్ బాబు . వేశ్యాగృహాన్ని రాజసులోచన , త్యాగరాజు నడుపుతుంటారు .

ఆ కూపంలో ఇరుక్కుపోతుంది జయసుధ . కొత్తగా ఎవరినీ ఆ వృత్తి లోకి ఆ ఇంట్లో దింపకుండా అడ్డం పడుతుంటుంది . జానకి పాత్రధారిణి అంబికను మోహన్ బాబు మోసంతో పెళ్లి చేసుకుని ఆ కూపంలో వదిలి వెళ్ళిపోతాడు . తనకు తాళి కట్టింది నిజమైన భర్తే అని నమ్మి , అతని కోసమే నిరీక్షిస్తూ ఉంటుంది అమాయకురాలు .

ఈ సీతను తార్చకుండా జయసుధ అడ్డం పడుతూ ఉంటుంది . సినిమా ముగింపులో మోహన్ బాబుకి కనువిప్పు కలిగించి ఆ వ్యభిచార కురుక్షేత్రంలో ఇరుక్కుపోయిన సీతకు , ఇతర స్త్రీలకు విముక్తి కలిగిస్తుంది .
ఈ సినిమాలో జయసుధ పాత్ర తర్వాత గొప్ప పాత్ర గొల్లపూడి మారుతీరావుది .

చింతామణి నాటకంలో భవానీ శంకరుడు గుర్తుకొస్తాడు . ఆ వేశ్యావీధికి వచ్చే వారందరికీ తలంటి పోస్తూ సమాజం మీద , వ్యక్తుల మీద చెణుకులు విసురుతూ ఉంటాడు . ఆ పాత్రను , ఆ పాత్ర మాటల్ని దాసరి గొప్పగా ఆవిష్కరించారు .

సినిమా చివర్లో ఓ వేశ్య డబ్బులు ఇచ్చినా మోహన్ బాబుతో వెళ్ళటానికి నిరాకరిస్తుంది . ఎంత డబ్బు ఇచ్చినా తార్పుడు గాడితో రానని అంటుంది . చాలా పదునైన డైలాగుని వ్రాసారు దాసరి .

ఇతర ప్రధాన పాత్రల్లో నిర్మలమ్మ , సాక్షి రంగారావు , అన్నపూర్ణ , మురళీమోహన్ , కృష్ణవేణి , ప్రభృతులు నటించారు . తూర్పు గోదావరి జిల్లాలోని సీతానగరం , చిన కొండేపూడి గ్రామాలలో షూటింగ్ చేసారు . రమేష్ నాయుడు సంగీత దర్శకత్వంలో పాటలన్నీ సంగీతపరంగా చాలా శ్రావ్యంగా ఉన్నా , కొన్ని మాత్రమే ప్రేక్షకులకు రీచ్ అయ్యాయి .

సినిమా ప్రారంభంలోనే వచ్చే రామా శ్రీరామా అంటూ సాగే రామాలయంలో పాట చాలా బాగుంటుంది . ఇది మాటలు రాని వేళ మొహమాటం తీరే వేళ పాట అంబిక , మోహన్ బాబుల మీద చాలా శ్రావ్యంగా ఉంటుంది . వినరా వినరా అని విటులకు తలంటు పోస్తూ గొల్లపూడి , అతని వానర సైన్యం టీజింగ్ పాట బాగుంటుంది .

మానవుడు దానవుడు సినిమాలోలాగా ఎవరు వీరు అంటూ వేశ్యల బతుకుల మీద పాట బాగానే ఉంటుంది .
టివిలో అప్పుడప్పుడూ వస్తూ ఉంటుంది . నేను టివి లోనే చూసా . సినిమా స్పీడుగా తీసే అవకాశం ఉన్నా , మరెందుకనో కాస్త స్లోగా నడిపించారు .

ఇలాంటి కధావస్తువుల మీద ఆసక్తి ఉన్నవారికి నచ్చుతుంది . జయసుధ అభిమానులకు బాగా నచ్చుతుంది . యూట్యూబులో ఉంది . ఆసక్తి కలవారు చూడవచ్చు . చూడతగ్గ సినిమాయే . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వారసత్వమంటే బీజేపీకి పడదట… కానీ టీ-స్టేట్ కమిటీలో ఆరుగురు వాళ్లే..!!
  • కేసీయార్ స్కామ్స్ చూసీచూడనట్లు వదిలేయాలా… ఎందుకు..?!
  • నేపాల్ తాత్కాలిక ప్రధానిగా ఈ పచ్చి భారత వ్యతిరేకి పేరు వాపస్…
  • బరేలీ మార్కెట్‌లో పడిపోయిన ‘చెవికమ్మ’ దొరికింది… ఇదుగో ఇదే…
  • అప్పట్లో మహాబాహుబలి… ఆరుగురు ఎంపీలు… ఇద్దరు మంత్రులు, ఓ ఎమ్మెల్యే…
  • పెద్ద దొరవారి ధరణి..! నిఖిల జగమూ నివ్వెరపోయే భారీ భూస్కాం..!!
  • 2 రోజుల్లో నలుగురు ప్రధానులు ఔట్… ఈసారి గ్రహణ బాధితుడు ఎవరు..?
  • శుభమాని ఇల్లు కొనాలంటే… ఈ బ్లూప్రింట్లు తగలేసే గోల ఏమిట్రా…
  • ఓరాకిల్ కాదు, మిరాకిల్..! ఒకే రోజులో 7.3 లక్షల కోట్లు పెరిగిన సంపద..!
  • నటన తెలియనివాళ్ల నుంచీ నటన పిండుకోవడం ఎలాగంటే..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions